మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥మాఘ శుద్ధ పౌర్ణమి... మాఘ పౌర్ణమి లేదా మహామాఘి


హిందూ సాంప్రదాయంలో మాఘ పౌర్ణమి (మాఘ పూర్ణిమ) అత్యంత పవిత్రమైన రోజుగా గుర్తింపు పొందింది. దీనిని "మహామాఘి" అని కూడా పిలుస్తారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ఉండగా, నది లేదా సముద్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, విష్ణు–శివ అనుగ్రహంతో మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం మొత్తం పవిత్రమైనదే అయినా, పౌర్ణమి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని పండితుల అభిప్రాయం.


మాఘమాసంలో, ముఖ్యంగా పౌర్ణమి రోజున పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా నశిస్తాయని పద్మ పురాణం పేర్కొంటుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడు గంగానదిలో నివసిస్తాడని విశ్వాసం ఉంది. అలాగే దేవతలు భూమికి వచ్చి గంగానదిలో స్నానం చేస్తారని పురాణ గాథలు చెబుతాయి. అందుకే ఈ రోజున చేసే స్నానం, పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్మకం.


హిందూ ధర్మంలో “నదీనాం సాగరో గతి” అనే భావన ఉంది. అన్ని పవిత్ర నదులూ చివరకు సముద్రంలోనే కలుస్తాయి కాబట్టి, సముద్ర స్నానం చేయడం వల్ల సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. చలికాలం చివర్లో సముద్రపు నీటిలో ఉండే లవణాలు శరీరానికి, చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని శాస్త్రీయంగా కూడా చెబుతారు. ఆధ్యాత్మికంగా చూస్తే, మాఘమాసంలో చంద్రకిరణాలు సముద్రంపై ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఈ కాలంలో స్నానం ఆయుష్షును పెంచుతుందని విశ్వాసం.


"దుఃఖదారిద్యనాశాయ శ్రీవిష్ణోస్తోషణాయాచ

ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘేపాపవినాశనం

మకరస్దే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ

స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భావ''


--అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే "దుఃఖములు, దారిద్ర్యము నశించుటకు పాప క్షయమగుటకు శ్రీవిష్ణుప్రీతి పూర్వకముగ ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను. కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానమునకు యథోక్తఫలము అనుగ్రహించు'' అని అర్థం.


ఆ తరువాత...

"సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ   

త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''


-- అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందుబడి నశించుగాక'' అని అర్థం.


మాఘ పౌర్ణమి నాడు పవిత్ర స్నానం అనంతరం దానధర్మాలు చేయడం చాలా శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. వస్త్రాలు, నువ్వులు, గొడుగులు, అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యం లభిస్తుందని నమ్మకం. నది లేదా సముద్ర స్నానం చేయలేని వారు కనీసం తిలదానం చేయాలని సూచిస్తున్నారు. ఈ రోజున చేసిన దానం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం.


మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 5:53 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 2, సోమవారం తెల్లవారుజామున 3:39 గంటలకు ముగుస్తుంది. పండితుల సూచనల ప్రకారం, మాఘ పౌర్ణమి పండుగను ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజున జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అత్యంత శ్రేష్ఠంగా భావిస్తారు.


మాఘ పౌర్ణమి పార్వతీ దేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, ప్రతికూల ఆలోచనలు దూరమై జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. తమలపాకులో పసుపుతో గౌరమ్మను చేసి, గంధం–కుంకుమ పెట్టి, ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేయాలి. బెల్లం నైవేద్యంగా సమర్పించి, గోరింటాకు దానం చేస్తే దాంపత్య సమస్యలు తొలగి, పెళ్లికాని అమ్మాయిలకు శుభవివాహ యోగం కలుగుతుందని విశ్వాసం.


కార్తీకమాసం దీపారాధనకు ఎంత ముఖ్యమో, మాఘమాసం పవిత్ర స్నానాలకు అంతే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం, పూజ, దానం… ఇవన్నీ శరీర శుద్ధితో పాటు మనస్సుకు ప్రశాంతతను అందిస్తాయని హిందూ సంప్రదాయం విశ్వసిస్తుంది. ఈ పవిత్ర రోజును భక్తితో ఆచరించి, ఆధ్యాత్మిక శక్తిని అనుభవించాలని పండితులు సూచిస్తున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు