💥నరసింహావతారంలోని విశిష్టత

 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏


💥నరసింహావతారంలోని విశిష్టత – ఇది శివ, విష్ణు అంశల కలయిక. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడి సింహస్వరూపం రెండూ కలిసి నరసింహ స్వరూపంగా ఆవిర్భవించాయి.


విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, విష్ణుతత్వం కూడా.


ఇక బ్రహ్మపురాణంలో నరసింహ అవతార గాథ ఇతర పురాణాల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రహ్లాదుడి ప్రస్తావన, హిరణ్యకశిపుడి విష్ణుద్వేషం ఉండవు. కేవలం ఋషులు, మునులు, దేవతల బాధా నివృత్తి కోసమే విష్ణుమూర్తి నరసింహుడిగా అవతరించినట్లు చెబుతుంది.


విష్ణుపురాణంలో కొంత విభిన్నమైన గాథ కనిపిస్తుంది. మిగిలిన అంశాలన్నీ పోతన రాసిన ప్రహ్లాద చరిత్ర తీరులోనే ఉన్నప్పటికీ, తండ్రి చేసిన తప్పుల్ని మన్నించమని ప్రహ్లాదుడు వేడుకోవటంతో శ్రీహరి అంగీకరించటం, పితాపుత్రులిద్దరూ కలిసి కొంతకాలం జీవించటం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు నరసింహరూపంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.


వీటితోపాటు పద్మ, విష్ణుధర్మోత్తర, స్కాంద, కూర్మ, లింగ, మత్స్య, భాగవత, నరసింహ, హరివంశ పురాణాల్లో కూడా నరసింహావతార విశేషాలు ఉన్నాయి. వీటన్నిటిలో భాగవత పురాణంలో ఉన్న నరసింహ అవతార గాథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాల పాటు ఉంటుందేమో కానీ, హిరణ్యకశిపుని చిత్తం మాత్రం నిరంతరం విష్ణుద్వేషంతో నిండి ఉండేది.


ఫలితంగా నరసింహుడి చేతిలో హిరణ్యకశిపుడు అంతమయ్యాడు. లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్యకశిపుడు స్వర్గలోకాన్ని చేరుకుంటాడు. ఆశ్చర్యం అనిపించకమానదు. ద్వేషించిన వాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.


ఉగ్రమూర్తి అయినప్పటికీ నరసింహస్వామి పూర్తిగా కరుణాంతరంగుడు. కన్నతండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో, పరమాత్మ కూడా అంతే! ఆ ఉగ్రమూర్తిలోని శాంతమూర్తిని ఉపాసన చేస్తే శుభపరంపరలే కలుగుతాయి.


మృగస్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. అయితే అది పరిధి దాటకూడదు. అలాకాకుండా, మృగస్వభావం మితిమీరితే ప్రతి మనిషీ హిరణ్యకశిపుడే అవుతాడు. అప్పుడు భగవంతుడి అంశ దానిని తప్పకుండా సంహరిస్తుంది. నరసింహావతారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.


కాబట్టి, మృగత్వం మానవత్వాన్ని ఎప్పుడూ దిగజార్చ కూడదు. నరసింహ ఉపాసన ద్వారా అరిషడ్వర్గాలు అదుపులోకి వస్తాయి. ఇందుకు తగిన మానసిక శక్తి, అంతులేని ధైర్యం ఫలితాలుగా అందుతాయి.


లక్ష్మీనారాయణుడే లక్ష్మీనరసింహుడు. ఉగ్ర నరసింహుడే లక్ష్మీవల్లభుడు. రూపం మాత్రమే వేరు… తత్వం మాత్రం ఒకటే!


"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం-

నృసింహం భీషణం భద్రం మృత్యుఃమృత్యుం నమామ్యహం"

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు