ఓం నమః శివాయ (వేదసార శివస్తోత్రం)
ఓం నమః శివాయ 🙏
వేదసార శివస్తోత్రం
పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేన్ద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ ।
జటాజూటమధ్యే స్ఫురద్గాఙ్గవారిం
మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ (1)
సమస్త ప్రాణులకూ ప్రభువు, పాపనాశకుడు, పరమేశ్వరుడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, ప్రార్ధించదగినవాడు, జటాజూటమునందు గంగను మోయుచున్నవాడు, మన్మథుని సంహరించిన వాడు అగు మహాదేవుని ఒక్కనినే స్మరించుచున్నాను.
మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఙ్గభూషమ్ ।
విరూపాక్షమిన్ద్వర్కవహ్నిత్రినేత్రం
సదానన్దమీడే ప్రభుం పఞ్చవక్త్రమ్ (2)
మహేశ్వరుడు, దేవతలను కూడా శాసించువాడు, రాక్షసులను సంహరించువాడు, అంతటా వ్యాపించినవాడు, ప్రపంచమును పాలించువాడు, విభూతితో దేహమునలంకరించుకున్నవాడు, ఎగుడు దిగుడు కన్నులవాడు, చంద్రుడు – సూర్యుడు – అగ్ని అను మూడు నేత్రములు కలవాడు, సదానందరూపుడు, పంచముఖములున్నవాడు అగు పరమశివుని స్తుతించుచున్నాను.
గిరీశం గణేశం గలే నీలవర్ణం
గవేన్ద్రాధిరూఢం గుణాతీతరూపమ్ ।
భవం భాస్వరం భస్మనా భూషితాఙ్గం
భవానీకళత్రం భజే పఞ్చవక్త్రమ్ (3)
కైలాసము పైన ఉన్నవాడు, ప్రమథ గణములకు అధిపతి, కంఠము నందు నీలవర్ణం ఉన్నవాడు, నందివాహనుడు, సత్వ రజ స్తమోగుణములకు అతీతుడు, ప్రకాశించువాడు, భస్మముచే అలంకరించబడిన శరీరము కలవాడు, భవానీపతి, పంచముఖుడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
శివాకాన్త శమ్భో శశాఙ్కార్ధమౌలే
మహేశాన శూలిఞ్జటాజూటధారిన్ ।
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప (4)
ఓ పార్వతీపతీ శంభో చంద్రమౌళీ మహేశ్వరా శూలమును ధరించినవాడా జటాజూటము ఉన్నవాడా నీవొక్కడివే ప్రపంచమంతా వ్యాపించిన విశ్వరూపుడవు. ఓ ప్రభూ పరిపూర్ణరూపుడా ప్రసన్నుడవగుము.
పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోఙ్కారవేద్యమ్ ।
యతో జాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్(5)
పరమాత్మ, ఒక్కడు, ప్రపంచము ఏర్పడుటకు మూలకారణుడు, కోరికలు లేనివాడు, ఆకారము లేనివాడు, ఓంకారముచే తెలియబడువాడు, ప్రపంచము యొక్క సృష్టి, స్థితి, లయలకు ఆధారమైనవాడు అగు పరమేశ్వరుని సేవించుచున్నాను.
న భూమిర్నం చాపో న వహ్నిర్న వాయు
ర్న చాకాశమాస్తే న తన్ద్రా న నిద్రా ।
న చోష్ణం న శీతం న దేశో న వేషో
న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే (6)
భూమి – నీరు – నిప్పు – గాలి – ఆకాశము కానివాడు, ఆలస్యము – నిద్ర – వేడి – చలి -దేశము – వేషము లేనివాడు, ఆకారము లేనివాడైనా త్రిమూర్తి స్వరూపుడు అగు పరమేశ్వరుని స్తుతించుచున్నాను.
అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానామ్ ।
తురీయం తమఃపారమాద్యన్తహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ (7)
పుట్టుకలేనివాడు, శాశ్వతుడు, కారణములకే కారణమైనవాడు, శుభకరుడు, కైవల్యస్వరూపుడు, ప్రకాశించు సూర్యుడు, చంద్రుడు మొదలగు వారిని కూడా ప్రకాశింప చేయువాడు, సత్త్వరజస్తమో గుణములకు అతీతుడుగా నాలుగవ స్వరూపుడు, అజ్ఞానాంధకారమునకు అవతలనున్నవాడు, ఆది అంతము లేనివాడు, పరమపవిత్రుడు, భేదము లేని వాడు అగు పరమేశ్వరుని శరణు పొందుచుచున్నాను.
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానన్దమూర్తే ।
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య (8)
అంతటా వ్యాపించి ఉన్నవాడా విశ్వస్వరూపుడా చిదానందాకారుడా తపస్సు యోగములద్వారా పొందదగినవాడా వేదవిజ్ఞానముచే తెలుసుకొనదగినవాడా నీకు నమస్కారము🙏
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవ శమ్భో మహేశ త్రినేత్ర ।
శివాకాన్త శాన్త స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః (9)
ప్రభూ శూలపాణీ అంతటా వ్యాపించిన వాడా విశ్వనాథా మహాదేవా శంభో మహేశా ముక్కంటీ పార్వతీవల్లభా శాంతస్వరూపుడా మన్మథుని జయించినవాడా త్రిపురాసురుని సంహరించినవాడా నీకంటే వేరొకడు ప్రార్ధించదగినవాడు, లెక్కించదగినవాడు లేడు.
శమ్భో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ ।
కాశీపతే కరుణయా జగదేతదేక
స్త్వంహంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి (10)
శంభో మహేశా కరుణామయుడా శూలపాణీ గౌరీపతీ పశుపతీ ప్రాణుల బంధములను పోగొట్టువాడా... కాశీపతీ నీవొక్కడివే కరుణతో ఈ ప్రపంచమును నాశనము చేయుచున్నావు, పాలించుచున్నావు, సృష్టించుచున్నావు, నీవు మహేశ్వరుడవు.
త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే
త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ ।
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ
లిఙ్గాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ (11)
ఓ దేవా శంకరా మన్మథుని జయించినవాడా
నీ నుండే ప్రపంచము పుట్టుచున్నది. ఓ సుఖదాతా విశ్వనాథా నీ యందే ప్రపంచము నిలుచుచున్నది.
ఓ ఈశ్వరా హరా ప్రపంచ స్వరూపుడా లింగ రూపుడవైన నీయందే ఈ ప్రపంచము లీనమగుచున్నది.
ఇతి శ్రీ శంకరాచార్య కృతం "వేదసార శివస్తోత్రం" సంపూర్ణం.
Comments
Post a Comment