వైశాఖ అమావాస్య శని జయంతి.

 🕉️⚜️🚩 ఓం శనైశ్చరాయ నమః🌹🙏


నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం


వైశాఖ అమావాస్య నాడు "శని జయంతి" జరుపుతారు. శనైశ్చరునికి సంబంధించిన ఈ తిధిని "శని అమావాస్య" అని కూడా అంటారు.


పురాణాల ప్రకారం.. సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం శని. సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది. ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఛాయకు, సూర్యుడికి పుట్టిన కుమారుడే శని.


కొంతకాలానికి సంజ్ఞాదేవి పుట్టింటి నుంచి తిరిగివస్తుంది. సవతి కుమారుడు కావటంతో శనిని ఆమె సరిగ్గా చూడదు. ఇందుకు కోపించిన శని ఆమెను కాలితో తన్నుతాడు. దీనికి ప్రతిగా సంజ్ఞ, శనిని ‘మందగమనంతో సంచరిస్తావ’ని శపిస్తుంది. అప్పటినుంచి శనికి మందుడనే పేరు ఏర్పడింది. సూర్యుడి చుట్టూ శని నెమ్మదిగా పరిభ్రమించడానికి కారణం కూడా ఇదే.


శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, క్రూరదృక్‌, క్రూరలోచనుడు, పంగుడు, గృధ్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.


కృతయుగం నాటి సందర్భం ఇది. కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినవాడంటూ అతని ప్రత్యేకతలన్నీ గొప్పగా చెబుతాడు. ఇదంతా వింటున్న శివుడికి శనిని ఎక్కువగా పొగుడుతున్నాడని అనిపించింది. ‘శని అంత శక్తి సంపన్నుడైతే నన్ను పట్టుకోవాలని చెప్పు’ అని నారదుడి ద్వారా శనికి వర్తమానం పంపిస్తాడు పరమేశ్వరుడు. శని కూడా ఇందుకు అంగీకరిస్తాడు. శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ నారదుడు శంకరుణ్ని హెచ్చరించి వెళ్లిపోతాడు.


పరమశివుడు ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి, ఓ మర్రిచెట్టు తొర్రలో దాక్కుంటాడు. తెల్లారేసరికి, అక్కడ శని ప్రత్యక్షమై శివుడికి నమస్కరిస్తాడు. ‘నా ప్రభావం వల్ల కైలాసంలో ఉండాల్సిన తమరు ఇలా అడవులపాలయ్యారు స్వామీ!’ అని వినయంగా చెబుతాడు. శని సమయస్ఫూర్తికి, ప్రభావానికి మెచ్చుకున్న ఈశ్వరుడు ఆ రోజు నుంచి ‘ఈశ్వర’ అనే శబ్దం తనతోపాటు శనికి కూడా వర్తిస్తుందని వరమిచ్చాడు. ఆ ఫలితంగా శని, శనీశ్వరుడు అయ్యాడు.


తన రాజ్యంలో ఏర్పడిన కరవు కాటకాలకు శని కారణమని గుర్తించిన దశరథ మహారాజు నేరుగా శనితో యుద్ధానికి సిద్ధపడతాడు. ‘ఇప్పటివరకూ నా పేరు వింటేనే అందరూ హడలిపోయి, తప్పుకొనేవారు. నువ్వు మాత్రమే ధైర్యంగా నాకు ఎదురు నిలబడ్డావు. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను’ అంటూ శని, దశరథుడిని ప్రశంసిస్తాడు. ‘రుష్యశృంగ మహర్షిని అల్లుడుగా చేసుకో, అతను అడుగుపెట్టిన చోట కరవు కాటకాలు ఉండవ’ని ఉపాయం కూడా చెబుతాడు. శని సూచన ప్రకారం దశరథుడు తన కుమార్తె శాంతను రుష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అల్లుడు అడుగు పెట్టిన వెంటనే అయోధ్య సస్యశ్యామలం అవుతుంది.


ఒక రోజు శని, హనుమంతుడి దగ్గరికి వెళ్లి, తన గురించి చెప్పుకొంటాడు. నిన్ను బాధించక తప్పదంటూ తన శక్తి గురించి చెబుతాడు. ‘సరే’ అంటూ, హనుమంతుడు తన శిరస్సు మీద శనిని ఎక్కించుకుంటాడు. ఫలితంగా హనుమ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇది గుర్తించిన హనుమ పెద్ద బండరాయి తెచ్చి, శని నెత్తిమీద పెడతాడు. అది భరించలేక శని, బరువు దించమంటూ హనుమను వేడుకుంటాడు. వెంటనే, శనిని తన తోకకు చుట్టుకుని, సముద్రానికి ప్రదక్షిణలు చెయ్యటం ప్రారంభిస్తాడు ఆంజనేయుడు. దీంతో శనికి శరీరమంతా తీవ్ర గాయాలు అవుతాయి. ఊపిరాడదు. లాభం లేదనుకొని హనుమంతుడిని శరణు కోరుతాడు. ‘నా భక్తులను నువ్వు బాధించకూడదు’ అని ఆజ్ఞాపించి, శనిని విడిచిపెడతాడు హనుమ. అప్పటి నుంచి హనుమంతుడిని ఆరాధించేవారిని శని బాధించడం మానుకుంటాడు. ఈ కారణం వల్లనే జాతకం ప్రకారం శనిదోషం ఉన్నవారికి ఆంజనేయుడిని పూజించమని పండితులు సూచిస్తారు.


జాతక ప్రకారం శని కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే ఆయనతో స్నేహం చెయ్యటం ఒక్కటే మార్గం. ఎప్పుడైతే శని తత్త్వం అర్థమవుతుందో, అప్పుడు మనకు ఆయన మార్గదర్శిగా, గురువుగా సాక్షాత్కరిస్తాడు. ముందుచూపుతో ప్రవర్తించేలా మనల్ని చైతన్యపరుస్తాడు. ప్రాపంచిక సుఖభోగాల నుంచి విముక్తి కలిగిస్తాడు. వివేకంతో వర్తించేలా చేస్తాడు. కష్టానికి తగ్గ ఫలితాన్నిస్తాడు. అర్థవంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.


గోచార రీత్యా ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధితులు శనైశ్చరుడి అనుగ్రహం కోసం యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేస్తే శనైశ్చరుడు సంతృప్తి చెంది శుభాలు కలిగిస్తాడు. బీదసాదలకు అన్నం పెడితే ఆనందంతో చేయూతనిస్తాడు. కార్మికులను ఆదరిస్తే శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఉన్నదాంట్లో ఎంతోకొంత దానం ఇవ్వడం వల్ల శని ప్రసన్నుడు అవుతాడు. ఆంజనేయుడికి ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా కూడా శనైశ్చరుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం