⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై!
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై!!
🌹తాత్పర్యము:
బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను నాయికయై యున్న శ్రీ భార్గవీ మాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి ప్రియురాలును యైన శ్రీ కమలాదేవికి వందనములు.
💥శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత. జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్యపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు.
ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం. ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది.
మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది.
ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది.
పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం.
మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది.
ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టే వారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణీ.
జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది.
ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థకామమోక్షాలు.
జననమరణాల చక్రంనుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు.
మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం.
అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు- కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక.
లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం.
మహాలక్ష్మి చెంతనే ఒక తెల్ల గుడ్లగూబ కనిపిస్తుంది. దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం.
మరొక సంకేతార్థం తెలివిహీనత. సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని "చంచల" అన్నారు.
లక్ష్మి అనే పదం సంస్కృత పదం "లక్ష్యం" నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది.
ఆమె అడుగు పెట్టిన చోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తాయి. శ్రీమహాలక్ష్మి సిరిసంపదలతో పాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. సంతోషంలేని సంపదలు దేనికి?
మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది.
అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృస్టిలో శ్రీమహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించడమే కాదు... వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృతరసప్లావితంచేసే దేవత!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment