💥అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే "శ్రీదత్తాత్రేయ" అవతారం
⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥అనంత కరుణా సముద్రుడై భక్తులను సతతమూ రక్షించే సనాతన శాశ్వత ఆనందమే "శ్రీదత్తాత్రేయ" అవతారం.
స్వామి ఇహ, పర ఉభయ ఫలప్రదాత..
🌹అవధూతకు అందరూ గురువులే!
ప్రహ్లాదుడికి అజగరవ్రతధారి మునిరూపంలో సాక్షాత్కరించి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
దత్తాత్రేయ స్వామి ప్రకృతిలోని చరాచరాలను తన గురువులుగా ప్రకటించుకున్నారు.
తనకు "ఇరవై నాలుగు" మంది ప్రధానమైన గురువులు అని అజగర రూపంలో ప్రహ్లాదుడికి ఇలా వివరించాడు...
💢 కర్మబంధంలో చిక్కి స్వయంగా బాధపడే అజ్ఞానుల వల్ల.. కలిగే బాధలన్నిటినీ భరిస్తూనే, వారికి వీలైనంత మేలు చేస్తాను.
దీన్ని నేను "భూమాత" నుంచి నేర్చుకున్నాను.
💢 సుగంధ దుర్గంధాల్ని మోస్తూనే వాటికి అంటకుండా ఉండే "వాయువు"ను చూసి సుఖదుఃఖాల మధ్య ఉంటూనే వాటికి చిక్కకుండా ఉండటం అవగతం చేసుకున్నాను.
💢 దేనితోనూ సంబంధం లేకుండా ఉండే "ఆకాశాన్ని" చూసి, ఈ జడమైన శరీరాన్ని మోస్తూనే, అది నేను కానట్లు ఉండటం తెలుసుకున్నాను.
💢 తనను తాకిన అన్నిటినీ శుద్ధి చేసే "నీటి"ని చూసి నా సంగంలోకి వచ్చిన వారందరికీ పవిత్రతను, మంచిని పంచటం అలవాటు చేసుకున్నాను.
💢 తనకు ఆహుతి ఇచ్చిన అన్నిటినీ దహించే "అగ్ని"ని చూసి ఆహారంగా ఎవరేం ఇచ్చినా స్వీకరిస్తాను.
💢 పెరిగి తరుగుతున్నా మారని "చంద్రుడి"ని చూసి శరీర కష్టసుఖాలను పట్టించుకోకుండా ఆనందంగా ఉండటం నేర్చుకున్నాను.
💢 సముద్రం నుంచి నీటిని గ్రహించి వర్షం రూపంలో తిరిగి ఇచ్చే "సూర్యుణ్ని" చూసి... పొందిన ఉపకారాల్ని తగిన సమయంలో తగిన విధంగా తిరిగి ఇవ్వటం తెలుసుకున్నాను
💢 ఆహార అన్వేషణ చేయని "కొండచిలువ"లా అయాచితంగా వచ్చిన ఆహారం ఏదైనా ఆనందంగా స్వీకరించి, ఆత్మచింతనలో మునిగిపోవటం తెలుసుకున్నాను.
💢 నదులన్నీ వచ్చి కలిసినా అనంత గాంభీర్యాన్ని వదలని "సముద్రాన్ని" చూసి కోరికల వెంట పరుగులు తీయక స్థిరత్వాన్ని పొందాను.
💢 ఆకర్షణల మంటలో పడి మాడి మసైపోయే "శలభాన్ని" చూసి ఇంద్రియ భోగాలనే మంటలకు చిక్కకుండా ఉండగలిగాను.
💢 కూడబెట్టిన తేనెను అనుభవించలేని "తేనెటీగ"ను చూసి, రేపటి గురించి ఆలోచన మానేశాను.
💢 స్పర్శసుఖాన్ని ఆశించి వేటగానికి చిక్కే "ఏనుగు"ను చూసి కామాన్ని, ఐహిక సుఖాల్ని, భోగవాంఛల్ని త్యజించాను.
💢 వేటగాడి సంగీతానికి లోబడి ప్రాణాలు కోల్పోయే "లేడి"ని చూసి, శ్రవణేంద్రియాన్ని అధిగమించాను.
💢 తినకుండా, దానం చేయకుండా తేనెను పోగేసే "తేనెటీగల్ని" చూసి పోగేయాల్సింది ధనం కాదు, జ్ఞానమని తెలుసుకున్నాను.
💢 ఎరకు ప్రలోభపడి గాలానికి చిక్కిన "చేప"ను చూసి జిహ్వ చాపల్యాన్ని జయించాను.
💢 విటులకై ఎదురుచూసి విరక్తి చెందిన పింగళ అనే "వేశ్య"ను చూసి ఆశాపాశానికి బందీని కాక, ఆనందంగా స్వేచ్ఛగా ఉండటం నేర్చుకున్నాను.
💢 కాకులు వెంటపడగా మాంస ఖండాల్ని వదిలి శాంతిని పొందిన "గద్ద"ను చూసి, లౌకిక వాంఛలను, వాటి వెన్నంటి ఉండే దూషణ భూషణాలను లెక్కచేయకుండా ఉండగలుగుతున్నాను.
💢 శబ్దాన్ని తగ్గించేందుకు ఒక "కన్య", ఒక గాజును తప్ప మిగిలిన గాజులను తీసేయటం చూసి, లోకపు కాకిగోలను నివారించేందుకు ఒంటరిగా ఉంటూ ఆత్మధ్యానంలో లీనమయ్యాను.
💢 ఏ కారణం లేకుండానే ఆనందంగా ఉండే "పసివాడి"ని చూసి త్రిగుణాలకు అతీతంగా ఉండటం తెలుసుకున్నాను.
💢 బాణం మొనకు పదునుపెడుతూ పక్కనే వెళ్తున్న రాజుగారి పటాలాన్ని పట్టించుకోని "బోయవాణ్ని" చూసి ఏకాగ్ర చిత్తాన్ని అలవర్చుకున్నాను.
💢 చీమలపుట్టలోకి చేరి జీవించే "పాము"ను చూసి, చెట్లను, గుహలనే నివాసంగా మార్చుకున్నా.
💢 భ్రమరానికి చిక్కిన "కీటకం" భయంతో దాన్నే ధ్యానిస్తూ భ్రమరంగానే మారిపోవటం చూసి, ఆత్మనే ధ్యానిస్తూ నన్ను నేను మరచిపోయాను.
💢 "సాలెపురుగు" నుంచే దాని గూడు తయారైంది. అలాగే భగవంతుడు తయారుచేసిన సృష్టిలోని ప్రతీదాన్నీ భగవన్మయంగా దర్శిస్తున్నాను.
💢 చివరగా నా "శరీరం" కూడా నాకు గురువే! దానితోనే నేను ధర్మాలను ఆచరిస్తున్నాను.
కానీ, ఏనాటికైనా అది మరణిస్తుందని తెలుసుకొని, పరిపూర్ణ వైరాగ్యాన్ని పొంది ఆనందంగా ఉన్నాను.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment