💥జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి... సుబ్రహ్మణ్యుడు.

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


కుమారేశసూనో! గుహ! స్కన్ద! సేనా – పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ |

పులిన్దాత్మజా కాన్త! భక్తార్తిహారిన్! – ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్


💥భావం:

కుమారస్వామీ! ఈశ్వరపుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! శక్తి యను ఆయుధము హస్తమునందు గలవాడా! నెమలినెక్కినవాడా! వల్లీ నాథా! భక్తుల బాధలను తీర్చునట్టి ప్రభూ ! తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్యా ! నీవు నన్నెప్పుడూ రక్షించుము.

🍁🍁🍁🍁🍁


💥జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి... సుబ్రహ్మణ్యుడు.


స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. 

ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేధకు ప్రతీక.


ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడుశక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన.


గొప్పజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీక.

రాక్షససంహార విషయంలో దేవతలకే సేనానాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యుడు.


స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు.

శివుని ఆత్మజ్యోతినుండి ఆవిర్భవించిన ఆరు జ్యోతులస్వరూపమే సుబ్రహ్మణ్యుడు.


ఆయనే శరవణభవుడు, కార్తికేయుడు.  కుమారస్వామి.... ఇలా సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి.


🌹సుబ్రహ్మణ్య వైభవం:


బాలసుబ్రహ్మణ్యుడు రూపంలో అందగాడు.

శౌర్యంలో సాటి లేనివాడు.

అందుకే దేవసేనాధిపతి అయ్యాడు.


ఈయన వాహనం నెమలి. ఆయుధం శూలం.

దీనిని "విజయశూలం" అని, జ్ఞానశూలమనీ అంటారు. 


సుబ్రహ్మణ్యుడికి షణ్ముఖుడు అన్న పేరుంది. అంటే ఆరుముఖాలు కలవాడని అర్థం.

ఈ ఆరుముఖాలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వానికి ప్రతిరూపాలు.


💥కార్తికేయుడు మేధామూర్తి.

వేదాలు ఇతణ్ణి యజ్ఞాగ్నిగా అభివర్ణించాయి. 


ఉపనిషత్తులు సనత్కు మారుడిగా కీర్తించాయి. 


శివుడి ప్రణవనాదమైన 'ఓం'కార అర్థాన్ని వివరించి చెప్పిన ఘనత కూడా సుబ్రహ్మణ్యుడికే దక్కుతుంది. ఈ విధంగా ఆదిదేవుడికే గురుదేవుడు అయ్యాడు కుమారస్వామి.


శ్రీకృష్ణుడు భగవద్గీతలో "సేనాధి పతులలో స్కందుడిని నేను" అని ప్రకటించటం స్కందుడి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది.


💥వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్నిస్వరూపమే ఇది.

కాలాగ్ని రుద్రుడైన శివునితేజమే ఈ సంవత్సరాగ్ని 


ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.

ఇదీ సంవత్సరాగ్ని రూపం. ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీన మయ్యింది.

వివిధ వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే ఈ నెమలి. ఈ విధంగా అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తులకు సుబ్రహ్మణ్య ఉపాస కేంద్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఉపాసన ద్వారా మోక్షాన్ని అందుకున్న మహనీయులు ఎందరో ఉన్నారు.


🌹యోగస్వరూపుడు:


మానవ దేహంలో మూలాధార స్థానంలో కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న పాములా ఉంటుంది.

సాధకుడిలో ఆశక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది.


సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆరు స్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో ఆ పరమచైతన్యం అనుభవానికి వస్తుంది. 


💥పరమాత్మ సుబ్రహ్మణ్య రూపంలో అవతరించే క్రమంలో ఆరుముఖాలతో దర్శనమిస్తాడు.

ఇవి ఆరు చక్రాలకు సంకేతం.


కుండలినీ శక్తి సర్పా కారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది.

ఈ యోగానికి అధిపతి కుమారస్వామి.

ఈ విషయాన్ని సంకేత రూపంలో చెప్పటమే సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో ఉంటాడని వర్ణించటానికి కారణం.


💥షణ్ముఖుడు జ్యేషా నక్షత్రంలో జన్మించాడు.

ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానమిచ్చేవాడు.

జ్ఞానాన్ని సంస్కృతంలో సుబ్రహ్మ అంటారు. అందువల్ల ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడని ప్రసిద్ధి చెందాడు. 


ఈయన జన్మరాశి వృశ్చికం నుండి జన్మ లగ్నమైన మేషం వరకు ఆరు రాశులు ఉన్నాయి. 

ఈ ఆరురాశులు మనశరీరంలోని షట్ చక్రాలు. 


వృశ్చిక రాశిని తోకగా పరిగణిస్తే మేషరాశి పాము శిరస్సు అవుతుంది.

ఈ పద్ధతిలో స్వామి కుండలినీ ప్రభువు అయ్యాడు. ఇవన్నీ జ్ఞానవైరాగ్యాలకు సంబంధించిన విషయాలు. సర్పం వీటికి సంబంధించింది.


అందువల్లనే సర్పాలను సదాశివుడు ధరించి పన్నగభూషణుడని ప్రసిద్ధి చెందాడు.

ఈ పన్నగాలు సుషుమ్నా నాడీ రూపంలో ఉన్న షణ్ముఖుని విభూతిరూపాలు.

ఆ కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సర్పరూపంలో పూజిస్తారు.

సేకరణ...💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం