ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః 🌹🙏


ఓంకారమాద్యం ప్రవదంతి సంతోవాచః

శ్రుతీనామపి యం గృణంతి

గజాననం దేవగణానతాంఘ్రిం

భజే�హమర్ధేందు కృతావతంసం॥


'మహాత్ములు ఏ మూర్తిని ఆది నాదమైన ఓంకారంగా భావిస్తారో, వేద రుక్కులన్నీ ఏ దేవుడిని నుతిస్తాయో, దేవతలందరూ ఎవరి పాదాలకు తలలు వంచి నిత్యం నమస్కరిస్తారో అటువంటి గజాననుణ్ని, నెలవంకను తలదాల్చిన స్వామిని సేవిస్తున్నాను’ అని పై శ్లోకార్థం. 


గణపతి ప్రణవ స్వరూపుడు. ఆది పూజలు అందుకొనే తొలివేలుపు. వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులున్న వాడు అని అర్థం. ఏది ఆర్తితో కోరినా శ్రద్ధతో వింటాడు. లంబోదరుడు అంటే అందరినీ తన పొట్టలో పెట్టుకుని కాపాడుకునేవాడని భావం. ‘త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి’ అని గణపతిని పరబ్రహ్మ స్వరూపంగా అధర్వశీర్షం అభివర్ణిస్తున్నది. త్రిమూర్తులకు అతీతమైన తత్త్వం గణపతిది.


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోపశాంతయే॥


సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆయనే కాబట్టి, ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటారు. ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడైన వినాయకుడు, ప్రకృతి పురుషుల అభేదరూపానికి సంకేతం. అందుకే కంఠం నుంచి పాదాల వరకు జగం, కంఠం నుంచి శీర్షం వరకు గజం ఉంటాయి. గజం శివస్వరూపమైతే, జగం మాతృస్వరూపం. అమ్మ ఇచ్చిన రూపాన్ని, అయ్య కూర్చిన శిరోభాగాన్నీ కలిపిన గజస్వరూపంగా గణపతిని పూజించుకుంటాం.


వినాయకుడు వ్యవసాయానికి రక్షకుడు. ఆయన బాహ్యరూపంలో దీర్ఘమైన తొండం పంట పొలాల కాలువలకు నీళ్లు ఇచ్చే తూముకు, చిన్నకండ్లు సూక్ష్మమైన ఆలోచనకు, పెద్ద పొట్ట సకల సంపదలను దాచుకునే గాదెకు ప్రతీకలుగా పెద్దలు చెబుతారు. దంతం ఆత్మవిశ్వాసానికి సంకేతం.


ప్రకృతి సిద్ధమైన పూలు, పండ్లు అన్నీ గణపతికి ఇష్టమైనవే. గణపతి చేతిలోని పాశం కార్యసాధనకు గుర్తు. వినాయకుని వాహనం ఎలుక. దాని పేరు అనింద్యుడు. మరొక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయదారులకు, పంటలకు ఇబ్బంది కలిగించే ఎలుకలను ఆయన అదుపులో ఉంచుతాడని అంతరార్థం.


ప్రకృతి బాంధవుడైన గణపతిని పృథ్వీతత్త్వానికి ప్రతీకగా చెరువులోంచి, పుట్టలోంచి మట్టిని తీసుకొచ్చి వినాయక విగ్రహాన్ని తయారుచేస్తుంటారు. ప్రకృతి సంబంధంగా దొరికే లతలు, పత్రి, పుష్పాలతో, రకరకాల పండ్లతో పూజించి మృణ్మయ మూర్తిని తిరిగి చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రకృతి సమతుల్యతను, పర్యావరణాన్ని కాపాడటానికి పెద్దలు ఈ ఏర్పాట్లు చేశారు.


గణేశ అంటే సకలదేవతా గణాలకు అధిపతి అని అర్థం. మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, నాలుగు అంతఃకరణలు ఉంటాయి. ఈ పద్నాలుగింటిని చతుర్దశ మహాశక్తులు అంటారు. వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీగణేశుడు.


సిద్ధిని, బుద్ధిని కలిగించి, విఘ్నాలు వైదొలిగేలా చేయడం, మంగళప్రదంగా జయం కలిగించడం కూడా వినాయకుడి చలువే. తాత్త్విక దృష్టితో చూస్తే నిజానికి గణపతి నిరాకారుడు. ఆయనకు ఒక ఆకర్షణీయ స్వరూపాన్ని సమకూర్చి, నవరాత్రులు పూజించి, నిమజ్జనం నిర్వహించడం అంటే జీవాత్మను పరమాత్మలో విలీనం చేయడమే.


గణపతి ఆరాధన అంటే ప్రకృతి ఆరాధన. గరికను ప్రీతికరంగా స్వామి సేవకు వినియోగిస్తాం. స్వామి ఆరాధనలో ప్రత్యేకంగా 21 రకాల పత్రాలు, దూర్వాంకురాలు (గరిక) వినియోగిస్తుంటాం. 21 పూర్ణ సంఖ్య. యజ్ఞంలో కూడా 21 సమిధల్ని ఉపయోగిస్తారు. పూర్ణాత్వానికి గుర్తుగా 21 వస్తువులతో, నైవేద్యాలతో స్వామిని అర్చిస్తారు.


గణపతి ఆనందస్వరూపుడు. స్వామి ఆరాధనకు పరమావధి ఆనందమే. ఆయన విద్య, ఐశ్వర్య , జ్ఞాన ప్రదాత. ‘కలౌచండీ వినాయకః’ అన్నారు పెద్దలు! కలికాలంలో శీఘ్రంగా రక్షించే దేవతలలో ప్రధానుడు వినాయకుడే. అందుకనే భారతదేశంలోనే కాకుండా పలు దేశాల్లోనూ గణపతి ఆరాధన కనిపిస్తుంది. 


మాతాపితలను సేవించి వారి అనుగ్రహ ప్రభావంతో గణాధిపత్యాన్ని పొందిన వినాయకుడి వృత్తాంతం తల్లిదండ్రుల సేవను మించింది మరొకటి లేదని నిరూపిస్తుంది. ఏ పని అయినా ఆలోచించి, నిదానంగా చేసి సత్ఫలితాన్ని సాధించాలి అన్నది గణపతి తత్త్వంగా మనకు నిరూపితమవుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు