💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వైభవం:

 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


శివశక్తుల అనురాగమునకు ఫలము, జ్ఞాన పండిత అని కీర్తించబడ్డ వాడు, గజముఖానుజుడు, దేవసేనాపతి, వల్లీనాయకుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వైభవమును తలచుకుని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులమౌదాము.


💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి వైభవం:


షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన) ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు.


అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న "సుబ్రహ్మణ్యారాధన" అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము. అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు. 


అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మం లో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.


పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I

అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా II

తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I


పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్త శక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.


అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ, లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామి తత్త్వం.


పరతత్వం-అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. 


అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్ కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మ తపో నిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచి ఉద్భవించిన వాడు కనుక "శరవణభవుడు" అయ్యాడు అయ్యాడు.


💥కాలస్వరూపం:

వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. 


కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని.

ఆరు ముఖాలు - ఆరు ఋతువులు. పన్నెండు చేతులు - పన్నెండు మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని రూపం.

ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది.

వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.


💥జ్ఞానస్వరూపుడు:

సుబ్రహ్మణ్యస్వామి వారు రాశీభూతమైన జ్ఞాన స్వరూపం. సునిశితమైన మేధస్సుకు స్వామి వారి చేతిలో ఉండే శక్తి ఆయుధమే ప్రతీక.

శివజ్ఞానప్రదాయిని అయిన అమ్మవారు ప్రసాదించిన దివ్యాయుధమిది.

ఇదే అజ్ఞానమనే తారకాసురుని సంహరించిన జ్ఞానశక్త్యాయుధము.


"జ్ఞానశక్త్యాత్మా” అనేది స్వామి వారి నామాలలో ఒకటి. ఇఛ్చా, జ్ఞాన, క్రియా అనేమూడు శక్తుల మయమైన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు, జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజః పుంజం – కుమారస్వామి.


శివతేజం స్కన్నమై వచ్చి రూపు కట్టిన దైవం కనుక ఈయన స్కందుడు.

రామాయణంలో యాగ రక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా, మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.


ఏషతే రామ గంగాయా విస్తరోమయా I

కుమారసంభవశ్చైవధన్యం పుణ్యస్తథైవ చ II

భక్తశ్చయః కార్తికేయే కాకుత్ స్థ భువిమానవాః I

ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్ II


🌹కార్తికేయ భక్తులు ఇహలోకంలో ఆయుష్మంతులై పుత్రపౌత్రులతో వర్ధిల్లి అంత్యమున స్కంద సాలోక్యాన్ని పొందుతారు. ఓ రామా! ఈ కుమారసంభవం “ధన్యపుణ్యగాథ” అని విశ్వామిత్రుని మాట.

(వాల్మీకి రామాయణం – బాలకాండ)


మహాభారతంలో కూడా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి జనన గాథ, తారకాసుర సంహారం అద్భుతంగా వర్ణించారు వ్యాసమహర్షి.

ధర్మరాజుగారికి మార్కండేయ మహర్షి చెప్తారు సుబ్రహ్మణ్య జనన వైభవం గురించి.


ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అటు శ్రీరామాయణం లోనూ, ఇటు మహాభారతంలోనూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం గురించి ఇవ్వడంలో రహస్యం సాధకులగా మనం గురువుల నుంచి తెలుసుకోవలసిన విషయం. 


💥రామాయణం లో రామచంద్ర ప్రభువుకి స్కందోత్పత్తి చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే, సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి రాముడిలో ప్రవేశించాలి.

అది రావణ సంహారమునకు అవసరము.


సుబ్రహ్మణ్య స్వామి వారిని అందుకే ఆంగ్ల భక్తులు

“The God of War” అని సంబోధిస్తారు.

దేవతలకు రాక్షసులకు, మంచికి చెడుకి, రాముడికి - రావణుడికి, పాండవులకి - కౌరవులకి మధ్య జరిగే యుధ్ధములలో దేవతా సైన్యం విజయం సాధించాలంటే, దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము.


ఇక్కడ ఇలా చెప్పడంలో రాముడిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు.. అసలు విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి వారు యజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞపురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడినది.


అందులోనే శ్రీమహావిష్ణువుకి

“స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః”

అనే నామాలు ఉన్నాయి.


అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.


మరి విష్ణువే రాముడు కదా, ఆయనకి విశ్వామిత్ర మహర్షి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో ఏమిటి రహస్యం అంటే..


రాముడు అవతార ప్రయోజనం కోసం సాధారణ మానవుడిగా వచ్చాడు, అప్పుడు ఆయన రావణ సంహారం చేయడానికి అవసరమైన సకల అస్త్ర శస్త్రములతో పాటుగా, యుధ్ధ వీరుడైన సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము.


ఇదే విషయం భారతంలో ధర్మరాజు గారికి సుబ్రహ్మణ్య వైభవం, తారకాసుర సంహారం చెప్పబడడలోనూ వర్తిసుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు