ఆదర్శమూర్తుల మేలుకలయికే రామాయణం
⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏
💥ఆదర్శమూర్తుల మేలుకలయికే రామాయణం..
రామాయణము సకల వేదసారము, సర్వమానవులకూ ఆదర్శము. నాటికీ నేటికీ సర్వకాలాల్లోని మానవులకు అందరికీ రామాయణంలోని పాత్రలు ఆదర్శమై ఉంటున్నాయి.
ఋగ్వేదము రామునిగా రూపుదాల్చగా, యజుర్వేదము లక్ష్మణునిగానూ, సామవేదము భరతునిగానూ, అథర్వణవేదము శత్రుఘ్నునిగానూ రూపుదాల్చాయి. అందుకే రామాయణం సకలవేద సారమైంది.
నిజానికి రాముడు, అతని ముగ్గురు సోదరులూ దశరథ మహారాజు యొక్క పుత్రులు కారు, వారు అగ్ని నుంచీ ఉద్భవించిన వారు, కనుక వారి ప్రవర్తన సంపూర్ణంగా ధర్మబధ్ధమై ఉండినది.
💥రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నదమ్ములందరికీ ఆదర్శమైనారు.
పసితనంలో ఒకనాడు నలుగురూ కలిసి ఆడుకుంటున్నపుడు ఉన్నట్లుండి భరతుడు పరుగెత్తు కుంటూ వచ్చి కౌసల్య వళ్ళో కూర్చుని ఏడ్చాడు.
"కుమారా! ఎందుకేడుస్తున్నావు? ఆటలో ఓడిపోయావా?" అని ఆమె అడగ్గా, భరతుడు "అమ్మా! మీరన్నట్లు నేను ఓడితే ఆనందించేడిని. కాని నేను ఓడే సమయంలో రాముడు కావాలని ఓడి నన్ను గెలిపించాడు. అన్న ఓటమికి నాకు చాలా బాధగా ఉంది" అన్నాడు.
ఇలా పసితనం నుండే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పరస్పరం ఎంతో ప్రేమగా, ఐకమత్యంగా, అన్యోన్యంగా జీవిస్తూ మానవులకందరికీ అన్నదమ్ములెలా మెలగాలో ఆదర్శాన్ని అందించారు.
రాముడు పట్టాభిషేకం జరుగవలసిన సమయంలో అరణ్య వాసానికి వెళ్లవలసినా సంతోషంగా వెళ్లాడు. అంటే ఏది ఎదురైనా సంతోషించాలే కానీ బాధపడరాదనే ఆదర్శం. బాధపడ్డంత మాత్రాన వచ్చిన కష్టం తొలగదు.
అడవులకు వెళుతున్న అన్నతో పాటుగా లక్ష్మణుడు ఎందుకెళ్లాడు అంటే అన్న కష్టం తన కష్టంగా భావించాడు. అన్నదమ్ముల అన్యోన్యతకు ఇది ఉదాహరణ.
భరతుడు, శతృఘ్నునితో కలసి మేనమామ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికీ రాముడు.. సీతా లక్ష్మణ సహితంగా అరణ్యానికి వెళ్ళిన విషయం తెలిసి బాధపడతాడు,
పదునాలుగేళ్ళ వరకు తిరిగి రాడని తెలుసుకొని వేదన చెందుతాడు. దీనికి కారణమైన తల్లిని దూషిస్తాడు, తల్లిని దూషించడం తప్పే ఐనా ఆమె అత్యాశతో తనకు చెందని రాజ్యాన్ని , జ్యేష్ఠపుత్రుడైన రామునికి అందవలసిన సింహాసనాన్ని తన కోసం అన్యాయంగా ఆర్జించే ప్రయత్నం చేసినందుకు, తనకు కట్టబెట్టాలని ప్రయత్నించినందుకు.
ఈవిధంగా ఆ నలుగురు సోదరులూ ఒకరికోసం ఒకరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడేవారు.
రాముడు నార వస్త్రములు ధరించి అరణ్యానికి వెళ్ళడానికి సంసిద్ధుడై, తల్లికి చెప్పి వెళదామని ఆమె నివాసానికి వెళ్ళాడు.
రాముడు పట్టాభీషేకం చేసుకోను చక్కగా అలంకరించుకొని తన గృహానికి వస్తాడని ఆమె ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఎదురుచూస్తోంది. కాని, పట్టాభిషేకానికి తయారై రావలసిన రాముడు నారవస్త్రాలు ధరించి రాగా సీతారాములను చూసి నిశ్చేష్టురాలైన కౌసల్యకు రాముడు, చిరునవ్వుతో,
''అమ్మా! నా తండ్రి నన్ను అయోధ్యకు కాక అరణ్య రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను, మునులను రాక్షసుల నుండి కాపాడుటకై నేను అరణ్యానికి వెళుతున్నాను. పితృవాక్య పరిపాలన నాకు ముఖ్యం" అంటాడు.
అప్పుడు కౌసల్య, "నాయనా! నిజమే, నీవు పితృ వాక్య పరిపాలన చేయవలసిందే! మరి నేను నీ మాతృమూర్తిని కదా! నిన్ను విడిచి నేను క్షణమైనా జీవించలేను. కాబట్టి, నీతో పాటు నన్నుకూడా అరణ్యానికి తీసుకొని వెళ్ళు," అని కోరుతుంది.
అప్పుడు రాముడు, "అమ్మా! నీ పతి నావియోగంతో దుఃఖములో మునిగియుండగా ఆయనను వదలి నీవు నాతో అరణ్యానికి రావడం న్యాయం కాదు. ఇలాంటి సమయంలో నీవు ఆయన్నూ ఓదార్చి బాధను తగ్గించాలి. అది నీ కర్తవ్యం. సతికి పతియే గతి కదా!" అని చెప్తాడు. ఇది భార్యాభర్తల ధర్మాన్ని తెలిపే ఆదర్శం.
రాముడు తన తల్లికి చెప్పిన మాటలన్నీ విన్న సీత రామునితో, "నాథా! సతికి పతియే దైవమని, పతిని సేవించమనీ అదే సతి ధర్మమని నీ తల్లికి బోధిస్తున్నావు నన్ను మాత్రం అయోధ్యలోనే ఉండి అత్తమామలను చూసుకోమంటున్నావు ఇదేం ధర్మం? నీ తల్లికొక ధర్మము, నాకొక ధర్మము ఉంటుందా?" అని అడుగుతుంది. ధర్మాధర్మ విచక్షణ, భర్తను అనుసరించాలనే సూచన ఇక్కడ కనిపిస్తుంది.
అప్పుడు కౌసల్య రామునితో, ''నాయనా! ధర్మము అందరికీ ఒక్కటే. నా కర్మను నేననుభవించక తప్పదు. సీతను మాత్రం నీవు బాధ పెట్టవద్దు. ఆమె ప్రార్థనను మన్నించి నీవెంట తీసుకొని వెళ్ళు. సర్వమును త్యజించి ఆమె నీతో అరణ్యానికి వస్తోంది" అని చెప్పింది.
దీనిని బట్టి కౌసల్య వ్యక్తిత్వం ఎంత గొప్పదో, ఆమె హృదయం ఎంత విశాలమైనదో మనకు తెలుస్తున్నది. కోడలిపట్ల అత్త మెలగాల్సిన తీరును ఆమె చెప్తున్నది.
తల్లీబిడ్డల యొక్క సంబంధం, అన్నదమ్ముల యొక్క సంబంధము ఎంత అన్యోన్యంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆదర్శవంతంగా ఉండాలో రామాయణం నిరూపిస్తోంది.
కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులేగాక వారి ధర్మ పత్నులు సైతం గొప్ప ఆదర్శాన్ని అందించారు.
సీత, ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తిలు నల్గురూ గొప్ప గుణము కల్గినవారు. పరుల ఆనందమే తమ ఆనందముగా భావించేవారు.
రాముడు అరణ్యానికి వెళ్ళేప్పుడు సీత, తన సర్వాభరణములను విసర్జించి రాముని వెంట బయలుదేరింది.
లక్ష్మణుని భార్య ఊర్మిళ చిత్రకళలో గొప్ప ప్రావీణ్యం కలిగినది. ఆమె తన గదిలో కూర్చుని శ్రీరామపట్టాభిషేక ఘట్టాన్ని రంగులతో చక్కగా చిత్రిస్తున్నపుడు లక్ష్మణుడు అక్కడికి చెప్పి పోను వస్తాడు.
'ఊర్మిళా!' అని పిలువగానే ఆమె గబుక్కున లేచి నిలబడగా అక్కడున్న రంగులన్నీ అమెకు తగిలి ఆమె గీసిన చిత్రంపై పడిపోతాయి.
ఆమె 'ఎంతో అందంగా గీస్తున్న చిత్రము పాడైపోయిందే' అని బాధపడగా, లక్ష్మణుడు "ఊర్మిళా! లోక కళ్యాణకరమైన శ్రీరామ పట్టాభిషేకాన్ని కైకేయి చెడగొట్టింది. నీవు గీసిన చిత్రాన్ని నేను చెడగొట్టాను.
దీని గురించి నీవు బాధ పడనక్కర్లేదు. ఈ జగత్తులో సుఖ దుఃఖములు రెండూ సమానంగా ఉంటాయి. వాటిని మనం సమత్వంతో స్వీకరించాలి" అని చెప్పి, తాను రాముని అనుసరిస్తున్నట్లు చెప్తాడు.
ఊర్మిళ గొప్ప త్యాగ గుణ సంపన్న. తన భర్త తనను విడిచి వెళుతున్నాడని ఆమె విచారించలేదు. అతని పాదాలకు నమస్కరించి ఆనందంగా వీడ్కోలు పలికింది.
తాను ఆ పద్నాలుగేళ్ళు అదే గదిలో నివసించింది. అంతే కాక ఆమె తన భర్తను అరణ్యంలో ఉన్నంత కాలం తనను తలంచక అన్న వదినలకు సేవచేయడంలో గడపమని చెప్తుంది.
లక్ష్మణుని తల్లి సుమిత్ర కూడా సాధారణమైంది కాదు. ఆమె పేరుకు తగినట్లుగానే గొప్ప గుణవంతురాలు. గొప్పస్నేహశీలి.
సీతారాములతో పాటుగా వారికి తోడుగా తాను కూడా అరణ్యానికి వెళుతున్నానని లక్ష్మణుడు చెప్పినప్పుడు ఆమె ఆనందంగా అంగీకరించింది.
దశరథుని కుటుంబములో అంతా కలసి మెలసి ప్రేమగా జీవించేవారు. పొరపొచ్చాలే లేవు. అందువల్లే సుమిత్ర ప్రసాదాన్ని ఒక పక్షి ఎత్తుకుపోగా కౌసల్య, కైక ఆమెకు సగం సగం భాగం ఇచ్చారు.
అందువల్లే సుమిత్ర తన ఇద్దరు కుమారులూ కౌసల్య పుత్రునితోనూ, కైక పుత్రునితోనూ కలసి పెరుగుతున్నా ఆ తల్లులపట్ల కృతజ్ఞతగా వారిని అలానే ప్రేమగా కలసి పెరుగనిచ్చింది.
ఐతే ఇక్కడ మనకొక సందేహం కలుగవచ్చు, రాముడంటే అంత ప్రేమగా ఉంటున్న కైక అతడినెందుకు అడవులకు పంపే వరం కోరుకుంది ? కైక చేసిన పని తప్పు కదా?
ఆమె భర్తతో పోట్లాడడం వల్లనే కదా రాముడు అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది, అని మనం అనుకోవచ్చు. అది పోట్లాట కాదు. అసలు కైకకు రాముడంటే చాలా ప్రేమ. తన కుమారుడైన భరతునికంటే రాముణ్ణి ఎంతో ప్రేమగా పెంచింది.
కాని, సహవాస దోషము వలన ఆమె మనస్సులో మార్పు వచ్చింది. మన స్నేహితులను బట్టి మనం ఎలాంటి వారమో ఇతరులు అంచనా వేస్తారు.
మంథర ప్రోద్బలం చేతనే కైకేయి అలాంటి వరం కోరింది.
ఐతే, మంథర కైకకు అలా దుర్బోధ చేయనూ కారణం ఉంది. ఆమె ఆవిధంగా ప్రవర్తించడానికి ఒక కారణముంది.
💥ఒక మారు కైకేయి తండ్రియైన కేకయరాజు అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఒకచోట అతనికి ఆడ, మగ జింకలు రెండు ఆడుకుంటూ కనిపించాయి. అతను వానిపై వేసిన ఒక బాణం తగిలి వానిలోని మగజింక మరణిస్తుంది.
ఆడ జింక ఏడుస్తూ తన తల్లి వద్దకు పోయి, ''అమ్మా! మేమిద్దరం కలసి ఆనందంగా ఆడుకుంటున్న సమయంలో కేకయరాజు నా భర్తను తన బాణంతో చంపేశాడు. ఇప్పుడు నా గతేంటి?" అన్నది.
అప్పుడా తల్లి జింక, ''అమ్మా! లోకంలో కష్టసుఖాలు రెండూ కలసి ఉంటాయి. మనం కష్టనష్టాలకు క్రుంగి పోకూడదు. వాటిని తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగిపోవాలి" అని తన బిడ్డను ఓదార్చింది.
తరువాత ఆతల్లి జింక కేకయ రాజు వద్దకు వెళ్ళి, "రాజా! ఎవరైనా సరే, కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. నేను చేసినా, నీవు చేసినా తప్పక అనుభవించాల్సిందే. ఇప్పుడు నా అల్లుని మరణంతో నేను బాధపడుతున్నట్లుగా నీవు కూడా రానున్న రోజుల్లో నీ అల్లుని మరణంతో బాధపడితీరాల్సిందే" అని శపించింది.
ఆ జింకయే మంథరగా జన్మించి , కైక బుధ్ధిని మార్చి కేకయరాజు అల్లుడైన దశరథుని మరణానికి కారకురాలైంది.
ఇలా తల్లీబిడ్డల యొక్క సంబంధం, అన్నదమ్ముల యొక్క సంబంధం ఎంత అన్యోన్యంగా, ఎంత పవిత్రంగా, ఎంత ఆదర్శవంతంగా ఉండాలో రామాయణం నిరూపిస్తున్నది.
ఒకరికోసం ఒకరుగా రామాయణంలోని అన్ని పాత్రలూ జీవించాయి. అంతే కాక మన జన్మ జన్మల కర్మలన్నీ అనుభవించి తీరాల్సిందే కనుక ఎవ్వరినీ బాధించక వేధించక మంచి విధానాల్లో జీవించాలని కూడా మనకు రామాయణం ద్వారా ఉదాహరణపూర్వకంగా తెలుస్తున్నది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment