భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏


భారతావని (భారతదేశం) మూడు విధాలుగా వర్గీకరిస్తారు. హిమాలయ పర్వతములతో నిండి‌యున్న ప్రాంతమును దేవభూమిగా, ఉత్తర భారతంలో ఉన్న హిమాలయ పర్వతాల క్రింది భాగం నుండి ఉజ్జయినీ నగరం వరకు ఉన్నటువంటి మధ్య ప్రాంతమును పుణ్యభూమిగా, ఉజ్జయిని క్రింద ఉన్నటువంటి దక్షిణ భాగమును కర్మభూమిగా చెబుతారు.


మన కర్మ భూమి అయినటువంటి దక్షిణ భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రములు ఉన్నాయి. ప్రతీ క్షేత్రమునకు ఒక విశేషమైనటువంటి మహత్మ్యము ఉన్నది.


అలాంటి క్షేత్రాలలో పౌరాణికంగా చారిత్రకంగా విశేషము పొందినటువంటి క్షేత్రము #శ్రీభద్రాచల_క్షేత్రము, శ్రీసీతారామచంద్ర లక్ష్మణ స్వామి వారి దేవాలయము.


భారతావనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైన దివ్య క్షేత్రం భద్రాచల శ్రీరామ క్షేత్రం.


💥త్రేతాయుగమున దండకారణ్యములోని పర్ణశాల ప్రాంతములో వనవాసము చేయుచున్న సీతారాములకు ఒకనాటి విహార సమయమున విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి వారి అనుగ్రహానికి పాత్రమయ్యెను.


ఆ శిలయే బ్రహ్మదేవుని వరప్రసాదముగా మేరుదేవి మేరు పర్వతరాజ దంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించెను.


బాల్యం నుండి శ్రీరామభక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రమును ఉపదేశంగా పొంది, శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యములో ఘోర తపస్సునాచరించెను.


ఆ తపః ప్రభావముతో శ్రీమన్నారాయణుడు మరల శ్రీరామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ చక్ర ధనుర్భాణములను ధరించి, వామాంకమున (ఎడమ తొడపై) సీతతో, వామ పార్శ్వమున (ఎడమప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యెను.


పిమ్మట భద్రమహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముద్రల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖముగా ఆ భద్రుని హృదయ స్థానమున వెలసెను.


భద్రుడు అచలమై (కొండ) నందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు. స్వామికి భద్రాద్రిరాముడు అని, వైకుంఠము నుండి సాక్షాత్తుగా అవతరించుట చేత వైకుంఠరాముడు అని, ఇక్కడి సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు అ కార ఉ కార మ కార స్వరూపములు అయినందున ఓంకారరాముడు అని, శంఖ చక్ర ధనుర్భాణములు ధరించుటచే రామనారాయణుడు అని కూడా పేర్లు కలవు.


మహాభక్తులై శ్రీ తిరుమంగై ఆళ్వార్లు, శంకర భగవత్పాదులు మొదలగు మహాత్ములెందరో ఈ స్వామిని సేవించి తరించిరి.


ముఖ్యముగా 16వ శతాబ్దానికి చెందిన పోకల దమ్మక్క అను భక్తురాలు స్వామికి తాటియాకుల పందిరి వేసి, పూజలు చేసి తాటిపండ్లను నివేదన చేసి అపర శబరిగా తరించినది.


పిమ్మట భక్తరామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న రాముని ఆలయ గోపుర ప్రాకార మండపాదులను, అమూల్యమైన ఎన్నో ఆభరణములను సమర్పించి, అనేక కీర్తనలతో గానంచేసి వాగ్గేయకారుడై భద్రాద్రి రాముని సేవలో తరించినాడు.


అనంతరం తూము నరసింహదాసు, వరదరామదాసాది భక్తులు తమ జీవితాలను శ్రీరామునికి అంకితం చేసి ధన్యులైనారు.


ఈ విధంగా కొలిచిన వారి కొంగు బంగారమై తెలుగువారి ఇలవేల్పు అయిన భద్రాద్రి రాముడు శ్రీ పాంచరాత్ర దివ్యాగమోక్తముగా శ్రీ వైష్ణవ సాంప్రదాయానుగుణముగా ఆరాధనాదులను అందుకుంటూ భక్తులకు సకలాభీష్టములను ప్రసాదించుచున్నాడు.


"భద్రాద్రి నిలయం రామం సత్వాపాపైః ప్రముచ్యతే"

--భద్రాచల నిలయుడైన శ్రీరాముని సేవించిన వారు సకల పాప విముక్తులై తరించెదరు.


💥భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఏటా ఛైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.


ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం అయిన బ్రహ్మోత్సవాలు... ఏప్రిల్ 23 వరకూ జరగనున్నాయి.


ఇందులో భాగంగా ఏప్రిల్ 17న "శ్రీరామనవమి" సందర్బంగా స్వామి వారి కళ్యాణం జరగనుంది. ఆ మర్నాడు ఏప్రిల్ 18 న రాముల వారి పట్టాభిషేకం నిర్వహిస్తారు.


బుధవారం ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నంలో కల్యాణం నిర్వహిస్తారు.


కల్యాణ వేడుకలో భాగంగా మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది.


దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. 


రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో పెళ్లి వేడుకకు ముస్తాబైంది. ముత్యాల ముగ్గులు, తీరొక్కపూలతో అలంకరించిన పెళ్లి మండపం కల్యాణ క్రతువుకు సిద్ధమైంది.


సిరి కల్యాణపు తిలకం, బుగ్గన చుక్క, పాదాలకు పారాణితో వరుడు రామయ్య, కస్తూరి నామము, పూలజడ, బుగ్గన చుక్కతో వధువు సీతమ్మ తల్లి పెళ్లికి ముస్తాబయ్యారు.


సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా చూసేందుకు తరిలి వచ్చిన భక్తజనంతో భద్రాద్రి పులకించిపోతోంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు