💥జగమంతా లక్ష్మీ నివాసం

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥జగమంతా లక్ష్మీ నివాసం..


"లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది?" అని భీష్ముడిని అడుగుతాడు ధర్మరాజు.


దానికి జవాబుగా ‘జలాల్లో, పచ్చని పొలాల్లో, అగ్నిలో, వాయువులో, గోవులో, ఏనుగు కుంభస్థలంలో, ఇంటి గడపపై, ఇల్లాలి పాపిటబొట్టులో, నుదుటి సిందూరంలో, ఇంట్లోని వ్యక్తుల చిరునవ్వులో, అతిథి సత్కారాలు ఉన్న ఇంటిలో, స్వచ్ఛతలో, పరిశుభ్రతలో, బంగారంలో, చల్లని వెన్నెలలో, సత్యం, దానం, వ్రతం, ధర్మం ఆచరించే చోట లక్ష్మి నివసిస్తుంది’ అని చెప్పిన భీష్ముడి సమాధానం ద్వారా జగమంతా లక్ష్మీ నివాసమే అని అర్థమవుతుంది.


కష్టానికి ప్రతిఫలం లక్ష్మి.

సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే!

సంతృప్తికి మూలం ఆవిడే!!


పసిడి పంటల్లో ధాన్యలక్ష్మిగా.. పాలనలో రాజ్యలక్ష్మిగా..

లాలనలో గృహలక్ష్మిగా.. ఇంటింటా సంతానలక్ష్మిగా...


అష్టలక్ష్ముల చూపుతో.. అష్టదరిద్రాలూ తీరిపోతాయని తహతహలాడుతుంటారు జనులు.

ఆ తల్లి కరుణ అణువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తుంటారు.


పూజలు, వ్రతాలు, నోములు చేయడంతో ఆ అమ్మ తప్పక సంతోషిస్తుంది! అదే సమయంలో మన నడత

సక్రమంగా ఉంటే మరింత అనుగ్రహిస్తుంది.


💥గుణగణాలే లక్ష్మి...


లక్ష్మి అంటే ‘శుభలక్షణ లక్షిత’ అని అర్థం ఉంది.

మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా, గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.


మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి.

ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో, పలు రూపాల్లో కొలుస్తుంటాం.


పవిత్రంగా, ప్రశాంతంగా ఉండే ఇండ్లలో, మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది.


శుద్ధ (సిద్ధ)లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ

శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా!!


"శుద్ధలక్ష్మి" అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటినీ, తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది.


శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు! అంతర్‌ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది.


బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికిపట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలువదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. 


నిరంతరం శుభాన్ని కోరేవారు, శాంత స్వభావులు, ఇంద్రియ నిగ్రహం కలవారు, పరులకు సాయం చేసేవారు, అతిథులను గౌరవించేవారు, కాలం వృథా చేయనివారు, కృతజ్ఞత చూపేవారు, సమర్థంగా పని చేసేవారు..

ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట నేనుంటానని లక్ష్మీదేవి స్వయంగా రుక్మిణీదేవికి చెప్పిందని పురాణ గాథ.


శ్రమైక జీవన సౌందర్యమే లక్ష్మి. కష్టపడేవారిని సదా అనుగ్రహిస్తుందామె.

లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు. డబ్బు మాత్రమే కాదు. జ్ఞానం, సంతృప్తి, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే!


💥ఇక్కడ క్షణం ఉండదు...


మన ఇంట్లో లక్ష్మి కొలువుదీరడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ, చిన్న పొరపాటు చాలు అనంత లక్ష్మి అంతర్ధానమైపోతుంది.


మనసులో అసూయ రగిలినా, లోభాన్ని ప్రదర్శించినా, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు గురైనా ఆ ఇంట లక్ష్మి ఉండదు.


ధర్మం తప్పిన చోట, తులసిని పూజించని చోట, శివార్చన జరగని ఇంట, అతిథి సత్కారాలు లేని నెలవు నుంచి లక్ష్మి వెళ్లిపోతుంది.


ఇల్లాలు కంటతడి పెట్టినా, అసత్యాలు పలికినా, దుర్భాషలాడినా, ఇతరుల మనసు గాయపరిచిన వారి ఇంటి నుంచి సిరి తరలిపోతుంది.


భాగవతులను నిందించే వాళ్లపై కనికరం చూపదు లక్ష్మీదేవి. పొద్దస్తమానం నిద్రపోయే సోమరులను, పని చేయడంలో అశ్రద్ధ వహించే బద్ధకస్తులను కన్నెత్తి చూడదు. కలహాలు పెట్టుకునే ఇంట్లో క్షణం నిలువదు.


ఆపదలు తీరి అన్నిటా సంతోషం కలిగినప్పుడు విచక్షణ కోల్పోకుండా, వివేచనతో మెలగాలి.

జ్ఞాన తృష్ణను తీర్చుకుంటూ ధార్మికత వైపు పయనించాలి.

కలిగిన దాంట్లో నలుగురికీ సాయం చేస్తూ పునీతులం కావాలి.

అప్పుడే లక్ష్మీ అనుగ్రహానికి సార్థకత ఏర్పడుతుంది.

మోక్షానికి మార్గం సుగమం అవుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు