ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
నమస్తే నమస్తే మహాశక్తి పాణే
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే
ఒకచేతిలో మహాశక్తి అయుథాన్ని, ఒకచేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొకచేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయప్రధానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కారాలు.
💥ఆది దంపతులైన శివపార్వతుల అపురూప ప్రేమానుబంధానికి సంకేతం- సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడి సంహారం కోసం కారణజన్ముడిగా ఆయన స్కందుడి పేరిట ఉదయించాడు. అసురత్వాన్ని అంతం చేసుకొని ఆనంద సిద్ధిని అందుకోవడానికి పాటించాల్సిన సాధనా సంవిధానాన్ని సుబ్రహ్మణ్య తత్వం ఆవిష్కరిస్తుంది. అంతఃకరణ శుద్ధితో జ్ఞానశక్తి ద్వారా సుగుణవంతమైన జీవన మార్గంలో పయనించాలని స్వామి సందేశం!
‘స్వామి’ నామధేయం సుబ్రహ్మణ్యానికే ప్రత్యేకం. ‘సుబ్రహ్మణ్యుడు’ అంటే, శ్రేష్ఠమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన సాధకుడని సంకేతార్థం. ప్రతికూలతల్ని అధిగమించి, అవరోధాల్ని అధిరోహించి లోకోత్తరమైన లక్ష్యసిద్ధిని ఎలా అందుకోవాలో ‘కుమార సంభవం’ వృత్తాంతం చాటిచెబుతుంది.
మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యుడు అవతరించాడంటారు. ఇదే సుబ్రహ్మణ్య షష్ఠి! మహాతేజోమూర్తి అయిన కుమారస్వామిని ఈ తిథినాడు ఆరాధిస్తారు కాబట్టి- దీన్ని చంపా షష్ఠి, కుమార షష్ఠి, మంగళ షష్ఠి, కార్తికేయ షష్ఠి అనీ వ్యవహరిస్తారు. గుహప్రియా వ్రతం, ఫల షష్ఠి వ్రతం, ప్రావరణ షష్ఠి వ్రతం వంటి విధులతో వ్రత విధానంగానూ ఈ పండుగ చేసుకుంటారు. ప్రావరణం అంటే ఉత్తరీయం, కంబళి. మార్గశీర్ష మాసం చలి వాతావరణంతో కూడి ఉంటుంది. ప్రావరణ వ్రతంలో భాగంగా- దుప్పట్లు, కంబళ్లు దానం చేస్తారు.
శివ తనయుడైన కుమరేశుడి ఆవిర్భావం ఎంతో విలక్షణం. శ్రీమద్రామాయణంతో పాటు స్కంద, శివ పురాణాలు షణ్ముఖ జననాన్ని విశదపరచాయి. అవ్యక్తమైన శివ స్వరూపం నుంచి అభివ్యక్తమైన తేజోకిరణం ఆకాశంలో పయనించేటప్పుడు- దాన్ని వాయువు, అగ్ని, గంగ, భూమి... ఇలా ఒకటి తరవాత మరొకటి స్వీకరించిన ఫలితంగా ఆ ఆకృతి ఏర్పడిందంటారు. ఆ స్వరూపమే కుమారస్వామి- అని పురాణ కథనం.
పంచభూతాల పంచీకరణం అంటే సమ్మేళనం! మానవుడిది స్థూల దేహం. అవ్యక్తం నుంచి ఆకాశం, దాని నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని ఉద్భవించాయి. అగ్ని నుంచి నీరు, దాని నుంచి భూమి ఆవిర్భవించాయనీ ‘వివేక చూడామణి’ కర్త జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించారు. ఆయన సూత్రీకరించినట్లు, సృష్టి క్రమ పరిణామ వికాసం సుబ్రహ్మణ్య ఆవిర్భావంలో ప్రస్ఫుటమవుతుంది.
ఆరుగురు కృత్తికా దేవతల ఆశీర్వాద శక్తితో ఆరు ముఖాల షణ్ముఖుడిగా స్వామి తేజరిల్లాడు. ఆయనది నెమలి వాహనం విహరించే రూపం. శూర పద్మాసురుణ్ని వధించిన స్వరూపం. భక్తులకు అభయాన్ని ప్రసాదించే ఆకృతి ఆయనది. దండాయుధ పాణిగా వీరత్వాన్ని ప్రకటించే రూపమూ అదే! శివపరమాత్మతో జ్ఞాన చర్చలు సాగించే స్వరూపం ఆ స్వామిది. లౌకిక పరమైన సంపదల్ని అనుగ్రహించే ఆకృతి అది. ఆ మూర్తిమత్వమే ఏకీకృతమై ‘ఆర్ముగం’గా సుబ్రహ్మణ్యుడు వర్ధిల్లుతున్నాడు.
షడాననుడైన స్వామిని షడాక్షరీ మంత్రంతో ఉపాసిస్తారు. వేదాల్లో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని ప్రతిబింబంగా ‘స్వామి’ని పేర్కొంటారు. ఆరు ముఖాలు, ఆరు రుతువులు; పన్నెండు చేతులు, పన్నెండు మాసాలతో కాలాగ్ని రూపకంగా సంవత్సరాగ్ని ప్రకటితమవుతుంది. దహించడం అగ్ని లక్షణం. కరిగిపోవడం కాలానికి సహజ ప్రవృత్తి. దహించుకుపోయే కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీవన పరమార్థం సాధించాలన్నది స్వామి వచనం!
శరవణుడి చెంత గల నెమలి, తన కాళ్ల కింద సర్పాన్ని తొక్కిపట్టి ఉంచుతుంది. నెమలి- కోరికల అతీతత్వానికి చిహ్నం. పాము అహంకారానికి, దాని కోరలు రాగద్వేషాలకు సూచికలు. కోరికల్ని జయించడంతో పాటు అహంకారాన్ని అదుపులో ఉంచుకున్నప్పుడే వ్యక్తి పూర్ణత్వాన్ని అందుకుంటాడని ఈ రెండింటి ద్వారా స్వామి ఉద్బోధిస్తాడు. భక్తి, జ్ఞాన, యోగ సంబంధిత అంశాలెన్నింటినో సుబ్రహ్మణ్యస్వామి మూర్తిమత్వం సుబోధకం చేస్తుంది. వాటిని తమ జీవన గమనానికి అన్వయించుకోవడమే, స్వామికి భక్తులు జరపాల్సిన అసలైన ఆరాధన!
సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా వుంది.
సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి.
అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా వుంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment