💥మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమి
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥మాధవుని సన్నిధికి చేర్చే మాఘ పౌర్ణమి.
మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనది. రథసప్తమి (సూర్యుడు), భీష్మ ఏకాదశి (విష్ణుమూర్తి), శ్రీ పంచమి (సరస్వతీదేవి), మహాశివరాత్రి (శివుడు) ఇలా సకల దేవతలనూ కొలుచుకునేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇది.
చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత వుంది. కార్తీక మాసం దీపాలకూ , దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి.
"మా - అఘం'' అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
సంవత్సరంలో నాలుగుసార్లు సాగరస్నానం చేయాలనీ, అవి కూడా "ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ'' లలో చేయాలని , ఆలా సాగరస్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి.
ఇక మాఘ పౌర్ణమి వచ్చిందంటే చాలు పుణ్య తీర్థాలన్నీ కళకళలాడిపోతాయి. స్నానాలలోకెల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు.
నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం.
ఇక మాఘపౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు.
💥మాఘ స్నాన స్తోత్రం:
దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం
మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ
🌹దుఃఖములు , దారిద్య్రము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను.
మాఘమాసేరటం తాప్యః కించి దభ్యుదితే రవౌ
బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే
🌹ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే , అనగా... బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నియు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహా పాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా వుండును అని అర్థం.
సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే...
"నదీనాం సాగరో గతి:'' సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక , సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది.
మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు.. ఇష్టదేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలచుకొనేందుకు కూడా అనువైన సందర్భం.
ఈ రోజున సూర్యుడినీ, మహాలక్ష్మినీ పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.
సూర్యజయంతి కారణంగా మాఘమాసం యావత్తూ సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘపౌర్ణమి నాడు సముద్రస్నానంతో పాటుగా... ఆ ప్రత్యక్ష నారాయణునికి ప్రీతి కలిగేలా సూర్యాష్టకమ్, ఆదిత్యహృదయం వంటి స్తోత్రాలను పఠించడం మంచిది.
ఇక మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ పద్మాలతో అర్చించమని సూచిస్తుంటారు.
💥అటు మహాలక్ష్మికే కాదు, ఇటు పార్వతీదేవికి కూడా మాఘపౌర్ణమి ప్రత్యేకమైనదే!
భూమి మీద ఒక శంఖు రూపంలో పడిన పార్వతీదేవి, దక్ష ప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు.
ఇంతకీ శంఖువు, సతీదేవిగా మారిన రోజు
మాఘపౌర్ణమే!
ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ రోజే అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది.
బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే! బుద్ధుడు తాను త్వరలోనే నిర్వాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట. అందుకని ఈనాడు బౌద్ధులు మతగ్రంథాలైన త్రిపిటకాలను వల్లెవేస్తుంటారు.
మఘ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక పూజిస్తే ఆయన కరుణ లభిస్తుంది.
జ్యోతిషపరంగా బృహస్పతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జ్ఞానం దగ్గర నుంచి ధనం వరకూ బృహస్పతి అనేక సంపదలకు, సౌఖ్యాలకు కారకుడు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. మాఘ పౌర్ణమిని "#మహామాఘి" అని పిలుచుకుంటారు.
💥సముద్రం, నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటి ? అనే సందేహం కలుగుతుంది.
అలాంటి పరిస్థితిలో బావుల దగ్గర గానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ , గౌతమి'' నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.
ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు.
చివర మూడు స్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు.
సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment