అమరకోశంలో శివ శబ్దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి.

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱


పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం

బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా

నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్

శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!


💥తాత్పర్యము:

శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును.

నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. 

శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము.

🍁🍁🍁🍁🍁


💥"శివ" అనే శబ్దము చాలా గొప్పది💥


శివమహాపురాణము "శివ" శబ్దముతోటే ప్రారంభమయింది. 

"శివ" శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. 

దానిని "అమరసింహుడు" అనబడే ఒక జైనుడు రచించాడు.

కానీ "శంకర భగవత్పాదుల"తో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది.


"నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి" అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు.

ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి.


ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది "అమరకోశము"


ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.


"శివ" అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి?

అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 


🌹అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' 


- శివుడు నిర్వికారుడు.

మనకు వికారములు ఉంటాయి.

ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి.

వీటిని "షడ్వికారములు" అంటారు.

ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఈ ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదే ‘శివ’.

ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?


🌹అమరకోశంలో అమరసింహుడు ఆయనను "పరమానంద రూపత్వ" అంటాడు.

ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు.


మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు.

ఈ పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది.


ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుండి తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. 


అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'

ఆనంద ఘనమే పరమాత్మ.

కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు.


🌹అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - "చేతే సజ్జన మనాంసి ఇతివా"

- సాధువుల మనస్సునందు తానుండు వాడు. 


ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు.

లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి.


ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు.

అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.


🌹అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకు "సజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడు" అని అర్థము ఇచ్చారు.


అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి ఈ కారణము, ఆ కారణము అని చెప్పడం కుదరదు. 


మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు.

కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.


💥మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి.


ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వారెవరో అతడే పరమాత్మ... శంకరుడు. ఆయనే శివుడు.


ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు.

అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు.

అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము.

దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్ష స్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యదైవము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు