⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏


నవమూర్తులైనట్టి నరసింహము వీడె

నవమైన శ్రీ కదిరి నరసింహము


నగరిలో గద్దెమీది నరసింహము వీడె

నగుచున్న జ్వాలా నరసింహము

నగము పై యోగానంద నరసింహము వీడె

మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము


నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె

నాటకపు మట్టెమళ్ల నరసింహము

నాటి యీ కానుగుమాని నరసింహము వీడె

మేటి వరాహపులక్ష్మీ నారసింహము


పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన

నలిరేగిన ప్రహ్లాద నరసింహము

చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద

మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము


--- అనంతపురం జిల్లా #కదిరి లో ఉన్న నరసింహ స్వామిలో - తొమ్మిది మంది నరసింహ మూర్తులను దర్శిస్తూ #అన్నమయ్య పాడిన గీతమిది: 


💥#తాత్పర్యము:


ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ , తొమ్మిది రూపాలు ధరించిన, నరసింహ స్వామి మన కళ్ల ఎదురుగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామి. భక్తితో చూస్తే ఈయనలో తొమ్మిది రూపాలు కనిపిస్తాయి.


1) అహోబిలం కొండమీద ఒక గుహలో అరుగు మీద పది భుజాలతో ఉన్న వీర నరసింహస్వామి ఈ కదిరి నరసింహ స్వామి.

పైన అహోబిలంలో నవ్వుతున్న జ్వాలా నరసింహ స్వామి ఇతడే.

చిన్న అహోబిలపు కొండపై ఉన్న యోగానంద నరసింహ స్వామి ఇతడే.

వేదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఇతడే.


2) చిన్న అహోబిలానికి దగ్గరలో భార్గవ తీర్థం అనే క్షేత్రంలో వెలసిన నరసింహ స్వామి ఇతడే.

పెద్ద అహోబిలానికి నాలుగు మైళ్ల దూరంలో బీభత్స మూర్తిగా వెలసిన మట్టెమళ్ల నరసింహ స్వామి ఇతడే.

కానుగ చెట్టు కింద ఉన్న కానుగ నరసింహ స్వామి (వరాహ లక్ష్మీ నరసింహుడు) ఈ కదిరి నరసింహ స్వామి.


3) విజృంభిస్తూ ఎగువ అహోబిలంలో నరసింహ స్వామికి, ఉగ్ర స్తంభానికి మధ్యలో వెలసిన ప్రహ్లాద నరసింహస్వామి ఇతడే.

కదిరిలో ఉన్న ఈ నరసింహ స్వామియే వేంకటాద్రి మీద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి.


💥#ఆంతర్యము:


💥నగుచున్న జ్వాలా నరసింహము


అతి భయంకర మైన రూపంతో హిరణ్యకశిపుని రొమ్ముని చీల్చి చంపినందుకు ఈ స్వామిని "జ్వాలానరసింహుడు" గా వ్యవహరిస్తారు.


జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అను జలపాతము ఉంది. ఇక్కడ స్నానంచేస్తే అన్ని పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.


ఇక్కడ అన్నమయ్య నగుచున్న విశేషణం వికటాట్ట హాసానికి సంబంధించినది.


💥నగము పై యోగానంద నరసింహము వీడె


యోగములో ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి స్వామి వారికి "యోగానంద నరసింహ స్వామి" అని పేరు.


ప్రహ్లాదుడు ఈ యోగ నరసింహుని దయతో యోగాభ్యాసం చేసాడట.


💥మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము


లక్ష్మీ నరసింహ స్వామి అహోబిలంలోని వరాహ స్వామికి పైన రెండు మైళ్ల దూరంలో ఉన్న స్వామి. 


అన్నమయ్య ఈ కీర్తనలో ఉద్దేశించిన నవ నరసింహులు అహోబిలానికి సంబంధించిన వారు కనుక ఈ కీర్తనలో వేదాద్రికి - వేదములు కొలువైన అహోబిలం అని చెప్పుకోవాలి.


💥అన్నమయ్య కీర్తనలో నరసింహ దేవుని విశేషాలు ఎన్ని చెప్పినా తరగవు. ఎందుకంటే నరసింహ దర్శనానుభూతి కీర్తనలోని పదాలుగా మారింది కాబట్టి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు