💥సంబురాల "సంక్రాంతి"

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥సంబురాల "సంక్రాంతి"


సంక్రాంతి అంటే కొత్త శోభ.. సంక్రాంతి అంటే కొత్త పంట.. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ల రాక.. సంక్రాంతి అంటే 

వాకిట్లో రంగు రంగు చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు.. భగభగ భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల ఆటలు.. నోరూరించే పిండి వంటలు.. నింగిని తాకే గాలిపటాలు.. 


దేశంలోని పలు రాష్ట్రాలు సహా తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అన్ని పండుగల్లా కాకుండా ఈ పండుగకు అనేక ప్రత్యేకతలున్నాయి. 


వరుస నాలుగు రోజులు జరిగే ఈ వేడుకలను చూడాలంటే పల్లెల వైపు చూడాల్సిందే. అందుకే ఈ పండుగ సెలవులకు ఎక్కడెక్కడ నుంచో స్వస్థలాలకు చేరుకుంటారు.


💥సంక్రాంతి లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి.


సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు.


మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. ఇక్కడి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం.

శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము  ఉత్తరాయణము.


💥కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన మొదలు తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము.


మానసికమైన అర్చనకు, ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయణము.


పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు.

కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము.


కనుకనే ఉత్తరాయణము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు.


💥స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు, సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి.


దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతిపై కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగగా సంక్రాంతికి పేరుంది. సంక్రాంతి పర్వదినాన ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయని శాస్త్రోక్తి.


ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది.

ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కూరగాయాలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవిదానం చేస్తారు. గోదానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని విశ్వసిస్తారు.


ఇంటికి చేరే ధాన్య రాశులతో... కళకళలాడే గుమ్మాల తోరణాలతో విలసిల్లుతూ కొత్త కాంతిని తీసుకొచ్చేదే సంక్రాంతి.


ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగలో ఆద్యంతం ఆనందాలే కనిపిస్తాయి. ప్రతి పనిలోనూ దైవత్వం దర్శనమిస్తుంది. సంప్రదాయాలు, సందళ్లు అన్నిటా వైజ్ఞానిక రహస్యాలూ దాగి ఉన్నాయి.


ప్రాంతానికో ఆచారం కనిపించినా.. అన్నిటి పరమార్థం కలిమిని కలిసి పంచుకోవాలని సూచిస్తుంది!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు