నిజరూపం... అపురూపం (అప్పన్న చందనోత్సవం)

 ⚜️🕉️🚩ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః🙏

🏵️🌼🏵️🌼🏵️


💥నిజరూపం... అపురూపం (అప్పన్న చందనోత్సవం)


సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే

సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం!! 


🌹ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే.

అలాగే ప్రహ్లాదుని కోరిక మేరకే, వరాహ నారసింహ అవతారాల కలయికతో ఇలపై వెలసిన దివ్యక్షేత్రం "సింహాచలం" 


ఇక్కడ స్వామి వరాహ వదనంతో, మానవ శరీరంతో,

సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు.


ఏడాదిలో 364 రోజులూ సుగంధ పరిమళ చందనమై పూతలో దర్శనమిచ్చే స్వామి ఒక్కనాడు అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే అదీ ఓ పూట శ్రీచందన ముసుగును తొలగించి భక్తులకు నిజరూప దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. 


కుందాభ సుందర తనుః పరిపూర్ణ / 

చంద్రబింబానుకారి వదన ద్విభుజస్ర్తీ నేత్రః

శాంతస్ర్తీభంగి లలితః క్షితి గుప్తపాదః /

సింహాచలే జయతి దేవ వరోనృసింహః


🌹ఇచ్చట వెలసిన శ్రీ వరాహ నారసింహుడు సుందరమైన తనువు కలవాడు.

పూర్ణ చంద్రుని వంటి మేనిఛాయ కలవాడు, ద్విభుజుడు, త్రినేత్రుడు, శాంతమూర్తి, శరీరమందు మూడు వంకలు కలవాడు, భూమి లోపల పాదాలు నిక్షిప్తమై యున్నవాడు అంటూ స్వామి విలక్షణ స్వభావ స్వరూపాన్ని క్షేత్ర మహాత్మ్యం వర్ణిస్తోంది. 


💥చందనోత్సవం జరిగేదిలా...


చల్లని చందనపు ముసుగులో ఉన్న చక్కని స్వామిని చూసేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.


వైశాఖ శుక్ల తదియ (అక్షయ తృతీయ) పర్వదినం సమీపిస్తుండగా, స్వామిని అర్చక స్వాములు, పండితులు వేద మంత్రోచ్ఛారణలు చేస్తుండగా, నాదస్వర మేళతాళాలు మిన్నంటుతుండగా సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు.


నిత్యార్చనలు పూర్తయిన తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామిపై ఉన్న చందనాన్ని విసర్జింపజేస్తారు.


నిజ రూపంలోకి వచ్చిన స్వామి శిరస్సున, ఛాతిపైన చలువ చందనాన్ని ముద్దలుగా ఉంచుతారు. 


దేవాలయంలో అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ అర్చకులు ఆలయ అధికారులు ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకి తొలి దర్శన భాగ్యం కల్పిస్తారు.


అనంతరం ప్రముఖులతోపాటు సాధారణ భక్తులకి కూడా ఏకకాలంలో దర్శనం కల్పిస్తారు.

రాత్రి తొమ్మిది గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది.


అనంతరం గంగధార నుండి సహజసిద్ధమైన జలాలను వందలాది మంది శ్రీవైష్ణవ స్వాములు వేయి కడవలతో తీసుకురాగా అర్చకులు స్వామిని అభిషేకిస్తారు.

వీటితోపాటు పంచామృతాభిషేకం జరుగుతుంది. 


అభిషేకాదులు ముగిశాక స్వామికి తొలి విడతగా మూడు మణుగుల శ్రీగంధాన్ని సమర్పించడంతో చందన యాత్ర ముగుస్తుంది.


💥అవతార రహస్యం...


తల్లి గర్భం నుండే హరి భక్తిని అలవరచుకున్న పరమ పావనుడు ప్రహ్లాదుడు.

కుమారుని హరిభక్తిని సహించలేని హిరణ్య కశిపుడు విష్ణుభక్తి వలదని నయానా భయానా చెప్పి, చివరకు అనేక శిక్షలకు గురి చేస్తాడు.


ఈ నేపథ్యంలోనే ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి కొండను పైన మూతగా వేస్తారు.

కొండ కింద ప్రహ్లాదుడు ఆర్తితో త్రాహి.. త్రాహి.. అంటూ రక్షించమని శ్రీహరిని వేడుకుంటాడు.


అంతట శ్రీమహావిష్ణువు గరుత్మంతునిపై ప్రహ్లాద రక్షణార్థమై వస్తూ భక్తుని రక్షించాలనే తాపత్రయం హెచ్చుకాగా, గరుత్మంతుడు వేగంగా ఎగురుతూ అలసిపోతుంటే...

స్వామి తన బొటనవేలు నోటిలో పెట్టి గరుడుడికి అమృతపానం చేయిస్తూ, జారిపోతున్న పట్టు పీతాంబరాన్ని మరొక చేతితో పట్టుకొని వస్తూ ఇంకా వేగం సరిపోక సింహగిరిపై అమాంతం దూకాడట.

స్వామి వేగానికి పాదాలు రెండు పాతాళంలో కూరుకుపోయాయట.


ప్రహ్లాదుని రక్షించిన స్వామి హిరణ్యకశిప సంహారానంతరం ప్రహ్లాదుని కోరిక మేరకు సింహగిరిపై ద్వయావతార రూపంలో వెలసినట్లు, ప్రహ్లాదుడు కృతయుగాంతం వరకు స్వామిని సేవించి తరించినట్లు స్థల పురాణ గాథ. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏