అమలక ఏకాదశి విశిష్టత

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥అమలక ఏకాదశి


ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని "అమలక ఏకాదశి" లేదా "అమలకి ఏకాదశి" అంటారు. ఈ రోజు ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు.


ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో "ఓం నమో నారాయణాయ" అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చెట్టునకు పసుపు, కుంకుమ, గంధం పూలతో అలంకరించి, దీపం, ధూపం, అరటి ఆకులో అరటిపండు నైవేద్యం పెట్టిన తర్వాత..


చెంబులో కొన్ని నీళ్ళను పోసుకుని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపునీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టునకు సవ్య దిశగా ప్రదక్షిణాలు చేస్తూ చుట్టునకు ఓ అకు వరస చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన ధారాన్ని నిష్కల్మషమైన మనస్సుతో ముడి వేయాలి.


ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో స్మరించ వలసిన మంత్రం :-


ధాత్రిదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి !

వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తధాకురు !!


భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామి వారు అత్యంతగా ఇష్టపడతాడు. ప్రతీ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శారీరక పుష్టి , శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.


ఉత్తరాదిన ఈ నాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయి. దీని వెనుక ఓ పురాణ గాథ కూడా ఉంది. ఆ గాథ గురించి తెలుసుకుందాం.


వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ట మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం.


చిత్రసేనుని కథ:


పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంత మంది రాక్షసులు చేతికి చిక్కుతాడు. ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు. చిత్రసేనుడికి ఏమి హాని జరగదు కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు.


ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్థానం అవుతుంది. చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తరువాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చి పడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడని పలుకుతుంది. ఈ సంఘటన తరువాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరు ఆచరించడం మొదలు పెడతారు.


చక్రవర్తిగా జన్మించిన వేటగాడు:


మరో కథనం ప్రకారం, వైదిస రాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకానొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువును, విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్తుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలిసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా, ఆ వేటగాడు తన మరణానంతరం వసురత రాజుగా పునర్జన్మ పొందాడు.


ఈ కథలోని నీతి ఏమిటంటే నిష్కామంతో, నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఏ భక్తి లేకున్నా, అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది.


జై శ్రీమన్నారాయణ!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏