🌺💥గ్రామదేవతలు💥🌺
⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏
🌺💥గ్రామదేవతలు💥🌺
💥ప్రతీ ఇంటికీ ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే, ప్రతీ గ్రామానికీ పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూతప్రేతాలను, గాలినీ ధూళినీ దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతి లోనే ఉంది. అలా కాపాడే తల్లినే "గ్రామ దేవత" అని పిలుచుకుంటాము
💥గ్రామదేవతల ఆవిర్భావం:💥
పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
💥పృధ్వీ దేవత:
పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.
గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార.. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.
జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.
మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.
పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాధిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.
ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
💥జల దేవత:
జలానికి సంభందించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమి లోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
💥అగ్ని దేవత:
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు.
సూరమ్మను ప్రతీ అమావాస్య నాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమి నాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.
ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య, చంద్రుల కళ వున్న అమ్మ).
💥వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
💥ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
💥ప్రాచీన కాలములో ఇంట్లో వున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.
ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్య పడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించుకొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఇక ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె ‘తలుపులమ్మ’గా మారింది.
ఇంట్లో నుండి బయటికి వెళ్లేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్దించి వెళ్ళడం చేస్తారు.
వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.
పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
💥గ్రామదేవతా నామ విశేషాలు:💥
సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. ‘మా వూళ్ళన్నింటికీ అమ్మ‘ అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది ‘మావుళ్ళమ్మ‘ అయింది.
శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడ మీద (గళము) మచ్చ(అంకం) కారణముగా అంకగళమ్మ అంకాళమ్మ మారిపోయింది.
బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల(ఆ అవధినించి రక్షించగల) అమ్మే ‘కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ.. కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.
గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా
ఎప్పుడూ సత్యాన్ని(నిదర్శనాలను) చూస్తూ వుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.
స్వచ్చమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్చమని) సు+అచ్చ=స్వచ్చ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్దగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు.
అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల) + అమ్మ= పెంటమ్మ.
భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి వికృతి) + అమ్మ= బోనాలమ్మ.
అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను ‘అయ్యమ్మ‘ అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు.
లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల + అమ్మ= గుర్రాలమ్మ అయినది
ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు + అంబ= ’సోమపోలమాంబ‘ అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
‘ఎల్ల’ అంటే సరిహద్దు అని అర్దము అందుకే ‘ఎల్లమ్మ‘ కూడా ఈ పనిని చేసేదన్నమాట.
ఒక వ్యక్తికి జీవన భ్రుతి కలిగించి పోషించే తల్లి ‘పోచ + అమ్మ= పోచమ్మ‘ అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాదులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
పార్వతే అమ్మోరు (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment