మాఘపురాణం - 13వ అధ్యాయం

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥మాఘపురాణం - 13వ అధ్యాయం


శివుడు పార్వతికి మాఘమాస మహాత్మ్యమును వివరించుట


వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలెనని కుతూహలముతో దిలీపుడు -

“మహామునీ! ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినాలి అన్న కోరిక కలుగుతున్నది. ఇంకా చెప్పవలసినద” ని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను.


పూర్వము పార్వతీదేవికి శివుడు, నారదునకు బ్రహ్మ, మాఘమాస మహాత్యము గురించి చెప్పి ఉన్నారు. శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు ప్రమథగణములు సేవిస్తు ఉండగా , నానారత్న విభూషితమైన కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని పార్వతీదేవి వచ్చి, భర్త పాదములకు నమస్కరించి “స్వామీ! మీవలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను. ప్రయాగ క్షేత్ర మహాత్యమును, మాఘమాస మహాత్యమును వినవలెనని కోరిక ఉన్నది. ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాన” ని వేడుకొనగా పార్వతీ పతియగు శంకరుడు మందహాసముతో -


దేవీ! నీ అభీష్టము తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము. సూర్యుడు మకరరాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే గాక జన్మాంతమందు మోక్షమును పొందును. మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగుతుంది. జీవనది ఉన్నా లేకున్నా పాదము మునుగునంత నీరు ఉన్నచోట గాని, తటాకమందు గాని, మాఘమాసంలో ప్రాతఃకాల స్నానము గొప్ప ఫలమును ఇచ్చుటయే గాక సమస్తపాపములు తీరి పోతాయి. రెండవరోజు స్నానం చేసిన విష్ణులోకమునకు వెళ్ళగలరు. మూడవ నాటి స్నానం వలన విష్ణుదర్శనము కలుగుతుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుష్యునకు మరుజన్మ ఉండదు.

దేవీ! మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకరరాశియందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా – నదిగానీ, చెరువుగానీ, నుయ్యి గానీ, కాలువ గానీ, లేక పాదము మునుగునంత నీరున్నచోట గానీ ప్రాతఃకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని, విష్ణ్వాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం చెప్పనలవి కాదు.


ఏ మానవునకైననూ తన శరీరంలో శక్తిలేక, నడువలేనటువంటి వాడు, గోవుపాదం మునుగునంత నీరున్న ఏ సెలయేరునందైనను, బావియందైననూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవిస్తున్నా వాని కష్టములు మేఘమువలె విడిపోయి విముక్తుడవుతాడు. ఎవరైనను తెలిసిగాని, తెలియకగాని, మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నాన మాచరించిన యెడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కుతుంది. మాఘమాసమంతట ప్రాతఃకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక ఎన్నటికి పునర్జన్మ కలుగదు. ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఇది ఆచరించవచ్చును. మానవుడు నరజన్మము ఎత్తిన తరువాత మరల ఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీస్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తిపొందుట శ్రేయస్కరము. ఇది మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం. ఓ పార్వతీ! ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టి వాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరిస్తాను సావధానురాలివై ఆలకించు.

నేను తెలియచేసిన విధముగా ఏ మనుష్యుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున జపముగానీ, విష్ణుపూజ గానీ, యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టి వాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. కుంభీ నరకములో పడద్రోయబడి, అగ్నిలో కాల్చబడును. రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడి సలసల కాగు తైలములో వేయబడి భయంకర యమకింకరులచే పీడింపబడతాడు. ఏ స్త్రీ వేకువ ఝాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము, విష్ణు పూజ చేసి, తన భర్త పాదములకు నమస్కరించి, అత్తమామలకు సేవలు చేయునో, అట్టి ఉత్తమ స్త్రీకి అయిదవతనం వర్ధిల్లి, ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికీ నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో, అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక, ఆమె పంది, కుక్క మొదలైన జన్మములు ఎత్తి హీనస్థితి పొందుతుంది. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీయైనను, బాలికయైనను, జవ్వనియైనను, మాఘస్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికిని శ్రేయోదాయక మైనది. “ పార్వతీ! దుష్టులతో సావాసము చేసినవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణము దొంగిలించిన వారు, గురు భార్యతో సంభోగించు వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన యెడల వారి సమస్త పాపములు నశించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారు, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారు, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వారు, అసత్యమాడి పొద్దు గడుపు వారు, మిత్రద్రోహియు, హత్యలు చేయువారు, బ్రాహ్మణులను హింసించు వారు, సదా వ్యభిచార గృహములో తిరిగి తాళి కట్టిన ఇల్లాలిని, కన్నబిడ్డలను వేధించు వారు, రాజ ద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివారు, దైవభక్తులను ఎగతాళి చేయువారు, గర్వం కలవారు, తాను గొప్ప వాడనను అహంభావముతో దైవకార్యములను, ధర్మకార్యములను, చెడగొట్టుచూ దంపతులకు విభేదములు కల్పించి సంసారములను విడదీయు వారు, ఇండ్లను తగులబెట్టువారు, చెడు పనులకు ప్రేరేపించు వారు, ఈ విధమైన పాప కర్మలు చేయువారలు, ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన యెడల వారందరూ పవిత్రులు అవుతారు.


“దేవీ! ఇంకనూ దాని మహాత్యమును వివరించెదను విను. తెలిసి ఉండి పాపములు చేయు వాడు, క్రూర కర్మలు ఆచరించు వాడు, సిగ్గు విడిచి తిరుగు వాడు, బ్రాహ్మణ దూషకుడూ, మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. ఆలా చేసినచో సత్ఫలితం కలుగుతుంది. ఏమానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటినుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసెదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధులయి అతనికి పరమపదము చేరు అర్హత కలుగుతుంది.

శాంభవీ! పండ్రెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితమును కలుగచేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్టు అవుతుంది. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు. అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానం చేయించినయెడల ఆస్నాన ఫలము పొందగలరు. అదియునూ గాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసినయెడల మంచి ఫలితము కలుగును.

ఈవిధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుష్యుడైననూ అపహాస్యంగా చూసినా, లేక అడ్డు తగిలినా మహాపాపములు సంప్రాప్తిస్తాయి. మాఘ మాసం ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రినీ, తల్లినీ, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించునటుల ఏమానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది. ఆవిధముగా బ్రాహ్మణునిగానీ, వైశ్యుని గానీ, క్షత్రియుని గానీ, శూద్రుని గానీ, మాఘ మాసస్నానం చేయమని చెప్పినయెడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులూ ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గానీ, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గానీ ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుఃక్షీణమై, వంశక్షయమై దరిద్రులు అవుతారు.


నడుచుటకు ఓపిక లేని వారు, మాఘమాసంలో కాళ్ళూ, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్ళు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గానీ, వినుట గానీ చేసిన యెడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందుతారు. పాపములు, దరిద్రము, నశించాలి అంటే మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేది లేదు. వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగుతుందో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగుతుంది. బ్రాహ్మణ హత్య, పితృ హత్య మహాపాపములు చేసిన మనుష్యుడైనా మాఘమాసమంతయూ కడునిష్ఠతో ఉన్నఎడల రౌరవాది నరకములనుండి విముక్తుడవుతాడు.

కనుక ఓ పార్వతీ! మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు