ఆశ్వయుజ బహుళ తదియ "#అట్లతదియ" (అట్లతద్ది) (ఉయ్యాల పండుగ) (గోరింటాకు పండుగ)

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹 🙏


💥ఆశ్వయుజ బహుళ తదియ "#అట్లతదియ" (అట్లతద్ది) (ఉయ్యాల పండుగ) (గోరింటాకు పండుగ)


గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు.


ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది.


ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. చంద్రారాధన ప్రధానమైన పూజ.


💥#వ్రత_విధానము:


అట్లతద్ది స్త్రీలకూ ఎంతో శుభప్రదమైనది. అట్లతద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు.


అట్లతద్ది రోజున తెల్లవారు ఝామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీపూజ చేసి, ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తయిదువులకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనంగా సమర్పించాలి.


అట్లతద్ది నోము కథ చెప్పుకొని, అక్షింతలు వేసుకోవాలి.

అనంతరం భోజనం చేయాలి. పదిరకాల ఫలాలను తినడం, పదిమార్లు తాంబూలం వేసుకోవడం, పదిమార్లు ఊయల ఊగడం, ఈ పండుగలో విశేషం.


సాయం సమయమందు వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.


గౌరీదేవికి నైవేద్యంగా "అట్లు" పెడతారు గనుకే ఈ పండుగకు అట్లతద్ది అనే పేరు వచ్చింది


చంద్రారాధన ప్రధానమైన చంద్రకళల్లో కొలువై వున్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్ర వచనం.


ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.


💥#అట్లతద్ది_వ్రతకథ:


పూర్వం రాజుల పాలన జరుగుతూ ఉండేది. అలా ఉంటున్న కాలంలో ఒక రాజకుమార్తే, మంత్రి కుమార్తె, సైన్యాధిపతి కుమార్తె, పూజారి కుమార్తె అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతి రోజు ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు.


అప్పుడు అట్లతద్ది వచ్చింది. రాత్రి సమయంలో చంద్రుడు రాగానే పూజ చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటారు. పెద్దవారు అమ్మవారిని నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. 


ఆ సమయంలో రాజు కూతురు రాజకుమారి ఆకలితో నిరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన రాజు కొడుకు యువరాజు తన చెల్లెలి ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి, అద్దంలో తెల్లని వస్తువు ప్రతిబింబం పడేలా చేసి, చంద్రుడు వచ్చాడు, ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తిని, విశ్రాంతి తీసుకోమని చెబుతాడు.


అన్న మాటను గౌరవించిన తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుంది. అయితే ఈ రోజున చంద్రుని చూసి ఉమాదేవి పూజ చేసుకొని భుజించాలి. అందుకే ఈ వ్రతానికి "చంద్రోదయ ఉమా వ్రతం" అనే పేరు వచ్చింది.


చంద్రుని చూసిన తర్వాత ఉమాదేవి పూజ చేసుకోని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకుంది.


ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమారికి ఘనంగా వివాహం అయింది. అయితే రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి, ఉన్నవి కల్పించి చెప్పి రాజకుమారికి ఒక ముసలి వాడితో ఇచ్చి వివాహం చేశారు.


ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెందింది. చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా! ఇలా ఎందుకు జరిగిందని? ఆలోచిస్తూ, బాధపడుతూ, దేవత మూర్తి అయిన పార్వతీ, పరమేశ్వరులను భక్తితో వేడుకుంటుంది.


అప్పుడు వారు ప్రత్యక్షమై తన అన్న తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు అశ్వయుజ బహుళ తదియ ఉన్నది. ఆ రోజున చంద్రోదయ ఉమా వ్రతం చేసి, గౌరీమాతను భక్తిశ్రద్ధలతో వేడుకో నీ సమస్య తొలగిపోతుందని చెప్పి వారు మాయమయ్యారు.


అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకుని అక్షింతలు తెచ్చి భర్త పై వేయగానే తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవ్వనంగా మారిపోతాడు. 


అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు. పెళ్లయిన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు.


💥#అట్లతద్ది_అంతరార్ధం:


ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం వుంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.


ఋతుచక్రం సరిగా వుండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ వుండవు.


మినప పిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలిగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి.


ఈవిధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళికాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తర తరాల నుంచి వస్తున్న నమ్మకం.


పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి, ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు