ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం!

షణ్ముఖనాథా! సుబ్రహ్మణ్యం !


సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు.


పూర్వం స్వాయంభువమనువునకు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావము నందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు చేయ పూనుకునెను.


ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా, ప్రియవ్రతుడు.. ”ఈ జీవితము అశాశ్వతము, భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము, జీవితము క్షణభంగురము, నేను రాజ్యము చేయకోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను” అని చెప్తాడు.


అప్పుడు బ్రహ్మగారు, “ఓ రాజా! నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు చేయుట వలన ఎట్టి లాభమూ లేదు. కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చేయుము” అని చెప్తారు.


బ్రహ్మౌపదేశము మీద, ప్రియవ్రతుడు తపస్సుని విరమించి, మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను. పుత్రసంతతి కోసం అతడు పుత్రకామేష్ఠి చేయగా పుత్రుడు కలిగెను.


కానీ ఆ పిల్లవాడు మరణించి ఉండెను. ప్రియవ్రతుడు ఆ శవమును భుజముపై వేసుకొని, శ్మశానమునకు వెళ్ళి ఖననం చేయ ప్రయత్నంలో ఉండగా, ప్రియవ్రతుడు, ఆయన వెంట వచ్చినవారు అందరూ ఎంతగానో దుఃఖించిరి.


ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశములో ఒక మెరుపు కనిపించెను. నిలకడగా చూస్తే అది మెరుపు కాదు, ప్రకాశించుచున్న దివ్యవిమానము. ఆ విమానము ప్రియవ్రతుని సమీపమునకు చేరెను.


ఆ విమానము నుండి ఒక తేజోమూర్తి యైన స్త్రీమూర్తి దర్శమిచ్చి ప్రియవ్రతునితో ”నేను ఆదిపరాశక్తి ఆరవ అంశతో అవతరించినదానను కావున నన్ను షష్ఠీ దేవి అని పిలుస్తారు. దేవసేన అని మరిఒక పేరు కూడా కలదు. నేను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ధర్మపత్నిని. నా దర్శనము వృధా కాదు. ఎవరికేమి కావలసినా ఈయగలను. నీ కుమారుడిని బ్రతికించెదనని”, ఆ ప్రియవ్రతుని కుమారునికి ప్రాణము పోసెను. అంతట ఆ పిల్లవాడికి సువ్రతుడు అని నామకరణం చేసెను. ప్రియవ్రతుడు ఎంతగానో సంతోషించెను.


ఇంకా దేవసేనా అమ్మవారు ప్రియవ్రతునితో ఇట్లు పలికెను..” ఓ ప్రియవ్రతా! మీరందరు షష్ఠి వ్రతము చేయుడు. మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు షష్ఠీ వ్రతమునారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగును” అని సకల జనులకు వరమునిచ్చి అమ్మవారు అంతర్ధానము అయ్యెను.


వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును. స్వామి అనుగ్రహం వల్ల, సమస్త శుభములు సర్వులకూ లభించును.


కొలిచిన వారికి కొంగుబంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షములు మనందరిమీదా వర్షించాలని, బయటా, మన లోపలా ఉన్న ఆసురీ ప్రవృత్తిని సంహరించి, మనల్ని ధర్మమార్గములో నడపాలనీ, మన సనాతన ధర్మమును పరిరక్షించాలనీ, గురుగుహా స్వరూపములో మన అజ్ఞానతిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు