⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తి హరంవందే స్మర్తృగామీ సనోవతు॥
'అక్షరాత్, వరేణ్యాత్, ధూత సంసార బంధనాత్
తత్వ మస్యాది లక్ష్యత్వాత్, అవధూత ఇతీర్యతే’
ఆశా పాశాల నుంచి విముక్తి పొందిన వాడు, పూర్వకర్మల నుంచి విడివడిన వాడు, ధూళితో కూడిన శరీరం వాడు (దేహం పట్ల అభిమానం లేనివాడు), తత్వ చింతన కలవాడు అవధూత అంటుంది దత్తావధూతగీత.
దీన్నే అవధూత ఉపనిషత్తు ఇంకాస్త విశదంగా చెప్తూ అవధూత అంటే అక్షరుడు (నాశనం లేనివాడు), వరేణ్యుడు (ఉత్తముడు), ధూతబంధనుడు (సంసార బంధనాలేవీ లేనివాడు) వేదాంత గోచరమైన తత్వమస్యాది వాక్యాలకు లక్ష్యమైన వాడని చెబుతుంది.
ఈ లక్షణాలన్నీ కలిగి బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే దత్తావతారం.
లోకంలో మహర్షులందరూ అవధూతలు కారు. వ్యాసుడు మహర్షి. ఆయన కొడుకు శుకమహర్షి అవధూత.
శుకమహర్షి తండ్రిని విడిచి వెడుతూంటే పుత్రప్రేమతో వ్యాసుడు ఆయన్ను పిలుస్తూ వెనకాలే వెంబడిస్తున్నాడట. అక్కడ ఒక సరస్సులో స్నానం చేస్తున్న దేవతా స్త్రీలు శుక మహర్షిని పట్టించుకోలేదు. కానీ, వయోవృద్ధుడైన వ్యాసమహర్షి వస్తూంటే మాత్రం సిగ్గుతో వస్ర్తాలు చుట్టుకున్నారట. అదీ అవధూత విశిష్టత.
మహా తపస్సంపన్నుడు అత్రి మహర్షికీ, పతివ్రతా శిరోమణి అనసూయాదేవికి కలిగిన పుణ్య సంతానమే దత్తాత్రేయ స్వామి.
సత్వ, రజో, తమో గుణాలు లేనివాడు అ‘త్రి’ మహర్షి. న+ అసూయ అసూయా గుణం లేని, మరోవిధంగా చెబితే మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత. అందుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు.
అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు, తనకు తానుగా దత్తమయినాడు (తల్లిదండ్రులకు ఇవ్వబడినాడు) కాబట్టి దత్తుడు. వెరసి దత్తాత్రేయుడు అయ్యాడు.
‘గురుదత్తా! జగత్తును అంధకారం నుంచి కాంతి మార్గంలోకి నడిపించడానికి అవతరించిన జగద్గురువు నువ్వు’ అని తల్లిదండ్రుల నుంచి ఆశీఃపూర్వక అభినందనలు పొందిన దత్తుడు.. జగదోద్ధరణ కోసం సహ్యాద్రి పర్వతాలకు వెళ్లాడు.
దత్తాత్రేయునిది జ్ఞానావతారం. విష్ణుమూర్తి ఏకవింశతి (21) అవతారాలలో ఆరోది దత్తరూపం. ఆయన కరుణా సముద్రుడు.
ఒక్కోసారి భక్తులను కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆయన కనబరిచే ప్రతి లీలా ఓ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఓ తత్వాన్ని బోధిస్తుంది. అవతార లక్ష్యం పూర్తికాగానే విష్ణుమూర్తి ఆ అవతారం చాలించడం కనిపిస్తుంది. కానీ, దత్తావతారం పరిసమాప్తి లేనిది. గురు రూపంలో ఆయన చిరంజీవి.
దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి
తన్నో దత్తః ప్రచోదయాత్!!
తాత్వికంగా స్వామి దిగంబరుడు (దిక్కులే వస్ర్తాలుగా కలవాడు). కేవల బ్రహ్మనిష్ఠతో దండకమండలాలను కూడా వదిలిన శుద్ధ సాత్విక చైతన్య మూర్తి అయిన అవధూత.
భక్తితో స్మరిస్తే సంతృప్తిని పొంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలలో మూడు తలలతో, తెల్లని శరీరంతో, జటలతో, శంఖ, చక్ర, కమండల, జపమాల, త్రిశూల, డమరుకాలు ఆరుచేతులలో ధరించి, నాలుగు వేదాలకు ప్రతీకలైన నాలుగు శునకాలు వెంట ఉండగా.. ధర్మస్వరూపమైన గోవును తన వెనుక నిలుపుకొని ఔదుంబర (మేడి) వృక్షం నీడలో సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగా దత్తాత్రేయుడి రూపాన్ని భక్తులు దర్శించుకుంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment