⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి, ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు.
ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడైన వినాయకుడు, ప్రకృతి పురుషుల అభేదరూపానికి సంకేతం. అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం, కంఠం నుంచి శీర్షం వరకు గజం ఉంటాయి.
గజం శివ స్వరూపమైతే, జగం మాతృస్వరూపం. అమ్మ ఇచ్చిన రూపాన్ని, అయ్య కూర్చిన శిరోభాగాన్నీ కలిపిన గజ స్వరూపంగా గణపతిని పూజించుకుంటాం.
గణేశ అంటే సకలదేవతా గణాలకు అధిపతి అని అర్థం. మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణలు ఉంటాయి. ఈ పద్నాలుగింటిని చతుర్దశ మహాశక్తులు అంటారు. వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీగణేశుడు. సిద్ధిని, బుద్ధిని కలిగించి, విఘ్నాలు వైదొలిగేలా చేయడం, మంగళప్రదంగా జయం కలిగించడం కూడా వినాయకుడి చలువే.
గణపతి ఆనందస్వరూపుడు. స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే. ఆయన విద్య, ఐశ్వర్య , జ్ఞాన ప్రదాత.
‘కలౌచండీ వినాయకః’ అన్నారు పెద్దలు! కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతలలో ప్రధానుడు వినాయకుడే.
వినాయకుడు వ్యవసాయానికి రక్షకుడు. ఆయన బాహ్య రూపంలో దీర్ఘమైన తొండం పంట పొలాల కాలువలకు నీళ్లు ఇచ్చే తూముకు, చిన్నకండ్లు సూక్ష్మమైన ఆలోచనకు, పెద్ద పొట్ట సకల సంపదలను దాచుకునే గాదెకు ప్రతీకలుగా పెద్దలు చెబుతారు.
దంతం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ప్రకృతి సిద్ధమైన పూలు, పండ్లు అన్నీ గణపతికి ఇష్టమైనవే. గణపతి చేతిలోని పాశం కార్యసాధనకు గుర్తు.
వినాయకుని వాహనం ఎలుక. దాని పేరు అనింద్యుడు. మరొక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయదారులకు, పంటలకు ఇబ్బంది కలిగించే ఎలుకలను ఆయన అదుపులో ఉంచుతాడని అంతరార్థం.
ప్రకృతి బాంధవుడైన గణపతిని పృథ్వీతత్త్వానికి ప్రతీకగా చెరువులోంచి, పుట్టలోంచి మట్టిని తీసుకొచ్చి వినాయక విగ్రహాన్ని తయారుచేస్తుంటారు.
ప్రకృతి సంబంధంగా దొరికే లతలు, పత్రి, పుష్పాలతో, రకరకాల పండ్లతో పూజించి మృణ్మయ మూర్తిని తిరిగి చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రకృతి సమతుల్యతను, పర్యావరణాన్ని కాపాడటానికి పెద్దలు ఈ ఏర్పాట్లు చేశారు.
మాతాపితలను సేవించి వారి అనుగ్రహ ప్రభావంతో గణాధిపత్యాన్ని పొందిన వినాయకుడి వృత్తాంతం తల్లిదండ్రుల సేవను మించింది మరొకటి లేదని నిరూపిస్తుంది.
ఏ పని అయినా ఆలోచించి, నిదానంగా చేసి సత్ఫలితాన్ని సాధించాలి అన్నది గణపతి తత్త్వంగా మనకు నిరూపితమవుతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment