💥శ్రీ సూర్య నారా (నామా) యణం:
⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏
💥శ్రీ సూర్య నారా (నామా) యణం:
సూర్యునికి సంస్కృతంలో చాలా పర్యాయ పదాలున్నా ‘అమరకోశం’లో –
"సూరా, సూర్యార్యమాదిత్య ద్వాదశాదిత్య దివాకరాః- భాస్కరా హస్కర బ్రద్న ప్రభాకర విభాకరాః- భాస్వద్వివస్వ త్సప్తాశ్వహరి దశ్వోష్మ రస్మయః –వికర్తనార్క మార్తాండ మిహిరారుణ పూషణః- ద్యుమణి స్తరణిర్మిత్రశ్చిత్ర భాను ర్విరోచనః –విభావసు ర్గ్రహ పతి స్త్వషాంపతి రహర్పతిః- భానుర్హంస సహస్రాంశు స్తపన స్సవితా రవిః"
అని చెప్పి ఇవికాక
"కర్మ సాక్షీ జగచ్చక్షు రంశుమాలీ త్రయీతనుః – ప్రద్యోతనో దినమణిః ఖద్యోతో లోక బాన్ధవః – సురోత్తమో ధామ నిధిః పద్మినీ వల్లభో హరిః" అనీ చెప్పింది.
💥సూర్య నారా (నామా ) యణ రహస్యాలను తెలుసుకొని తరిద్దాం.
సూర్యుని ముఖ్యనామాలు 37. ఇవి కాక మరో 12 తో కలిపి 49 పేర్లు ఉన్నట్లు పైన చెప్పబడిన శ్లోకాల ద్వారా తెలుస్తోంది.
"సరతి గచ్చతి ఇతి సూరః" అని లింగా భట్టు చెప్పాడు. దీనికీ ఇన శబ్దార్ధమే. శూర అని అనుకొంటే విక్రమించేవాడు అవుతాడు.
సూర్య అంటే సర్వ ప్రాణులకు చైతన్య ప్రదాత అని అర్ధం. తరువాత "ఆర్యమ" అన్నా గమనం ఉన్నవాడనే అర్ధం –"ఋ గతౌ" అనే ధాతువు నుండి ఏర్పడిన శబ్దం ఇది.
కశ్యప ప్రజాపతి భార్య అదితికి పుట్టాడు కనుక ఆదిత్యుడు. ఆమె దేవతలకు మాత.
ఇంద్ర ధాత పర్జన్య త్వష్ట పూష ఆర్యమ భగ వివస్వత విష్ణు అంశుమంత వరుణ మిత్ర అనే 12 మూర్తులున్నవాడు కనుక ద్వాదశాత్ముడు.
దివము అంటే పగలును చేసేవాడు కనుక దివాకరుడు. దిన భాగంలో ప్రాణులను చైతన్యం చేసేవాడనీ అర్ధం.
"భాసం కరోతి –ఇతి భాస్కరః" అమేయమైన కాంతినిచ్చేవాడు. ఆహాస్సును చేసేవాడు ఆహాస్కరుడు.
చీకటిని కట్ట కట్టి దూరంగా విసిరేసేవాడు కనుక "బ్రద్నుడు" బంధించే వాడని భావం.
ప్రభ, విభ అనే ప్రశస్త అత్యధిక కాంతినిచ్చేవాడు కనుక ప్రభాకరుడు, విభాకరుడు. సర్వ ప్రాణి కోటికీ దర్శన సామర్ధ్యం కలిగించటాన్ని ప్రశస్తత అంటారు.
కిరణాల ద్వారా అన్నాదులను ఏర్పాటు చేయటం విశిష్టత. ఇలాంటి ప్రయోజనాలు అనేక లోకాలకు అనంత వెలుగులు కలిగించేవాడు కనుక "భాస్వంతుడు"
కాంతితో సర్వాన్నీ కప్పేస్తాడు కనుక "వివస్వంతుడు"
"వస" అనే ధాతువుకు ఆచ్ఛాదనం అని అర్ధం.
ఏడు గుర్రాలపై వస్తాడు కనుక "సప్తాశ్వుడు"
హరిదశ్వ అనే పదానికి పచ్చ గుర్రాలున్నవాడు అని అర్ధం. సృష్టి లోని పచ్చదనానికి సూర్యుడు ప్రతీక. ఈ పచ్చదనం సంపద సౌభాగ్యాలకు ప్రతీక.
సూర్యుడికి ‘ఉష్ణ రశ్మి’ అనే పేరుంది. కిరణాలు కలవాడని అర్ధం. సూర్యుడు విశ్వ దేహానికి అవసరమైన వేడిని తగిన ప్రమాణంలో కిరణాల ద్వారా అందిస్తూ విశ్వాన్ని రక్షిస్తాడు.
"వికర్తనుడు" అంటే ‘’వికృతంతి తమః‘’- చీకటిని చీల్చేవాడు, "వికృత కర్మణా విక్రుతః" అనే మరో అర్ధంలో విశ్వ కర్మ సూర్యుడిని సానబెట్టి ప్రతాపాన్ని సహ్యం అంటే సహించేట్లు చేశాడని అర్ధం వస్తుంది.
ప్రాణికోటికి ఈ రెండూ కావాల్సినవే. భౌతికమైన చీకటి సరే లోపల చీకటి కూడా ఉంది. అదే అజ్ఞానం. ఈ రెండిటినీ చీల్చి ప్రయోజనం కలిగిస్తాడు.
"అర్కుడు" లోకాల చేత అర్చించబడేవాడు.
మృతండ మహర్షి కొడుకు కనుక "మార్తాండుడు"
మరో అర్ధం –‘’మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండః’’ మృతమైన బ్రహ్మాండాన్ని జీవింప జేస్తున్నాడు కనుక మార్తాండుడు.
"మిహిరుడు‘’ అంటే మేఘ రూపుడై విశ్వాన్ని తడిపి జీవనం ప్రసాదించే వాడు. సూర్య కిరణాలు జలరాశిని ఆవిరి చేసి మేఘాలుగా మార్చి వర్షాన్ని స్తాయి కనుక మార్తాండ మిహిర శబ్దాలు సూర్యునికి పర్యాయ పదాలను చేశారు మన మహర్షులు.
నిరంతర సంచారి కనుక అరుణుడు. ఈ గమనం దేనికి అంటే ప్రాణి పోషణకు. అదే ‘’పూష’’
ఈ గమనం లో దివ్య జ్యోతులు కనిపిస్తాయికనుక ద్యుమణి. దీప్తి తుష్టి పుష్టి ఆరోగ్యాలను అందించే మణి. అందరికోసమే ఆకాశం లో ఆయన అనంత గమనం చేస్తాడు. ఆయన గమనం వలన ప్రాణులు చీకట్లను తరిస్తారు. ఆయన ఆకాశాన్ని తరిస్తాడు కనుక "తరణి"
సర్వ భూతరాశిపై స్నేహ భావం ఉండటం వలన ‘’మిత్రుడు"
వివిధ వర్ణాలున్నవాడు కనుక ‘’చిత్ర భానువు"
సృష్టిలోని అన్ని రంగులు సూర్య కిరణ స్వరూపాలే . విశేషంగా ప్రకాశించేవాడు కనుక ‘’విరోచనుడు‘’
ఆ కాంతి పుంజమే ఆయనకు ధనం అంటే వసువు అందుకే విభావసువు.
ఆ ధనతత్వం ప్రాణుల ప్రయోజనం కోసమే కనుక దైవం అయ్యాడు. గ్రహాలకు నాయకుడు కనుక గ్రహపతి.
తన కిరణాలను ప్రతిరూపాలైన అగ్నులను ఓషధులను దేహం లోపలి జఠరాగ్ని మొదలైన వాటిని సంరక్షిస్తాడు కనుక "త్విషాంపతి"
త్విట్టులు అంటే కాంతులు అని అర్ధం. పగటికి ప్రభువు కనుక ఆహస్పతి.
"హంతి తమః ఇతి హంసః" చీకట్లను రూపు మాపేవాడు కనుక హంస. అనంత కిరణాలున్నవాడు కనుక ‘’సహశ్రాం శువు‘’
నిద్రించే వారిని మేల్కొల్పే వాడు కనుక ‘’సవిత‘’
-సువతి –'సుప్తం ప్రేరయతి' ఇన్ని గొప్ప పనులు మనకోసం చేసేమహాత్ముడు కనుక ఆయన్ను స్తుతించాలి. స్తుతి అర్ధాన్నిచ్చే ‘’రు‘’ ధాతువు నుండి ఏర్పడినది "రవి"
లోకాలకు ఆయన కిరణాలు మాలలు మాలలుగా చేరుతాయి కనుక ‘’అంశుమాలి‘’
మూడు వేదాలు అయన శరీరంగా ఏర్పడ్డాయి. వెలుగు అంటే విద్య కనుక. అవి ఆయన నుంచి వస్తున్నాయి కనుక ‘త్రయీ తనువు’
14 లోకాలకూ వెలుగులివ్వవలసిన వాడు కనుక ప్రకృస్టం గా ప్రకాశించాలి కనుక ‘’ప్రద్యోతనుడు‘’
అందుకే దినమణి. ఆకాశంలో వెలిగేవాడు కనుక ‘’ఖద్యోతుడు‘’
ఆపని లోక బాంధవ్యం కోసమే కనుక ‘’లోక బాంధవుడు" అన్ని రకాల మహోపకారాలు లోకాలకు చేసే ఉత్తమ దేవత కనుక ‘’సురోత్తముడు‘’
ధామం అంటే కాంతికి నిధి కనుక ‘ధామనిది’.
తామర పూలను వికసింప జేసేవాడు కనుక "పద్మినీ వల్లభుడు". తమస్సు హరించేవాడు కనుక ‘హరి’
ఇదీ ప్రత్యక్ష నారాయణుడైన "శ్రీ సూర్య నారా (నామా) యణం"
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment