ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏 ఐశ్వర్యాభివృద్ధికి శ్రీమహాలక్ష్మి అష్టకం🙏

 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🙏


🌹దేవేంద్రుడు ఒకసారి లక్ష్మీదేవి తో "తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా 

నీ బిడ్డలు నీ కరుణ పొందే మార్గం లేదా" అని అడుగుతాడు.


🌹అప్పుడు ఆ తల్లి "లక్ష్మీదేవి" తనను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా...

మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా...

విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా...

విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా...

ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా...

వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా...

ప్రసన్నురాలనవుతానని దేవేంద్రునికి సమాధానం ఇస్తుంది.


🌹ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నెరవేర్చుతుంది.


🌹గురుభక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు... 

సత్యం పలికే వారు... దాన ధర్మాలు చేసేవారు...

భార్యను గౌరవించేవారు... బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు... పగటిపూట నిద్రపోని వారు... 

వృద్ధులను దయతో చూసేవారు... పేదవారి పట్ల కరుణ గలవారు... పారిశుద్ధ్యాన్ని పాటించేవారు...

అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు 

శ్రీమహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు.

వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది.


🌹అయితే అసత్యాలు పలికే వారి వద్ద, 

ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. 


🌹ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరుగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు.

బయటికి వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంటికి

వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు.

తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికే వారింట శ్రీదేవి ఉండదని శాస్త్ర వచనం.


⚜️🚩ఐశ్వర్యాభివృద్ధికి శ్రీమహాలక్ష్మి అష్టకం🙏


నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే || (1)


🌹దేవతలచేత పూజింపబడే లక్ష్మీ, తన హస్తమందే శంఖ చక్రమును, గదను ధరించి శ్రీపీఠంపై ఆశీనయైన ఆ మహాలక్ష్మీకి నా నమస్కారాలు.


నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |

సర్వ పాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || (2)


🌹గరుడుని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించే సర్వపాపాల్ని పోగొట్టుదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు.


సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ |

సర్వదు:ఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || (3)


🌹సర్వజ్ఞురాలవు, అడిగిన వరాలను ఇచ్చేదానవు, దుష్టులకు భయంగొలిపే దానవు, అందరి దుఃఖాన్ని ప్రారద్రోలేదానవు అయిన మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు.


సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే || (4)


🌹సిద్ధిని, బుద్ధిని, భుక్తిని, ముక్తిని ప్రసాదించే దానవు, ఎల్లప్పుడూ మంత్రమూర్తివి అయిన మహాలక్ష్మీదేవి నీకు నా నమస్కారాలు.


ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |

యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే || (5)


🌹ఆది అంతాలు లేనిదానవు, అదిశక్తివి మహేశ్వరివి యోగభాగం నుంచి జన్మించిన యోగ సంభూతురాలవు అయిన మహాలక్ష్మీ నీకు నా నమస్కారాలు.


స్థూల సూక్ష్మ మహా రౌద్రే మహాశక్తి మహోదరే |

మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ||(6)


🌹సర్వ సామాన్య చర్మచక్షువులకు కనిపించనిదానివి. 

మహారౌద్ర, మహాశక్తి రూపిణివి, శరణాగత భక్తుల మహాపాపాలను నాశనంచేసి ఆధ్యాత్మిక సిరిని (ధనాన్ని) ఇచ్చే మహాలక్ష్మివి నీకు నా నమస్కారాలు.


పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే || (7)


🌹పద్మాసనంలో కూర్చున పరబ్రహ్మ స్వరూపిణివి పరమేశ్వరి, జగన్మాత అయిన మహాలక్ష్మివి, నీకు నా నమస్కారాలు.


శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే || (8)


🌹తెల్లని వస్త్రాలు ధరించి, సర్వాలంకార భూషణాలను కలిగినదానవు, జగత్తును పాలించే జగన్మాతవు అయిన మహాలక్ష్మీవి, నీకు నా నమస్కారాలు.


మహాలక్ష్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |

సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||


🌹ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని భక్తితో ఏ నరుడు పఠిస్తాడో, అతనికి ఎల్లప్పుడు సర్వ సిద్ధులు, రాజ్యం కలుగుతాయి.


ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం |

ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ||


🌹ఎవరయితే ఒకసారి ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని పఠిస్తారో వారి మహాపాపాలు నాశనం అవుతాయి.

రెండుసార్లు పఠిస్తే వారు ధనధాన్య సమృద్ధి పొందుతారన్నది స్పష్టం.


త్రికాల యః పఠేనిత్యం మహాశత్రువినాశనమ్ |

మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ||


🌹ఎవరైతే మూడు కాలాలు పఠిస్తారో వారికి మహాశత్రు వినాశనం అవుతుంది.

శ్రీమహాలక్ష్మీ ఎప్పుడూ వారికి ప్రసన్నురాలై

శుభకరమైన వరాల్నీ, సర్వాన్నీ అనుగ్రహిస్తుంది.


🌹ఈ అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించే భక్తుల ఇళ్ళల్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

                       🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు