💥శ్రీ పంచాయుధ స్తోత్రం💥
⚜️🕉️🚩ఓం నమో నారాయణాయ 🌹🙏
"పంచాయుధ స్తోత్రం" శ్రీ మహావిష్ణువు యొక్క ఐదు దివ్యాయుధాలను (సుదర్శన చక్రం, పాంచజన్యం, కౌమోదకి, నందకం, శార్ఙ్గం) కీర్తించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం. ఇది భక్తులకు శత్రు భయం, భూత ప్రేత బాధలు, ఆరోగ్య సమస్యలు మరియు అపమృత్యువు నుండి సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. నిత్య పారాయణ వల్ల ఆత్మస్థైర్యం, ధైర్యం పెరిగి, విజయం సిద్ధిస్తుందని ప్రతీతి.
💥శ్రీ పంచాయుధ స్తోత్రం💥
స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం
సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ ।
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 1 ॥
తాత్పర్యము:
రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్ని శిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్త తలమునలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను.
విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య
యస్య ధ్వనిర్దానవదర్పహంతా ।
తం పాంచజన్యం శశికోటిశుభ్రం
శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 2 ॥
తాత్పర్యము:
శ్రీమహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువుతో నిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవి సోకినంతనే రాక్షస మూకలందరియొక్క గర్వములను అణగిపోవును. అట్టి భీకర ధ్వని నీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమనాటి చంద్రులకాంతి ఒక్కచోట చేరినదా యనునట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులు నీవి. శ్రీవిష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా! నిన్ను నేను ఎల్లప్పుడూ శరణు వేడుచున్నాను.
హిరణ్మయీం మేరుసమానసారాం
కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ ।
వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం
గదాం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 3 ॥
తాత్పర్యము:
బంగారము వలె స్పృహణీయమైన, మేరు పర్వతముతో సమానమైన బలము కల్గినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమునపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నలలో సంచరించు ”కౌమోదకీ” యను ఓ గదాయుధమా! నిన్ను నే సదా శరణు వేడుచున్నాను.
యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం
చేతాంసి నిర్ముక్తభయాని సద్యః ।
భవంతి దైత్యాశనిబాణవర్షైః
శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 4 ॥
తాత్పర్యము:
జన్మత: రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండి అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టినా విష్ణుద్వేషముతో బుద్ధిచెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ – భాగవత తిరస్కారములను చేయుచు అసురులుగ పిలువబడు వారి యొక్కయు, క్రూరమై మదమెక్కి బలసిన కంఠములను తెగ నరకుట నీ పని, తద్వారా నిరంతర ధారా ప్రవాహముగ కారుచున్న రక్తముతో మరింత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణుని దివ్య హస్తమందు ప్రకాశించు చున్నావు. ”నందక” మను ఓ ఖడ్గరాజమా! నిన్ను నే నెల్లప్పుడు శరణు వేడుచున్నాను.
రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ-
-చ్ఛేదక్షరత్‍క్షోణిత దిగ్ధసారమ్ ।
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 5 ॥
తాత్పర్యము:
దేవ దానవ భీకర సంగ్రామములలో నీ నారిని సారించుటచే బయల్వెడలిన ధ్వని(జ్యా ఘోషము) చెవి సోకినంతనే దేవతల మనస్సులలో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును. జయము కల్గును. రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు శార్ఞమనెడి ఓ ధనస్సా! నిన్ను నే నెల్లప్పుడూ శరణు వేడుచున్నాను.
ఇమం హరేః పంచమహాయుధానాం
స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే ।
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి ॥ 6 ॥
తాత్పర్యము:
శ్రీహరి ధరించు ఈ ఐదు దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినమూ అనుసంధించు వారియొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దు:ఖములు అట్టి వారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు ।
పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా
సుఖీభవేత్తత్కృత సర్వరక్షః ॥ 7 ॥
తాత్పర్యము:
అడవులలో దారితప్పి, జంతువుల బారిన పడి, యుద్ధములో చిక్కుకొని, నీటి ప్రమాదమేర్పడి, అగ్ని ప్రమాదమేర్పడిగాని భయగ్రస్తులయినా, లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ యితర ఉపద్రవమందైనా ఒక్కసారి ఈ అయిదు ఆయుధములను మనసారా స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖములను పొందించును.
యచ్చక్రశంఖం గదఖడ్గశారంగిణం
పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ ।
శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం
విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే ॥
తాత్పర్యము:
భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, శార్గఙములను పంచాయుధములను ధరించి, పీతాంబరముతో వెలుగొందుచు, కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమనెడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు, శ్రీదేవి సదా సన్నిధిచేరి యుండుటచే మెరుపు తీగచే చుట్టబడిన నీలిమబ్బువలె దేదీప్యమానమగు దివ్య సుందరి మంగళ విగ్రహ విశిష్ణుడును అగు శ్రీమహావిష్ణువును నేనెల్లప్పుడూ సేవించుచున్నాను.
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః ।
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ॥
తాత్పర్యము:
జలము నందెల్లపుడూ ఏ ఆపదలు దరి చేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక! భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామన మూర్తి మనలను బ్రోచుగాక! అడవులలో ఘోర ప్రమాదములలో చిక్కుకొనకుండ శ్రీ నరసింహస్వామి కాపాడుగాక! బ్రహ్మకు శివునికి తన దేహమందే స్థానము నిచ్చిన సర్వజగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక!
ఇతి పంచాయుధ స్తోత్రమ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment