💥అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ
⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥అమ్మలగన్న యమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ
కారణం లేని కార్యం, మరణం లేని పుట్టుక ఉండవు.
"ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చు మీరినప్పుడు సాకార రూపంతో లోకంలో నేను అవతరించి సత్పురుషులను రక్షిస్తాను. దుష్టులను శిక్షిస్తాను" అంటాడు కృష్ణపరమాత్ముడు భగవద్గీతలో.
దేవీ భాగవతంలో కూడా.. జగన్మాత, దేవిగా అవతరించి చెడుపై పోరాడి మంచిపై విజయం సాధిస్తుందని చెప్పబడింది.
అమ్మలఁగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలాఁ బె
ద్దమ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో
నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చు త మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
🌹దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి. లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు శత్రువులైన రాక్షసుల తల్లులకు గర్భశోకాన్ని కలిగించిన తల్లి.
అనగా లోక కంటకులైన రాక్షసులను సంహరించిన స్వరూపం. తనను నమ్ముకున్న అష్టమాతృకలకు శక్తినిచ్చిన తల్లి. అంత గొప్పదైన మా అమ్మ.. సముద్రమంత కరుణ కలిగిన దుర్గమ్మ.. నాకు దయతో కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు ఇచ్చుగాక’’ అంటూ పోతానామాత్యులవారు అత్యంత అద్భుతంగా ఆ తల్లి గొప్పదనాన్ని వివరించారు.
💥ఆవిడ "అమ్మల గన్న యమ్మ ముగు రమ్మల మూలపు టమ్మ" –
అవును అసలు స్త్రీ దేవత లంతా దుర్గనుండే పుట్టిన వారే. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టిన వారే.
అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింప దగ్గది. పురుష లక్షణం గల దేవత లందఱు విష్ణువునుండి గాని, శివుడినుండి గాని పుట్టినట్లు చెప్తారు. కాని కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలు; వారాహి, చండీ, బగళా మొదలైన మాతలు; రేణుక ఇత్యాది శక్తులు; చివరకు గ్రామదేవతలు అంతా శ్రీమహాదుర్గా దేవతాంశ సంభూతులు గానే చెప్పబడతారు.
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీ శరీరదాత్రి. ఈ కార్యకారణ సంఘాత మంతా పంచభూతాలనుండి పుడుతుంది.
చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. అంతా ఒక ముద్ద.
ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహార మై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది.
పంచభూతాలు = భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. పంచేంద్రియాలు = చూసే కళ్ళు, వాసనలు పీల్చే ముక్కు, రుచినీ తెలిపే నాలుక, శబ్దాలని వినిపించే చెవులు, స్పర్శని తెలియ జేసే చర్మం.. ఈ ఐదిటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి.
కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటుంది. అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది. బహుజీవులుగా పుడుతుంది, చస్తుంది, మళ్ళా జన్మిస్తుంది.
కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒక్కటే శక్తి. రూపాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులని బట్టీ భిన్న మౌతుంది, కాని చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మని బట్టి మారదు. అదే మహాశక్తి. ఆమే దుర్గ. మాతృత్వ గుణానికి కారణ భూతురాలు.
💥ఆవిడ "చాల పెద్దమ్మ" -
ఆమె సనాతని. ఇప్పటిది అని చెప్పలేము. ఎప్పటిదో కూడా చెప్పలేము. ఈ సృష్టి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఆమె ఉంది.
💥ఆవిడ "సురారు లమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ"
ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి.
కలిపి చదివితే. (అ) రాక్షసులు (సురారులు దేవతల = శత్రువులు).. వారి తల్లి దితి. వాళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు, బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపాఱడి తీర్చింది అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ.
(ఆఱడి = గాయం, బాధ), (పుచ్చుట = మాన్పటం) ;
(ఆ) విడదీసి చదివితే సురారు లమ్మ ఆ తల్లి దేవతలకే కాదు, రాక్షసులకి కూడా తల్లే మరి. మంచివాళ్ళకీ, చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా.
కడుపు ఆఱడి పుచ్చిన యమ్మ మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట మొచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చ గలది, తీర్చేది ఆ అమ్మె (కడు = మిక్కిలి).
💥ఆవిడ "తన్ను లోనమ్మిన వేల్పు టమ్మల మనంబుల నుండెడి యమ్మ"
తనని లోనుగా తలచెడి వారు (లోనమ్మిన) వేల్పు టమ్మలు = సర్వ దేవతా మూర్తుల యందు నిలిచి ఉండెడి మాతృతత్వం. సకల జీవులలోను ఉండే సహజ దయాస్వభావం. మాతృ దేవతలు. ఆ తత్వాన్ని వారి మనసులలో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి ఆమె.
💥"కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"
అలాంటి అమ్మవు, మా యమ్మవు నీవు మాకు సర్వ సంపదల్నీ (మహత్వం కీర్తి ధనం, విద్య కవితా శక్తి, పటుత్వం శక్తి సామర్థ్యాలు = సంపదలు అన్నీ) సముద్ర మంత కృపతో ప్రసాదించు తల్లీ.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment