💥శ్రీ ఆదిశంకరుల విరచిత.. శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం – భావ సహితం.
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
💥శ్రీ ఆదిశంకరుల విరచిత..
శ్రీ మహాగణేశ పంచరత్న స్తోత్రం – భావ సహితం.
💥శ్రీమహాగణేశ_పంచరత్నం💥
ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥
#భావము:
సంతోషముతో (మోదముతో) మోదకములను రెండు చేతులా గ్రహించి, సదా విముక్తిని (మోక్షమును) కలుగజేసెడి, అందుకు గుర్తుగా చంద్రవంకనుధరించెడి, విలాసించుచు లోకములను రక్షించెడి శ్రీ వినాయకునకు నమస్కారము. నాయకులు లేని వారలకు నాయకుడైనట్టి (దిక్కులేని వారికి అన్ని దిక్కులు తానైనట్టి), గజాసుర వధకు కారణమైనట్టి, భక్తుల పాలిట అశుభములను హేలగా తృంచునట్టి, తనకన్న వేరొకటి లేనట్టి శ్రీ వినాయకునికి నమస్కారము.
నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥
#భావము:
నయితి అన్న భావనను వదిలి అహంకరించు వారికి భీకర స్వరూపుడై విఘ్నములను కలిగించెడి, అప్పుడే ఉదయించిన బాల సూర్యునివలె ప్రకాశించునట్టియు, ఆశ్రయించిన వారిని ఆపదలనుండి ఉధ్ధరించునటువంటి, దేవులకు దేవుడు, సమస్త నిధులను కృపచేయ గలిగినట్టి ఈశ్వర స్వరూపుడు, గణములకు ఈశ్వరుడు, తానే మహేశ్వరుడైనట్టి (ఆత్మావై పుత్రనామసి) ఆ పరాత్పరుడైన (అన్ని తత్వములకన్న అధికమైనట్టి మాయ కన్నా అధికుడైన), బ్రహ్మమే అగు శ్రీ వినాయకునికి నమస్కారము.
సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥
#భావము:
అన్ని లోకములకు శుభములను చేకూర్చెడివాడును, గొప్ప గొప్ప రక్కసులను తొలగించిన వాడును, తక్కువకాని బొజ్జ కలిగి మహోత్తముడై ఉత్తమమైన గజవదనము కలవాడు, గొప్ప దయ, కృప, క్షమ, ఓర్పు కలవాడు, ఎల్లప్పుడు సంతోషములను చేకూర్చెడివాడు, గొప్ప కీర్తి కలిగించెడివాడు, నమస్కరించువారలకు మంచి మనస్సునిచ్చువాడు, గొప్ప కాంతి కలవాడునగు శ్రీ వినాయకునకు నమస్కారము.
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥
#భావము:
దరిద్రుల దారిద్ర్యబాధల పోగొట్టునదియు, వేదములచే ప్రతిపాదితమైనదియు, త్రిపురహరుని జ్యేష్ఠ పుత్రునివలె వెలుగొందునట్టియు, దేవతలయొక్క శత్రువుల గర్వమును భంజించునట్టియు (నమిలివేయునట్టియు), ప్రపంచ నాశకాలమున (మహాప్రళయమందు) భయంకరమైనట్టియు, అగ్ని మొదలగు దేవతలకు శిరోభూషణమైనట్టియు, తన చెక్కిళ్ళయందు మదజలముతో ఉండెడి పురాతనమైనట్టియు (మొదలు తెలియనట్టియు) ఐన గజ ముఖముతో విలసిల్లెడి శ్రీ వినాయకునికి నమస్కారము.
నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ ।
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ ।
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ ।
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥
#భావము:
ఎంతో గొప్పనైన, మనోహరమైన దంతపు కాంతి కలిగినవాడు, యమునిని అంతము నొందించిన శివునకు కొడుకై తనకెప్పుడూ అంతములేక విఘ్నములను తీసివేయుచు, ఆలోచింప శక్యముకాని స్వరూపముతో మహాత్ముల, యోగిపుంగవుల హృదయమున ఎల్లప్పుడు నివసించెడివాడును, సర్వలోక ప్రసిద్ధుడైన, ఆ ఏకదంతుని ఎల్లప్పుడు మనసున ధ్యానించుచుండెదను.
మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ ।
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ ।
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ ।
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥
#భావము:
మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సు యందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము, దోషము లేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి మంగళమౌలను పొందెదరు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment