దుర్గతి నాశిని.. సద్గతిదాయిని "మహాలక్ష్మి నమోస్తుతే"

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏


💥దుర్గతి నాశిని.. సద్గతిదాయిని "మహాలక్ష్మి నమోస్తుతే"


హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,

చందురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి,

తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు,

భాసురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్


🌹శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత.

త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు.

భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించినది.


సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట.

ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము.


వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే   లక్ష్యం కలిగినది - అని అన్నారు.


నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే!

శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!!


🌹క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి.


రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ... గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి భక్తులను అనుగ్రహిస్తుందంటారు పెద్దలు. 


మహాలక్ష్మి సర్వ మంగళకారిణి.

పురాణ కథల ప్రకారం, సృష్టి ప్రారంభంలో వటపత్రశాయిగా ఉన్న శ్రీమహావిష్ణువు సన్నిధికి ‘పరాశక్తి’ తన అంశయైున లక్ష్మీదేవిని పంపగా ఆమె శ్రీమహాష్ణువును వరించింది.


ప్రపంచ సంరక్షణలో పాలు పంచుకొనే శక్తిగా విష్ణువు సన్నిధిలో నిలిచిపోయింది.


తిరిగి పాల సముద్ర మధన సమయంలో ఆవిర్భవించి శ్రీమహావిష్ణువును లీలా కళ్యాణమాడి, దేవతలకు సామ్రాజ్యాన్ని ప్రసాదించింది.


లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణి.


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం!

దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం!

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!!


🌹లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురివై, శ్రీరంగధామమునకు అధిపతివై, 

దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు