సంబరాల సంక్రాంతి 💥
💥 ఓం నమో నారాయణాయ🌹🙏
💥రావమ్మ మహాలక్ష్మి రావమ్మ..
నీ కోవెల మా ఇల్లు కొలువై ఉందువు గానీ..
హరిదాసు సుతిమెత్తగా గళమెత్తి తనను కీర్తిస్తుంటే.. మహాలక్ష్మి ఎందుకు రాదు! చిరతల తాళానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ ఆయన ఆగిన ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది అమ్మ.
ఆ ఇంటి ఇల్లాలు దొడ్డ మనసుతో, ప్రశాంత వదనంతో, మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు.. ఆ ఇంట నవనిధులూ అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి.
హరిదాసు ఆఖరిమాట ‘కృష్ణార్పణం’.
భగవత్ కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సంప్రదాయం.
మూడురోజుల సంక్రాంతి నేర్పేది ఇదే! నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం.
💥'కంచి కామాక్షి పలుకు.. మధుర మీనాక్షి పలుకు..’
సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణ ఎరుకల సోదమ్మ.
చారెడు ధాన్యమిస్తే చాలు.. బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. ముగ్గురమ్మలు ఒక్కటై పలికిస్తారో.. వంశపారంపర్యంగా వచ్చిన అనుభవమో తెలియదు కానీ, ఆమె మాట మన్నికైనది!
భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మహాలక్ష్మమ్మే సోదమ్మగా సాక్షాత్కరించిన వైనం ఇది.
💥డూడూ బసవన్నను తోలుకొని గంగిరెద్దు దాసరి వచ్చేది.. పాతపంచ ఇస్తారనే ఆశతోనే కావచ్చు!
కానీ, పండుగ సరదా లక్ష్మిని పదింతలు పెంచడమే తన విధిగా భావిస్తాడు.
డోలు, సన్నాయి వాద్యాలతో ‘అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అంటూ బసవన్నను ఆడిస్తూ ఇంటిల్లిపాదీ పండుగపూట నందీశ్వరుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాడు.
గంగిరెద్దును ఆడించే అప్పన్న మాత్రం తక్కువా! సాక్షాత్తూ విష్ణుమూర్తి స్వరూపమే!
పూర్వం గజాసురుడి పొట్టలో ఉన్న పరమేశ్వరుణ్ని బయటికి రప్పించడానికి శ్రీమహావిష్ణువు వేషం మార్చి, గంగిరెద్దుల మేళాన్ని కట్టి కథను రక్తికట్టించిన ఉదంతం తెలిసిందే కదా!
ప్రతి కళలో తొణికిసలాడే శక్తి మహాలక్ష్మి అంశే!
వాకిట్లో బసవడి నృత్యం ఆ ఇంట సిరులను కురిపిస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు.
💥‘అంబ పలుకు.. జగదంబ పలుకు..’
అని గొంతెత్తే బుడబుక్కల కళాకారుడు శకునపక్షి శాస్త్రంలో ఉద్దండ పండితుడు. కోడి కూసింది మొదలుకొని నింగిలో సూరీడు సురుక్కుమనే వరకు అతను పలికిందల్లా బంగారమే!
అతను ఆడించే డమరుకం ధ్వని చెవిన పడినవారంతా లక్ష్మీ కటాక్షం పొందే అదృష్టవంతులే.
ఒకటేమిటి సంక్రాంతి వేళ పల్లెపల్లెలో కనిపించే, వినిపించే కళారూపాలన్నీ పుష్య లక్ష్మి అనుగ్రహాలే!
ఇన్ని సంబురాలు స్వాగతం పలుకుతూ ఉండగా.. పుష్య మాసంలో మహాలక్ష్మి ప్రతి ఇల్లూ తన పుట్టిల్లే అని భావించి కదిలివస్తుందని కవులు అభివర్ణించారు.
సస్యలక్ష్మికి సరిపడా సూర్యరశ్మిని పంచుతూ, క్రమక్రమంగా పెంచుతూ సంక్రాంతి సందడికి నాంది పలుకుతాడు భానుడు.
సంక్రాంతి శోభను పల్లెపల్లెకూ పంచే కళాకారులకు తోచింది ఇవ్వడం, వ్యవసాయంలో సాయంగా ఉన్న పశువులను పూజించుకోవడం, చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తులకు పంటలో భాగం ఇవ్వడం ఇవన్నీ మన పెద్దలు ఆచరించి, ఆనందించిన విధానాలు.
వారి అడుగుజాడల్లోనే మనమూ పయనిద్దాం.
సంక్రాంతి లక్ష్మిని సమంగా పంచుకుందాం!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment