💥మహాలక్ష్మిదేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి
⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
🌷ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః🌷
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
💥తాత్పర్యం:
లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురువై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు.
🍁🍁🍁🍁🍁
💥మహాలక్ష్మిదేవి హిరణ్యవర్ణంలో భాసించే
మధుర మోహనమూర్తి.
ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది.
ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది.
పద్మం బురద నుంచి పుడుతుంది.
మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే
అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం.
మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది.
ఈ నీరు జీవానికి సంకేతం.
ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది.
అలా ప్రవహించక పోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది.
ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి.
ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు.
జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును,
సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది.
ఆమె చతుర్భుజాలు "చతుర్విధ పురుషార్థాల"కు సంకేతాలు.
అవి ధర్మార్థకామమోక్షాలు.
జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తం చేసి ఆమె మహా సత్యం వైపు నడుపుతుంది.
ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు.
మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది.
అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం.
అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు - కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక.
లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేత గజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి.
తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం
నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం.
మహాలక్ష్మి చెంతనే ఒక తెల్ల గుడ్లగూబ కనిపిస్తుంది.
దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి.
ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం.
మరొక సంకేతార్థం తెలివిహీనత.
సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా
మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని "చంచల" అన్నారు.
లక్ష్మి అనే పదం సంస్కృత పదం "లక్ష్యం" నుంచి
వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది.
లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం.
మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్నచోట, ఆలోచనలు, సంవేదనలు,
సామరస్య సౌందర్య మాధుర్యాలతో విలసిల్లేచోట- జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రమణీయకతతో శోభిల్లినప్పడు శ్రీమహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు.
ఆమె అడుగు పెట్టినచోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగిప్రవహిస్తాయి.
శ్రీమహాలక్ష్మి సిరి సంపదలతో పాటు జీవితాన్ని
భగవదానంద ప్రదీప్తం చేస్తుంది.
సంతోషంలేని సంపదలు దేనికి?
ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయ మంత్ర గీతమై రవళిస్తుంది.
మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతరిక్షిప్త రహస్యాలు ఆమె మనకు
సమావిష్కరిస్తుంది.
అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృష్టిలో
శ్రీమహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించడమే కాదు... వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని "అమృతరసప్లావితం" చేసే దేవత!
💥లక్ష్మి రూప చిత్రణ
అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది.
లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది.
ఆమె బంగారు మేని కాంతి కలది (హిరణ్యవర్ణాం),
బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం),
వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం),
గజరాజుల ఘీంకారములతో సంబోధింప బడుచున్నది (హస్తినాద ప్రబోధినీం),
చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం),
కీర్తిచే శోభిల్లునది (యశసాజ్వలన్తీం),
సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే
నశ్యతాం),
పద్మ మాలను ధరించినది (పద్మమాలినీం),
పద్మము నుండి జనించినది (పద్మోద్భవాం),
అందరికి ప్రీతి పూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా)
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment