ఓం నమః శివాయ ఋణానుబంధం
ఓం నమః శివాయ 🙏
ఋణానుబంధం
🌹అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.
🌹ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు – అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు.
🌹జాతకం చూపిస్తే, పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు.
ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.
"వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.
అతడికి మీరే అన్నీ ఇస్తూండండి" అని చెప్తారు.
🌹నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.
పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణం తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
🌹ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు.
🌹రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.
మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.
🌹పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.
అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో, నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.
🌹వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే... రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు👇 వినిపించి ఓదారుస్తాడు.
⚜️♦️⚜️♦️⚜️
మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే.
ఇవి ఏవియు నిజముగా లేవు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు.
తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు
గడుపుతుంటారు.
ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.
యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు.
ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
🌹తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు.
మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||
🌹తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి.
ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము.
దానికి బాధపడటం ఎందుకు.
ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||
🌹తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి.
ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.
పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
🌹తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు.
దానికై దుఃఖించుట ఎందులకు?
ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||
🌹తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి.
తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి.
అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు.
అందుకు బాధపడనవసరములేదు.
ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన||
🌹తా:- ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి.
కొంతదూరం కలిసి పయనిస్తాయి.
తరువాత విడిపోతాయి.
అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు.
దానికి పరివేదన చెందనవసరములేదు.
(ఈ పోస్ట్ సేకరించబడినది)
Comments
Post a Comment