శరణు నరసింహా!💥
⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏
💥శరణు నరసింహా!💥
కండ్లు మూసుకుని, మనసు తెరిచి చూడాలే కానీ, రాతిలోనూ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ‘నువ్వు తప్ప మరోగతి లేద’ని శరణు వేడితే సమయాసమయాలు పట్టించుకోకుండా, భక్తుల రక్షణ కోసం పరమాత్మ ఆవిర్భవిస్తాడు అని నిరూపించిన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు.
పుట్టుక నుంచే ప్రహ్లాదుడికి విష్ణువుపై చెప్పలేనంత భక్తి. స్వామి తప్ప మరొక భావన అతని మనసుకు అంటలేదు. ‘చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ’ అని తాను చదివిన ప్రతి అక్షరంలోనూ అనంతశయనుడిని దర్శించిన భక్తశిఖామణి ఆ బాలుడు.
కన్నతండ్రే కష్టాల పాలు చేస్తుంటే ఎవరిని శరణు వేడాలి? ఇక దిక్కెవరు? అంటే... తాను నమ్ముకున్న దైవం నారాయణుడు తప్ప మరొక ఆలోచన లేకపోయింది. ‘ఇందుగలడు అందులేడను సందేహం వలద’ని తన స్వామి సర్వాంతర్యామి అని తేల్చి చెప్పాడు. దైవంపై అంతులేని నమ్మకాన్ని ప్రదర్శించాడు.
కాబట్టి, శరణువేడిన ప్రహ్లాదుడు వేలు ఎక్కడ చూపడం ఆపాడో, అక్కడినుంచే అవతరించి భక్తుడి నమ్మకాన్ని నిరూపించిన భక్తపరాధీనుడు నరసింహుడు.
ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఎటు వైపు చూపిస్తాడో ఎవరికీ తెలియదు. ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవ్వాలి. అందుకనే, హిరణ్యకశిప, ప్రహ్లాద సంవాద సమయంలో స్వామి అక్కడే పరోక్షంగా కంటికి కనిపించకుండా ఉన్నాడు. సమయం రాగానే స్తంభం నుంచి నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు.
ఉగ్ర నరసింహుడుగా అవతరించినా ప్రహ్లాదుడి కోరిక మేరకు పరమ శాంతమూర్తిగా మారిపోయాడు. పరిపూర్ణత సాధించిన శరణాగతికి దక్కిన పుణ్యఫలితం ఇది. అందుకనే నవవిధ భక్తిమార్గాల్లో ప్రహ్లాద శరణాగతి అత్యున్నతంగా నిలిచింది.
నరసింహ అవతారం కేవలం రాక్షస సంహారం కోసం ఆవిర్భవించినది మాత్రమే కాదు. దైవచింతన, దైవంపై నమ్మిక ఎంతటి మహత్తును ప్రకటించగలవో, భక్తికి ఎంతటి అపరిమితమైన శక్తి ఉందో నిరూపించటమే స్వామి అవతార లక్ష్యం. నరసింహ తత్త్వం కూడా అదే!
భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని ప్రకటించే అవతారం ఇది. ఆర్తత్రాణ పరాయణుడిగా, భక్తజన పరిపాలకుడిగా నారాయణుడిని నిరూపించిన మూర్తి నరసింహుడు.
క్షణాల్లో క్రోధాన్ని ఆవాహం చేసుకుని, తమోగుణ ప్రధాన రూపమై, తానే రుద్రుడై శ్రీహరి.. నరసింహస్వామిగా ఆవిర్భవించాడు.
ఉగ్రమూర్తి అయినప్పటికీ ఆయన పూర్తిగా కరుణాంతరంగుడు. కన్నతండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో, పరమాత్మ కూడా అంతే. ఆ ఉగ్రం వెనుకున్న శాంతమూర్తిని దర్శించి, ఉపాసన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
దుష్టులపై జూలు విదిల్చినా.. శిష్టులపై జాలి కురిపించినా.. గోళ్లతో రక్కసుడి పేగులను తుంచినా.. వేళ్లతో బాలభక్తుడి తల నిమిరినా.. చండ్రనిప్పుల కండ్లతో ఆగ్రహించినా.. చల్లని చూపులతో అనుగ్రహించినా.. నరసింహస్వామికే చెల్లింది. రెండు రూపాల మూర్తికి మెండైన కీర్తి. రణం కోరిన వారికి ఉగ్ర నరసింహుడు. శరణు వేడిన భక్తులకు లక్ష్మీ నరసింహుడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment