నివాస వృక్షం సకల ప్రాణులకూ ఆధారమైనట్లు, సర్వ లోక వాసులను ఆధారమైన శ్రీరాముడు అనే కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాం.

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏


🍁॥ ధ్యానమ్ ॥🍁


ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్ 

పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ ।

వామాఙ్కారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్ 

నానాలఙ్కారదీప్తం దధతమురుజటామణ్డనం రామచన్ద్రమ్ ॥


🍁ఆజానుబాహుడూ,

ధనుర్బాణాలు ధరించి పద్మాసనంలో కూర్చుని ఉన్నవాడూ,

పీతాంబరము ధరించినవాడూ,

తాజా కమల పత్రమును పోలు నేత్రము(లు) కలవాడూ,

ప్రసన్నుడూ, ఎడమతొడపై కూర్చున్న సీతాదేవి ముఖ కమలమును వీక్షించుచున్నవాడూ,

నల్ల మబ్బు వంటి మేని ఛాయ కలవాడూ,

అనేక అలంకారములతో మెరయుచున్నవాడూ,

ఊరువులవరకూ ఉన్న అల్లబడిన జట కలవాడూ అయిన రామచంద్రుని ధ్యానించుచున్నాను.

🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸


నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః

ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్‌..


🍁సాధు సత్పురుషులకు నివాస యోగ్యమైన వృక్షం శ్రీరాముడు. ఆపన్నులకు ఆయనే పరమగతి.

ఆర్తులకు ఆశ్రయం. యశస్సుకు ఏకైక స్థానం అని దీని అర్థం.

(రాముడి గురించి వాలికి తార చెప్పే సందర్భంలోనిదీ శ్లోకం)


పరమాత్ముని సృష్టిలో.. ఎందరెందరికో ఆశ్రయమిస్తూ అమితాదరాన్ని పొందే అచరప్రాణి #వృక్షం.

పక్షులు, వానరాలు, క్రిమికీటకాలు, జంతువులు, పశువులు, మానవులకు ఆశ్రయాన్ని, నీడను, ప్రాణవాయువును ఇచ్చే వృక్షాలు.. ఆకులు, పూలు, కాయలు, ఫలాలు, చెక్కలు, కట్టెలను కూడా అందిస్తాయి.

వర్షాలు పడడానికి ఉపకరించి.. పరోక్షంగా పంటలు పండడానికి సహకరించి మన ఆకలి తీరుస్తాయి.

వృక్షం ఏ విధంగా ఇలా అందరికీ అన్ని రకాలుగా ఉపకరిస్తూ నివాస స్థానంగా ఉంటుందో..


సాక్షాత్తూ పరమాత్మ అవతారమైన ఆ #శ్రీరామచంద్రుడు కూడా తనను ఆశ్రయించే వారందరికీ కొండంత అండగా నిలుస్తాడు.

ఆపదల నుండి గట్టెక్కిస్తాడు.

అభయమిచ్చి ఆదుకుంటాడు.

అరణ్యంలో తనను ఆశ్రయించిన మహర్షులకు అభయమిచ్చి రాక్షస బాధను తొలగించి, ఆశ్రమవాసుల యజ్ఞయాగాదులు సక్రమంగా కొనసాగేటట్లు చేశాడు.

స్నేహితుడైన సుగ్రీవుణ్ని వానర రాజ్యాధిపతిగా చేశాడు.

తన వద్దకు వచ్చిన విభీషణునికి అభయమిచ్చి అతణ్ని లంకాధిపతిగా చేశాడు.

వనవాసానంతరం అయోధ్యకు తిరిగివచ్చి జనరంజకంగా పాలించాడు.

అందుకే నాటి నుండి నేటి వరకు రామరాజ్యం అనే ప్రసిద్ధి సుస్థిరంగా, జనుల నాలుకపై, మనస్సులలో ప్రతిష్ఠితమైంది.


"గ్రీష్మ తాపాన్ని తొలగించి చల్లటి నీడను ఇచ్చే చెట్టువంటి శ్రీరాముడు సుగ్రీవునికి తోడుగా నిలిచాడు, మరి నన్ను ఎందుకు రక్షించకుండా శిక్షిస్తాడు" అనే సందేహం వాలికి కలగకుండా తార ఇలా పలికింది..


"చెట్టు తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే నీడనిస్తుంది.

ఎండ బాధ తొలగాలని, చల్లదనం కావాలని మనసులో ఉన్నా చెట్టు కిందకు వెళ్లనివారికి ఎలా చల్లటి నీడను అందించదో.. శ్రీరాముడు కూడా అంతే.

ఆపదలను పోగొట్టి, ఎవరినైనా రక్షించగల సమర్థుడే అయినా.."ఓ శ్రీరామా నీవే శరణం" అని ఆశ్రయిస్తే రక్షిస్తాడు.

సుగ్రీవుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించాడు.

నీవు ఆ పని చేయలేదు కావున నీకు ప్రమాదం పొంచి ఉన్నద’"ని గుర్తించు అని హితోపదేశం చేసింది.


♦️వాసుదేవ తరుచ్ఛాయా నాతి శీతా న ఘర్మదా♦️


- అంటే చెట్టు నీడ మరీ చల్లగానూ, మరీ వేడిగానూ ఉండదు.

ఎంత ఉంటే మనకు ఉపశమనంగా ఉంటుందో అలాగే ఉంటుంది.

రాముడు కూడా అంతే.

ఆ దశరథ నందనుడు.. కౌసల్యా సుతుడు.. భక్తుల పాలిటి కల్పవృక్షం.

సంసార తాపాన్ని, నరక బాధను తొలగిస్తూ సర్వ జనులకు సకల శుభాలను, సర్వ శ్రేయస్సులను అనుగ్రహిస్తాడు.

నివాస వృక్షం సకల ప్రాణులకూ ఆధారమైనట్లు,

సర్వ లోక వాసులను ఆధారమైన శ్రీరాముడు అనే కల్పవృక్షాన్ని ఆశ్రయిద్దాం.

ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందాం.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు