💥హనుమంతుడు - సూర్యుడు

 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ప్రతిరోజు పఠించాల్సిన శ్లోకం:💥


ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం!

విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం!

ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం!

నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం!!


💥హనుమంతుడు - సూర్యుడు


ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు.

అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. 


ఈ సందర్భాన్నే...

యుగ సహస్ర యోజన పరభానూ/

లీల్యోతాహి మధురఫల జానూ

- అని హనుమాన్‌ చాలీసా 18వ చౌపాయీలో తులసీదాసు పేర్కొన్నాడు. 


ఇక్కడ ‘యుగ సహస్ర యోజన’ అంటే లెక్కించలేనంత దూరం అని అర్థం.

యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు.


కొంతమంది మాత్రం యుగ అంటే 12,000గా తీసుకొని, సహస్రం (1,000), యోజనం (13 కిలోమీటర్లు) తో గుణించి 15 కోట్ల కిలోమీటర్లని లెక్కించారు.

ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం భూమికి, సూర్యుడికి మధ్య దూరం రమారమీ ఇంతే అని తేలింది.


ఆంజనేయుడి అపరిమిత బలాన్ని వర్ణించడానికి మాత్రమే తులసీదాసు ఈ పదాలు ప్రయోగించాడని తెలుస్తున్నది.


💥బాల ఆంజనేయుడు సూర్యుణ్ని మింగబోతుంటే దేవతలంతా భయభ్రాంతులకు లోనయ్యారు.


మారుతిని నిలువరించడానికి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దాంతో అంజనీ తనయుడు నేలపై పడిపోయాడు.

దవడకు గాయమై అది వంకరపోయింది.

అలా ఆంజనేయుడు హనుమంతుడు అయ్యాడు.

‘హనువు’ అంటే దవడ.


తన పుత్రుడు గాయపడటంతో వాయుదేవుడు ఆగ్రహించాడు. విశ్వంలో సంచరిస్తున్న గాలినంతా విరమించుకున్నాడు. ఊపిరాడక సృష్టి అల్లాడింది. 


దేవతల ప్రార్థన మేరకు వాయువు మళ్లీ వీయడం మొదలుపెట్టాడు. దీనికి ప్రతిగా ఇంద్రాది దేవతలంతా తమ సమస్త శక్తులనూ ఆంజనేయుడికి ధారపోశారు. 


💥కాగా, సూర్యుడంటే హనుమకు కేవలం ఆటవస్తువు మాత్రమే కాదు. గురువు కూడా.

తనకు తగిన గురువును చూపించమని అడిగినప్పుడు, ప్రపంచానికి వెలుగునిచ్చే కర్మసాక్షి దివాకరుడే గొప్ప గురువని సలహా ఇచ్చారట.

దాంతో సూర్యుణ్ని తనకు గురువుగా ఉండమని కోరాడు ఆంజనేయుడు.


ఒక్కచోట స్థిరంగా ఉండకుండా, నిరంతరం పయనిస్తుంటాడు కనుక విద్యా బోధన తనకు కుదరదన్నాడు సూర్యుడు.

ఆంజనేయుడు వెనక్కి తగ్గలేదు.

అలా సూర్యుడి నుంచి నాలుగు వేదాలు, తొమ్మిది రకాల వ్యాకరణాలతోపాటు సమస్త విద్యలూ నేర్చుకున్నాడు. 


గురుదక్షిణ ఏమివ్వాలని అడిగాడు. ఏమీ వద్దన్నాడు సూర్యుడు. అయినా ఎంతకూ హనుమంతుడు వినకపోవడంతో, తన కొడుకు సుగ్రీవుడికి అన్నివేళలా రక్షగా ఉండమన్నాడు.


అలా రాముడు పరిచయమై, సుగ్రీవుడికి వానర రాజ్య పట్టం కట్టేవరకు వాయుపుత్రుడు సూర్యపుత్రుణ్ని కంటికి రెప్పలా చూసుకున్నాడన్నది కథ.


💥ఈ రెండు సందర్భాల్లో మాత్రమే కాకుండా లక్ష్మణుడికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు సంజీవ పర్వతాన్ని తీసుకు వచ్చే క్రమంలో ఉదయించకుండా సూర్యుణ్ని తన అధీనంలో ఉంచుకున్నాడు హనుమంతుడు.

ఈ చర్యలన్నీ ఆయనను స్థల, కాలాలకు అతీతుడిగా నిలబెడతాయి.


రామాయణాన్ని అనుసరించి రావణుడు కూడా మంచి జ్యోతిష శాస్త్రవేత్త. అయితే రావణుడిది గ్రహాలన్నీ తనకు అనుకూలంగా ఉండాలన్న తత్వం. హనుమంతుడు మాత్రం తన శక్తిని ఇతరుల మేలుకోసం ఉపయోగించే లక్షణం కలిగినవాడు.


అందువల్ల దుష్టగ్రహ బాధల నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తారు. ప్రత్యేకించి మంగళ, శనివారాల్లో హనుమను శక్తికొద్దీ ఆరాధిస్తారు.


💥త్రిమూర్తుల శక్తి:

సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు.

అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక.


హనుమంతుని భవిష్యత్ బ్రహ్మ కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకమైనట్టే.


సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించవచ్చు.


ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు