🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏
🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏
పూలతో దేవతలను కొలవడం సర్వసాధారణం.
కానీ పూలనే పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ.
దేవీ నవరాత్రులలో జ్ఞానపదులు శిష్టాచారంతో అమ్మను పూజిస్తే.. జానపదులు పసుపుతో గౌరిని చేసి మొక్కే తత్త్వమే బతుకమ్మ.
చేను చెలకల్లో, గుట్టల్లో పూసే గునుగు, తంగేడు, అడవి చేమంతి, కట్లపూలు, ముత్యాల పూలు, గడ్డిపూలు మొదలైన అడవి పూలకు చేసే అర్చనే.. బతుకమ్మ పండుగ.
బతుకమ్మ తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూలపండుగ.
భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుక జరుపుకొంటారు.
అమావాస్య రోజున పెత్రామాస, చిన్న బతుకమ్మ, "ఎంగిలిపూల" బతుకమ్మ.. ఇలా వివిధ పేర్లతో మొదటి రోజు చిన్న బతుకమ్మ ప్రారంభమవుతుంది.
తదుపరి అష్టమి రోజున "సద్దుల" బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో పూర్తి అవుతుంది.
ఎంగిలి పూల బతుకమ్మ పితృపక్షాలలో వస్తుంది.
అమావాస్య నాడు తమ పితృ దేవతలు వచ్చి, ఎంగిలిపడి వెళ్తారని, అందువల్లే ఈ పండుగను ఎంగిలి పూల బతుకమ్మ అంటారని పెద్దల మాట.
💥పండుగకు పక్షం రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.
ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకుంటారు.
కైలాసపతి సతి గౌరమ్మను (పార్వతిని) తమ పెద్దక్కగా భావించి, స్వాగతించడానికి ఎదురుచూస్తారు.
'పితర అమావాస్య’ (మహాలయ అమావాస్య) నాడు ఈ వేడుకలు మొదలవుతాయి.
ఆ రోజున ‘ఎంగిలి బతుకమ్మ’గా గౌరీదేవిని సంభావించి... ఆరాధిస్తారు.
అలా రోజుకొక్క పేరుతో అమ్మవారిని పూజిస్తారు.
బతుకమ్మల రూపు, కూర్పు, పేర్పు విలక్షణంగా ఉంటుంది. రకరకాల పూలను కింది నుంచి శిఖరం వరకూ వరుసల్లో పేరుస్తారు.
త్రికోణాకారంలో పేర్చిన బతుకమ్మ పైన పసుపు ముద్దను... గౌరమ్మకు ప్రతీకగా ఉంచి... ధూప, దీప, నివేదనలతో పూజిస్తారు.
తొలిరోజున ‘ఎంగిలిపూల బతుకమ్మ’,
రెండో రోజున ‘అటుకుల బతుకమ్మ’,
మూడో రోజున ‘ముద్దపప్పు బతుకమ్మ’,
నాలుగో రోజున ‘నానుబియ్యం బతుకమ్మ’,
అయిదో రోజున ‘అట్ల బతుకమ్మ’,
ఆరో రోజున ‘అలిగిన బతుకమ్మ’,
ఏడో రోజున ‘వేపకాయల బతుకమ్మ’,
ఎనిమిదో రోజున ‘వెన్నముద్దల బతుకమ్మ’,
తొమ్మిదో రోజున ‘సద్దుల బతుకమ్మ’...
ఇలా రోజుకో పేరుతో అమ్మవారిని కొలుస్తారు.
ఆరో రోజున... ‘అలిగిన బతుకమ్మ’కు నివేదన ఉండదు. మిగిలిన రోజుల్లో రకరకాల పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెడతారు.
సంబరాల్లో చివరి రోజైన అష్టమి (దుర్గాష్టమి) నాడు... ప్రతి ఇంటి నుంచి బతుకమ్మలను ఊరేగిస్తూ.. చెరువుల వద్దకు చేరుకుంటారు.
విశాలమైన ప్రదేశంలో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతారు, నృత్యాలు చేస్తారు.
‘మాయమ్మ లక్ష్మీదేవి పోయిరావమ్మా... మళ్లీ నాటికి తోలుకొత్తుమాయమ్మా’ అని వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేస్తారు.
ఆడుతూ, పాడుతూ, చుట్టూతా తిరుగుతూ అమ్మను ఆరాధిస్తూ, ఈ ప్రకృతే పరమాత్మ అని తలుస్తూ..
మన అస్తిత్వం, చిహ్నం అనుకున్న మన పండుగ రూపురేఖలు మారకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ,
ఆ అడవి పూల మధ్య ఆనందిద్దాం!
అమ్మను కొలుద్దాం! పూలను అర్చిద్దాం. పాటను ప్రేమిద్దాం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment