ఓం నమో వేంకటేశాయ🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన అన్నమయ్య కీర్తనను గురించి తెలుసుకుందాం..
ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య
పల్లవి:
ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది
చరణములు:
ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది
యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది
ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది
యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది
ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది
💥కీర్తన భావ సౌరభం:
ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది!
ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట.
వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాదమైంది.
ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతలకు ఆ అడుగే ఇడుములు పోగొట్టగలది.
కరిరాజును బ్రోచిన పాదం, లోకాలకు మేలు చేసే పాదం ఆ హరిపాదమే! భక్తితో మొర పెడితే పరుగున వచ్చిన కథలెన్ని!!
ఈ పాదానికి మించిన అందం ఎక్కడుంది? ఈ పాదమే కదా రామావతారంలో అహల్యకు శాప విమోచనం కలిగించింది !
అంతటి మహిమ గలవి, అందమైనవీ, సుకుమారమైనవీ అయిన పాదాలు ఎందరి భక్తుల కోసం పరుగులు తీసి అలిసిపోయాయో అని లక్ష్మీ దేవి ప్రేమతో పాదాలొత్తుతుంది ! భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి అది తన భాగ్యమనుకుంటుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment