💥సకల గుణాభిరామా శ్రీరామా !

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


శ్రీరఘురామ చారు తులసీదళదామ, శమక్షమాది శృం

గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు

ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో

త్తారకరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!


🌹భావం:


ఇక్ష్వాకువంశం సంపదలకు నెలవు.

ఆ వంశంలో రఘుమహారాజు గొప్పవాడు.

అటువంటి వంశ పరంపరలో పుట్టినవాడు.

అందమైన తులసీదళాలతో తయారైన మాలికను ధరించినవాడు.

శాంతి, ఓర్పు అనే మంచి లక్షణాలతో ప్రకాశించేవాడు.

ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకున్నవాడు.

పరాక్రమం అనే సంపదను ఆభరణంగా కలిగినవాడు.

ఎవ్వరికీ ఎదుర్కోవడం సాధ్యం కాని కబంధుడనే రాక్షసుని వధించినవాడు.

ప్రపంచంలోని మానవులను పాపాలు అనే సముద్రం నుంచి దాటించగల ‘రామా’ అనే పేరు గలవాడు.

దయకు సముద్రం వంటివాడు.

భద్రాచలం అనే కొండ పైభాగంలో నివాసం ఉన్నవాడు.

దశరథ మహారాజుకు ముద్దుల కుమారుడు.

ఆయనే శ్రీరాముడు.

🍁🍁🍁🍁🍁


💥సకల గుణాభిరామా శ్రీరామా !


"శ్రీరామచంద్రుడు" - పేరు వినగానే కన్నుల ఎదుట ఒక దివ్యమైన స్వరూపం సాక్షాత్కరిస్తుంది.

ఆ రూపం సకల కల్యాణ గుణాలతో అలరారుతూ మనస్సులకు ఆనందాన్ని నింపుతూ మైమరపిస్తుంది.

అదే శ్రీరామచంద్రునిలోని గొప్పతనం.


అందరినీ ఆనందపరిచేవాడే శ్రీరాముడు.

‘‘రమయతీతి రామః’’ కదా.


"మరి వేరే దిక్కెవరయ్యా రామా" అంటూ త్యాగరాజు శరణాగతి చేసినా...


"తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’’ అంటూ రామదాసు గుండెలమీద చెయ్యి వేసుకున్నా... 


"రాముడు లోకాభిరాముడు’’ అంటూ

‘‘కలడన్నవారి పాలి కన్నుల ఎదుటే మూరితి’’ అంటూ అన్నమయ్య సున్నితంగా తత్త్వాన్ని ప్రతిపాదించినా...


అందరి ఎదుట, అందరి హృదయాల్లో రూపుదిద్దుకున్నది ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని వైశిష్ట్యమే అని చెప్పక తప్పదు.


💥ఋజు ప్రవర్తనలో సత్య వాక్పరిపాలనలో, సామర్థ్యంలో, జ్ఞానంలో అందరికీ ఆనందాన్ని కల్గించడంలో రాముడికి రాముడే సాటి.


పశువులు, పక్షులు, క్రూర జంతువులు, పామరులు పండితులు, రాక్షసులు, వానరులు ఒకరేమిటి అనంత ప్రాణికోటి రాముని చూసి పరవశించినవే.


శ్రీరాముడు మానవునికుండవలసిన గుణాలను కలిగి సమాజంలో మనిషి ఎలా ప్రవర్తించాలో ఆచరించి చూపిన ఆదర్శమూర్తి.


పదహారు గుణాలు అనే పదహారు కళలతో శ్రీరామచంద్రమూర్తి అయినాడు. మర్యాదాపురుషోత్తముడుగా కీర్తిని పొందాడు.

ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవలసినవి ఎన్నో వున్నాయి. 


తండ్రి మాటను పాటించడం, సత్యాన్ని పలుకడం, ఏకపత్నీ వ్రతం, సోదర ప్రేమ, ఆర్తులను రక్షించడం, అసూయ లేకపోవడం, ఇలా ఎన్నో, ఎన్నెన్నో.


💥"ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అంటూ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తనకు తాను చెప్పుకున్నాడు.

కానీ శ్రీరాముడు తాను భగవానుడని ఎక్కడా అనలేదు.


నరునిగా అవతరించాడు.

కలసిమెలసి మెలిగాడు.

నరుడు తలిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు.

సత్ప్రవర్తనలో చూపించాడు.

అందుకే ఆదర్శపురుషుడైనాడు. రఘువీరుడైనాడు,

జానకి రాముడైనాడు, మర్యాద పురుషోత్తముడైనాడు.

ఎప్పటికీ ఆయనే మనకు ఆదర్శం.

రామాయణమే మనకు నిత్యపారాయణ గ్రంథం.


శ్రీరామః శ్శరణం మమ అందాం.

చేతులెత్తి మొక్కుదాం.

🌹🌹శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష🌹🌹

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం