💥ముక్తినిచ్చే యోగ నరసింహుడు..

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏


💥ముక్తినిచ్చే యోగ నరసింహుడు..


దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్‌. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు. 


పురాణ గాథల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో మహా విష్ణువు వధించిన సందర్భంలో... ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు.


సప్త ఋషులు తనను సేవించుకోగా ముక్తిని అనుగ్రహించాడు. ఈ యోగ నరసింహుణ్ణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘#తిరుక్కడిగై’ అని కూడా పిలుస్తారు. అంటే "ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే" నరసింహుడని అర్థం.


ఈ ఆలయానికి కార్తీక మాసంలోని శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చక్ర తీర్థంలో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్య దేశాల్లో (క్షేత్రాల్లో) ఇదొకటి.


ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం అనే పుష్కరణి ఉంది. 108 తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయంటారు. దీని ఒడ్డున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని మరో కొండ మీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆగుడిలో హనుమంతుడు కూడా యోగముద్రలోనే కనిపించడం విశేషం. 


సుమారు 230 మీటర్ల ఎత్తయిన కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1,300కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రాజగోపురం అయిదు అంతస్థుల్లో సమున్నతంగా ఉంటుంది.


ప్రధాన ఆలయంలో యోగ నరసింహ స్వామి మూలవిరాట్‌ ఉంటుంది. యోగముద్రలో కూర్చున్న నారసింహుడి కాళ్ళకు యోగ బంధం (పట్టీ) ఉంటుంది. ఆయన దేవేరి అమృతవల్లి అమ్మవారి మందిరం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది.


ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఆరు నుంచి ఎనిమిదో శతాబ్దం మధ్య చోళరాజులు కట్టించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  


మానసిక సమస్యలతో, నయంకాని వ్యాధులతో బాధపడేవారు, నిరాశ, నిస్పృహలకు గురైనవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి, ముక్తిప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం