భీష్మాష్టమి
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥భీష్మాష్టమి
రధ సప్తమి తరువాత వచ్చే రోజునే "భీష్మ అష్టమి" గా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు ఇదే కనుక, ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషి గా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణ గా విడువమని చెప్పింది శాస్త్రం. తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడువడమే కర్తవ్యమ్.
తర్పణ ఇచ్చేటప్పుడు ఇలా చదువుతూ ఇవ్వమని చెప్పింది శాస్త్రం..
భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితే౦ద్రియః!
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితా౦ క్రియామ్!!
వైయాఘ్ర పద గోత్రాయ సా౦కృత్య ప్రవరాయచ!
అపుత్రాయ దదామ్యేతత్ జలం భీష్మాయ వర్మణే!!
వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ!
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!!
అనేన భీశం అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!
💥శ్రీ కృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు. అందరూ మిమ్మల్నే తలచుకుంటున్నారు. మరి మీరు ఎవర్ని స్మరిస్తున్నారు నిరంతరం అని..
శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానం ”తను ఒక పెద్ద ఆయనను తల్చుకుంటున్నాను అని…..” ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు?
”నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడు నామాన్ని…..ఆ భక్తుడే భీష్మపితామహుడు” అని కృష్ణ పరమాత్మ అసలు విషయాన్ని చెప్పాడు.
అవును….భగవంతుడు భక్త పరాధీనుడు. భక్తుడెంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటాడో..అంత కంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీస్కుంటు ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు.
💥భీష్ముడి జన్మ రహస్యం:
శంతనమహారాజు చంద్ర వంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకనాడు శంతనమహారాజు గంగా నది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా?’అని అడిగాడు. అందుకా అమ్మాయి నవ్వుతూ ’నేనెవరో తెలుసా?’ అంది. “నువ్వెవరివైనా సరే, నన్ను వివాహమాడు. నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, సర్వస్వం నీ కిచ్చేస్తాను” అని మ్రతిమాలాడు.
అప్పుడు ఆ అమ్మాయి,”మహారాజా! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను.కాని కొన్ని షరతులు కోరుతాను. వాటికి మీరు ఒప్పుకోవాలి ” అంది.
ఆవేశంలో “అలాగే!” అని మాట యిచ్చాడు శంతనుడు.
వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు – గంగాదేవి.
పెళ్ళి జరిగాకా గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా, పనసపండ్లలా వున్నారు. అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ అమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు.
ఆవిడ పెట్టిన షరతుల్లో ” నువ్వెవరు? ఎక్కడనుండి వచ్చావు? ఇలా ఎందుకు చేస్తున్నావు? ” అని అడగడానికి వేల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు.
ఏడుగురు కొడుకులు పుట్టారు.ఏడుగురూ ఏటిపాలయ్యారు. చివరకు ఎనిమిదవ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేయ బోతుంటే శంతనుడు సహించలేక ” నువ్వు తల్లివి కావు… ఎందుకింత పాపం చేస్తున్నావు? ” అని అడిగాడు.
వెంటనే ఆమె “మహారాజా! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ వుండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనొవరో మీకు తెలీదు. మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను.
”పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి "నందిని" అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు.
అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త.
ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను ‘సరే’ అన్నాడు. ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు.
”వశిష్టుడికీ సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో, ’మీరంతా మానవులై పుట్టండి’ అని శపించాడు.
అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు.
కానీ వశిష్ట మహర్షి , ‘నా శాపానికి తిరుగులేదు పొండి!’ అన్నాడు. వసువులు ప్రాధేయ పడ్డారు.’ నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు!’ అని చెప్పాడు.
పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్ట వసువులు తిరిగి వెళ్ళిపోయారు.
”ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, ‘గంగాభవానీ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు, అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి, మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ!’ అని మొరపెట్టుకున్నారు.
అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకన్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను, అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.
ఆ పిల్లవాడే #దేవవ్రతుడు.
వశిష్ట మహాముని వద్ద వేద వేదంగాలు చదువుకున్నాడు.
శుక్రాచార్యుల వారి వద్ద శాస్రాలన్నీ నేర్చుకున్నాడు.
విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.
శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు.
అనంతరం పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువుల లోనూ, ధర్మ సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment