💥మాఘ శుద్ధ పంచమి... శ్రీపంచమి

 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏


మాఘశ్య శుక్ల పంచమ్యాం

మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః

వసవో యోగినస్సిద్ధ నాగా గంధర్వ రాక్షసాః

మధ్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి

భక్తియుక్తశ్చ దత్త్వా చోపచారాణి షోడశ


💥మాఘ శుద్ధ పంచమి నాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారని దేవీ భాగవతం వల్ల తెలుస్తుంది.

🍁🍁🍁🍁🍁


💥మాఘ శుద్ధ పంచమి... శ్రీపంచమి, మదన పంచమి, #వసంతపంచమి, సరస్వతీ జయంతి.


చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం.. మాఘ మాసం శుక్ల పంచమి.


శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ దేవేరి. 


సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌ |

వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌ ||


తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దాని పైన అడ్డంగా ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది.


💥సత్వ రజ స్తమో గుణాలను బట్టి "అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ" అయిన జగన్మాతను.. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా కీర్తిస్తారు.


ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు.


💥జ్ఞానశక్తికి అధిష్ఠాన దేవత - సరస్వతీమాత.

జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు.


వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ ఆధిదేవత సరస్వతీదేవి.


సరస్వతీదేవి హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలాధారిణిగా పూజింపబడుతుంది.


ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది.


క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత

శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికి దోయజూతభావచిత్త వశీకరణైక వాణికిన్

వణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్


💥భావం:

నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి భక్తితో నమస్కరిస్తాను.


ఈ రోజు ఉదయాన్నే లేచి, స్నానాధికాలు పూర్తి చేసుకుని అమ్మవారినీ  తెల్లని వస్త్రాలు, పువ్వులు, పూసలతో అలంకరించాలి.


శ్రీ సరస్వతీదేవి ప్రతిమ కానీ, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజా పీఠంపై పెట్టుకుని పూజ చేయాలి. 


శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని నివేదించాలి.


శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే సరస్వతీదేవి కరుణా కటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి ప్రగాఢ విశ్వాసం.


సరస్వతీదేవికి ప్రీతికరమైన తెల్లని నైవేద్యాలు అంటే పెరుగు, వెన్న, వరిపేలాలు తెల్లనువ్వుల ఉండలు, పాలకోవా, చెక్కెర, చెరుకురసం, బెల్లం, తేనె, కొబ్బరికాయ వంటివి నివేదించాలి.


మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ !

పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః !!


- మాఘ శుద్ధ పంచమి నాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి వివ్యారంభం చేయాలని శాస్త్ర వచనం. 


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||


💥వసంత రుతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.


"వసంతుడు" సస్యదేవత, "కాముడు" ప్రేమదేవత, "రతీదేవి" అనురాగ దేవత.

ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వలన మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని పురాణ వచనం. 


రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని "వసంతోత్సవము" అని కూడా అంటారు.


💥ఈ రోజునే క్షీరసాగర మథనంలో నుండి మహాలక్ష్మీ ఆవిర్భవించిన కారణంగా "శ్రీపంచమి" అని పిలుస్తారు.


💥సరస్వతి శబ్దానికి "ప్రవాహం" అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక.


"జలం" జీవశక్తికి సంకేతం.

నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత రుతువు నుంచి ఆరంభమవుతుంది.


ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదే శక్తిదాయిని. 

సేకరణ...💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం