⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ

శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా॥


లక్ష్మి అంటే ‘శుభలక్షణ లక్షిత’ అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా, గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.


మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి. ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో, పలు రూపాల్లో కొలుస్తుంటాం.


పవిత్రంగా, ప్రశాంతంగా ఉండే ఇండ్లలో, మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది.


శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటినీ, తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది.


శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు! అంతర్‌ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది.


బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికిపట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలువదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. 


నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృథా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పని చేసేవారు.. ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ.


లక్ష్మి నిలిచిన చోట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి. కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుందామె.


లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు. డబ్బు మాత్రమే కాదు. జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే!


మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ‘ప్రకృత్యై నమః’ అని స్తుతించారు.


ప్రకృతిలోని ప్రతి సంపదా తనే. పాంచభౌతిక శక్తులైన భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి.


పంటపొలాల్లోనే కాదు, పచ్చని చెట్లలోనూ ఆమె నివసిస్తుంది. ముఖ్యంగా బిల్వ వృక్షాలు లక్ష్మీ నివాసాలని శ్రీ సూక్తం చెబుతున్నది.


అంతేకాదు, ఆ తల్లి మనలో జ్ఞాన బీజాన్ని మొలకెత్తించి విజ్ఞాన ఐశ్వర్యాన్ని సిద్ధింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం సంతోషాలకు మూలకారణం.


అయితే, ఆ ఆనందాల్లోనే తేలిపోతూ మనలోని సద్గుణాలను విడిచిపెట్టిన క్షణం నుంచి పతనం మొదలవుతుంది. శ్రీదేవి కరుణను తాత్కాలికమైన లౌకిక సుఖాలకు పరిమితం చేయడం అజ్ఞానమే అవుతుంది. 


ఆపదలు తీరి అన్నిటా సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా, వివేచనతో మెలగాలి. జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ధార్మికతవైపు పయనించాలి.


కలిగిన దాంట్లో నలుగురికీ సాయం చేస్తూ పునీతులం కావాలి. అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది. మోక్షానికి మార్గం సుగమం అవుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం