💥శివపార్వతుల దశావతారములు:

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ |

యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ ||


💥శివపార్వతుల దశావతారములు:


జీవరాశుల అభ్యున్నతి కోసం నిర్హేతుక కృపతో భగవంతుడు స్వీకరించేదే అవతారం. 


ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచివాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని నమ్మకం.


పురాణాల ప్రకారం విష్ణుమూర్తి లోక కల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పది అవతారాలు ఎత్తి ప్రతి యుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు.


అయితే లోక కల్యాణార్థం శివపార్వతులు కూడా పది అవతారాలు ఎత్తారు అని పురాణాలు చెబుతున్నాయి.


అడిగిన వెంటనే వరాలిచ్చే భోళాశంకరుడు అయిన పరమ శివునకు కూడా విష్ణుమూర్తి వలె దశావతారములున్నవి.


💥శతరుద్ర సంహితలో నందీశ్వరుడు, సనత్కుమారునకు ఈశ్వరావతారమును వివరిస్తాడు. 

ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుంది.

మరి ఆ పది అవతారాలను తెలుసుకుందాం.


1) శివుని ప్రధమ అవతారము మహాకాలుడు. మహాకాళి ఈ మహా కాలునికి భార్య. వీరిరువురు భక్తులకు భుక్తి, ముక్తిని ఇచ్చుచు వారి కోరికలను నెరవేర్చుచుందురు.


2) ఈశ్వరుని ద్వితీయ అవతారము తారకావతారము. తారకాదేవి ఈయన అర్థాంగి. వీరిని సేవించినవారు భక్తి, ముక్తులతో పాటు సమస్త శుభ ములను పొందుదురు.


3) ముక్కంటి తృతీయ అవతారము బాల భువనేశ్వరావతారము. బాలభువనేశ్వరి భువనేశ్వరుని అర్థాంగి. ఈ అవతారము సత్పురుషులకు సుఖములను కలిగించును.


4) శంకరుని చతుర్థ అవతారము షోడశ విద్యేశ్వరుడు. షోడశ విద్యేశ్వరి ఇతని ధర్మపత్ని. భక్తులకు సర్వ సుఖములను ప్రసాదించుట ఈ అవతార ప్రాశస్త్యము.


5) మహశ్వరుని పంచమ అవతారము భైరవావతారము. భైరవి ఇతని భార్య. ఈ భైరవుడు ఉపాసనాపరులకు సర్వ కామ్యములను ఒన గూర్చును.


6) మంజునాధుని ఆరవ అవతారము భిన్నమస్త. ఈతని అర్థాంగి భిన్నమస్తకి. వీరిరువురు భక్తకామప్రదులు.


7) భోళా శంకరుని సప్తమ అవతారము ధూమవంతుడు. ధూమవతి ఇతని భార్య. వీరిరువురు భక్తకాభీష్టప్రదులు.


8) పరమ శివుని అష్టమావతారము బగళాముఖుడు. ఇతని అర్థాంగి బగళాముఖి. ఈమెకే మహానంద అని మరియొక పేరు కూడా కలదు. వీరు భక్తవాంఛాప్రదులు.


9) ఉమామహశ్వరుని నవమావతారము మాతంగుడు. మాతంగి ఇతని భార్య. వీరీరువురు భక్తుల సర్వ కాంక్షలను ఈడేర్చుచుందురు.


10) కైలాసవాసుని దశమావతారము కమలుడు. కమల ఇతని భార్య. వీరిరువురు భక్తపాలకులు.


💥ఈ అవతారములన్నియు తంత్ర శాస్త్ర గర్భితములు. ఈ దేవతాశక్తులు దుష్టులను దండించుచూ భక్తులకు బ్రహ్మతేజోభివృద్ధిని కలిగించు చుండును.


ఈ దశావతారములు ‘శివశక్తి మతోరభేద:’ అన్న సిద్ధాంతమును మనకు తెలియబరుచుచున్నవి.


వికార రహితులై ఏకాగ్రతతో సేవించిన వారికి సమస్త సుఖములు కలిగి సమస్త కోర్కెలు సిద్ధించును.


శివ పర్వ దినములందు, ముఖ్యంగా కార్తికమాసంలో ఈ అవతారములను స్మరించినచో భక్తులు బ్రహ్మ వర్చస్సు కలవారైన విజయవంతులు, ధనాడ్యులు సుఖవంతులు అవుతారని నందీశ్వరుడు పలికెను.


మహాత్ముడగు శంకరుని ఈ పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించు వారికి అనేక సుఖములు లభించును.


శివ భక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేష సుఖమును పొందెదరు. వారి భక్తి వర్ధిల్లును.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు