💥మహా శివరాత్రి విశిష్టత💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥మహా శివరాత్రి విశిష్టత💥


‘‘నమశ్శమ్భవేచ మయోభవేచ

నమః శంకరాయచ మయస్కరాయచ

నమః శివాయచ శివతరాయచ’’

                          -శ్రీరుద్ర ప్రశ్న (నమకము)


"ఇహపరములు రెండింటిలోను సుఖశాంతులు ప్రసాదించు శివునికి నమస్కారం. ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ప్రసాదించే పరమేశ్వరునికి నమస్కారము. దివ్య మంగళ స్వరూపుడైన పరమాత్మకు వందనములు. శుభాలకు మించిన శుభమగు శాశ్వత స్థితిని ప్రసాదించు ఈశ్వరునికి ప్రణామములు. తనను పొందిన వారిని శివమయం చేసి శుభాలను కటాక్షించే శంకరునికి నమస్మృతులు. ఇటువంటి పరమశివునికి నమస్కారములు, పాదాభివందనములు’’ అని, శ్రీరుద్ర ప్రశ్న. అనగా రుద్ర సంహిత (రుద్ర నమకము) ప్రణమిల్లుతోంది.


మహాశివరాత్రి ఒక గొప్ప పర్వదినం. అజ్ఞానానికి చిహ్నమైనది రాత్రి.. చీకటి. మరి ఇది మంగళకరమైన రాత్రి ఎట్లా అయింది. శివ అనగా మంగళకరము. శుభప్రదము అని అర్థం. శివరాత్రి నాడు ఉపవాసము, జాగరణ, శివుని దర్శనమ్, బిల్వార్చన, అభిషేకము, నామ సంకీర్తన వలన అజ్ఞానం అనే చీకటి తొలగించబడుతుంది. అనగా జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. అందుకే ఇది శివరాత్రి.


‘శివ’ అంటే శుభప్రదమైనది, మంగళకరమైనది. రాత్రి అయినా నిద్రపోకుండా జాగరణ చేస్తాము. కాబట్టి ఇది ‘దినము’. దినమైనా రాత్రిలాగా ఉపవాసం చేస్తాము. కనుక రాత్రి, మిగతా పండుగలాగా విందు వినోదాలు ఈ పండుగకు ఉండవు. ఉపవాస దీక్షతో ఉండాలి. రాత్రంతా జాగారం చేయాలి. ‘ఉప’ అనగా సమీపము. వాసము అంటే ఉండటము. ఉపవాసమంటే, సమీపములో ఉండటము. ఎవరికి! పరమాత్ముడు అంటే ఆ రోజంతా దైవచింతనతో ఉండటం.


ప్రతి మాసంలోను శివరాత్రి వస్తుంది. దాన్ని మాసశివరాత్రి అంటారు. అమావాస్యకు ముందురోజైన చతుర్దశిని, మాస శివరాత్రి అని పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాసశివరాత్రిని మహాశివరాత్రి అంటారు.


మహాశివరాత్రి మాఘమాసంలోనే ఎందుకు చేయాలి? చతుర్దశి నాడే ఎందుకు చేయాలన్న సందేహం అందరిలో వస్తుంది. మఖా నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం గల మాసం, మాఘమాసం. మానవుని అఘములను అనగా పాపములను హరించే మాసం. త్రిముక్త్యాత్మకులైనడైన సూర్యభగవానుని జయంతి మాఘంలోనే వస్తుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. మాఘ శుద్ధ సప్తమి నాడు, సూర్యభగవానుడు మొదటిసారిగా భూమిపై తన కిరణములను ప్రసరింపజేశాడని పురాణములు చెపుతున్నాయి. అనగా సూర్యరథ చక్రము ఉత్తరదిశగా తిరిగి పయనిస్తాయి. మనం ఉత్తరులమవుతాము. చతుర్దశి, అమావాస్యలలో సూర్యుడు, చంద్రుడు కలిసి ఉంటారు. ‘‘చంద్రమా మనసోజాతః’’ చంద్రుడు మనస్సుకు కారకుడు, అధిదేవత. చంద్రకళలు కృష్ణపక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే మనసుకు చేరిన పదహారు మాలిన్యములలో (అష్టమదములు -8, అరిషడ్వర్గములు -6, మనసు -1) అహంకారం ఒక్కటి మిగిలి ఉంటుంది. ఆ మాలిన్యాన్ని దూరం చేసుకోవడానికి మాఘకృష్ణ చతుర్దశి శ్రేష్టమైన తిథి గాను, ఆ రాత్రి జ్ఞాన వెలుగునిచ్చే శివరాత్రి గాను, ఆ జ్ఞాన వెలుగు, మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ద్యోతకమవుతుంది.


ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక నమక, చమకములతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వివిధ రకములైన అభిషేక ద్రవ్యములతోనూ, పంచామృతములతోనూ ఆచరిస్తారు. ‘‘త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మపాప సంహారం ఏక బిల్వం శివార్పణం’’ అంటూ బిల్వార్చన చేస్తారు.


మానవులను ప్రభావితం చేసే సత్వరజో తమో గుణములకు, త్రికాలములకు త్రితాపములకు, త్రిదళములతో కూడిన బిల్వపత్రము బిల్వ దళము శ్రీ మహాలక్ష్మీ కటాక్షం. పుష్పించకుండా ఫలించే వృక్షం మారేడు వృక్షం. ఈ శరీరమే ‘బిల్వ దళము’. త్రిగుణముల ఏకత్వాన్ని సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఏకత్వాన్ని తెలియపరచేదే ఈ బిల్వదళం. మూడు దళములే కాక, ఐదు, ఏడు, తొమ్మిది, పన్నెండు దళములతో కూడిన మహాదళములు కూడా ఉన్నాయి. వాటితో చేసే అర్చన విశేష ఫలితాల్నిస్తుంది. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు వెరసి పదకొండు తత్వాలు, మానవుని విషయ వాసనల్లోకి దింపి, బంధములకు కారణభూతులౌతాయి. వాటిని మన ఆధీనంలో ఉంచుకోవటానికే ఏకాదశ రుద్రాభిషేకం.


జాగరణ:

అంటే నిద్రను జయించటం. ఏవిధంగా జయించాలి? నిరంతన భగవత చింతన, నామసంకీర్తనములతో రాత్రి అంతా సత్కాలక్షేపము, సద్గోష్ఠితో గడుపుటయే జాగరణ. 


శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగారమధనంలో కాలకూట విషం ఉద్భవించినపుడు దేవతలు, రాక్షసులు ఖంగారుపడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో  తెలియక దేవతలు, రాక్షసులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకొన్నారు. అంతట ఆ మహాశివుడు లోకశ్రేయోదాయకమై గరళాన్ని మింగి తన గొంతులో దాచుకొన్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తిమంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకొన్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రి గా జరుపుకొంటున్నారు.


శివరాత్రి మహాత్మ్యం:

మహా శివరాత్రి పర్వదినంలో, మృగములను వేటాడే నిమిత్తం ఒక వేటగాడు చెట్టుపైకెక్కాడు. చెట్టుకు సమీపంలో వలను వేసి పెట్టాడు. ఎంతరాత్రి అయినా ఒక్క మృగము కూడా ఆ దిక్కుకు రాలేదు. ఈ జాగరణలో చెట్టు ఆకులను త్రుంచి కింద వేయసాగాడు. అతను ఎక్కి కూర్చున్నది ఒక బిల్వ వృక్షము. అతనికి తెలియకుండానే శివరాత్రి రోజున శివలింగానికి బిల్వార్చన చేశాడు. తెల్లవారింది. ఇంటికి వెళ్లాడు. అతని భార్య కూడా భర్త రాక కోసం ఎదురుచూస్తూ జాగరణ చేసింది. ఉపవాసంతో. దీని ఫలితంగా భార్యాభర్తలిద్దరూ శివ సాన్నిథ్యాన్నందుకున్నారనే గాథ శివరాత్రి మహాత్మ్యానికి స్ఫూర్తినిస్తుంది.


కళ్యాణం:

శ్రీరాముడు జన్మించినరోజునే కళ్యాణం చేస్తాము. ఇది ఆగమ శాస్తర్రీత్యా జరుపుతారు. అలాగే లింగోద్భవ కాలంలోనే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అత్యంత శుభప్రదమైన శివపార్వతుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించిన వారికి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. లింగోద్భవ సమయంలో శివలింగానికి జరిగే అభిషేకాదులతో విశ్వశాంతి కలుగుతుంది.


ప్రవహించే నదిలో కానీ, సమీపంలో గల తటాకము లేదా చెరువులో కానీ, నూతి నీటితో కానీ శిరస్నానమాచరించాలి.

రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి. 

రోజంతా యోగదీక్షలో ఉంటూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం దీక్షను ఆచరించాలి:


⟾   శివ బీజాక్షరీ మంత్రం

        ఓం నమః శివాయ

⟾ మృత్యుంజయ మంత్రం :

      ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

      ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

⟾ రుద్రగాయత్రి:

      ఓం తత్పురుషాయ విద్మహే 

      మహా దేవాయ ధీమహి 

      తన్నో రుద్ర ప్రచోదయాత్ 


మహాశివరాత్రి సందేశం:

నాలుగు పురుషార్థాలలో, అర్థ కామాన్ని ధర్మంతో అనుభవించాలని, అపుడు మనిషి పశుత్వం నుంచి విముక్తుడై, పశుపతి తత్త్వాన్ని అందుకోగలడని, పాశుపతమైన ఈ దీక్ష ఉంటే, పశుపతి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని, సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని, అదే శివతత్త్వమని, మహాశివరాత్రి బోధిస్తోంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు