శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!
భావము:
శాంతిస్వరూపా! భుజగశయన! నాభిలో పద్మము కలవాడా! దేవతలకు అధిపతి అయినవాడా! ఈ విశ్వమునకు అంతటికీ ఆధారము అయినవాడా! ఆకాశము లాగా అంతటా వ్యాపించి ఉన్నవాడా! శుభప్రదమైనవాడా! యోగుల ధ్యానమునకు గమ్యమైనవాడా! సంసార భారమును పోగొట్టువాడా! ఓ విష్ణుదేవా! నీకు నమస్కారము.
🍁🍁🍁🍁🍁
ఇందులో సృష్టిక్రమం.. సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం.. ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
🌹శాంతాకారం:
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.
🌹భుజగ శయనం:
అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు.. భుజగము. ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.
🌹పద్మనాభం:
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన ‘పద్మనాభుడు’
🌹సురేశం:
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు, విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు.
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.
🌹విశ్వాధారం:
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు సురలు. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’
🌹గగన సదృశం:
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది. సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా, సమస్త విశ్వమూ ఎవరి యందు, ఎవరిచే వ్యాప్తమై ఉందో, అతడే పరమాత్మ.
అందుకే ఆయన ‘గగనసదృశుడు’ (గగనం వంటివాడు)
🌹మేఘవర్ణం:
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే.. తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.
🌹శుభాంగం:
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది. అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’
🌹లక్ష్మీ కాంతం:
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి. ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి, ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’
🌹కమల నయనం:
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’
🌹యోగిహృద్యానగమ్యం:
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు. యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’
🌹వందే విష్ణుం భవ భయహరం:
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’
🌹సర్వలోకైకనాథమ్:
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’
14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని, ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా, మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే సాధనా రహస్యాన్ని కూడా ఈ శ్లోకం అందిస్తోంది.
సేకరణ... బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సౌజన్యంతో..💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment