⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు.
అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు.
‘హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే. అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని, రామచంద్రుడు చెప్పాడంటే అంతే! మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమ వంతు. తన అపారమైన దేహబలాన్ని ప్రభుసేవలో వినియోగించడమే.
లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడివారు చెప్పారు. కానీ, ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు. రివ్వున ఎగిరిపోయాడు. సంజీవని గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు. స్వామికార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్నే పెళ్లగించి తీసుకుపోయాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు.
అంతేకాదు, యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు, గుట్టలు, మురికి కుప్పలతో ముంచేసి, శత్రుసేనలు కదిలేందుకు వీల్లేకుండా చేశాడు. ఇలా వానరుడిగా జన్మించినా, రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం వాయునందనుడిని భక్తాగ్రేసరుడిగా నిలబెట్టింది. జీవిత పరమసిద్ధివైపు నడిపించింది’ అని ప్రభుపాదులు వివరించారు.
నమ్మిన దైవంపై పరిపూర్ణమైన అంకితభావం కలిగి ఉండాలి. నిరంతరం స్వామి సేవలో తరిస్తూ ఇది తప్ప మరేదీ తనకు అవసరం లేదని ఆంజనేయుడు ప్రార్థించేవాడు.
భవబంధచ్ఛిదే తస్యై స్పృహయామి న ముక్తయే
భవాన్ ప్రభురహం దాస ఇతి యత విలుప్యతే
(చైతన్య చరితామృత)
‘ఓ ప్రభూ! ఈ భవబంధాల నుంచి నన్ను విముక్తుడిని చేయదలిచితే చేయి. మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటే, ప్రసాదించు. కానీ, నేను మాత్రం ఇవేవీ కోరుకోను. మీపై నా దాస్య భావనను మరిపించేదేదీ నాకు అవసరం లేదు’ అని వినయంగా వేడుకుంటాడు హనుమ.
పురాణాలను అనుసరించి హనుమ చిరంజీవి. నిరంతరం రామనామాన్ని జపిస్తుంటాడు. అంతేకాదు, ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు.. అక్కడికి వెళ్లిపోతాడు. ఆనందబాష్పాలు నిండిన కండ్లతో, చేతులు జోడించి అక్కడే ఉంటాడు. రామకథా గానం చేస్తున్న భక్తుల సేవా సంకల్పాన్ని పవనసుతుడు మరింత బలపరుస్తాడని శాస్ర్తాలు చెబుతున్నాయి.
ఒకసారి శ్రీరాముడు అగస్త్య మహర్షితో మాట్లాడుతూ హనుమను ఎంతగానో కొనియాడాడు. ‘వాలి, రావణుడి బలాలు అసాధారణమైనవి. కానీ, అవి హనుమంతుడి బలపరాక్రమాలతో సమం కాదు. హనుమ రౌద్రం, పరాక్రమం, సహనం, బుద్ధి, శాస్త్ర విజ్ఞానంతోపాటు సద్బుద్ధి కలిగిన గొప్ప సమర్థుడు. ఒక్క హనుమంతుడే సముద్రాన్ని దాటి, రాక్షసులను మర్దించి, లంకా దహనం చేసి, సీత సందేశాన్ని తెచ్చాడు. అలాంటి సాహస కృత్యాలు యముడు, ఇంద్రుడు, కుబేరుడు వంటి దేవతలు చేసినట్టుగా కూడా మనం వినలేదు. కేవలం హనుమ శక్తిసామర్థ్యాల వల్లే లంకను జయించి, సీతను రక్షించి, లక్ష్మణుడిని కాపాడుకోగలిగాను’ అన్నాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment