ఆశ్వయుజ బహుళ చతుర్దశి.. నరక_చతుర్థశీ
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
💥 ఆశ్వయుజ బహుళ చతుర్దశి.. నరక_చతుర్థశీ
"నరక చతుర్దశి" ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది.
హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు.
ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.
నరకుడు ప్రాగ్జోతిషపురం అను రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరం గానే పెంచింది.
దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు.
స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణు ద్వేషియై దేవతలను హింసించసాగాడు.
దేవమాత అదితి కర్ణ ఆభరణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు.
మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ వారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇతనికొక వ్యసనం.
ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రుని పైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.
ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు.
అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని
సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు "నరక చతుర్థశి"గా
పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.
నరకుని చెర నుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.
నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.
ఆరోజు అమావాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.
💥నరకచతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు.
ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి.
ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి .
యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ
తర్పణం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు.
అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి' అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది.
యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతో పాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు
కాలుస్తారు.
ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ
తొలగుతుందని భారతీయుల నమ్మకం.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసిన వారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.
చతుర్దశ్యాం తు యే దీపాన్
నరకాయ దదాతి చ |
తేషాం పితృగణా స్సర్వే
నరకాత్ స్వర్గ మాప్నుయుః ||
చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గ నివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారుచేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పలువురు నమ్ముతారు
💥 నరక భావాలు అంటే దుర్భావాలను.. కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది నరక చతుర్దశిలోని అంతరార్థం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment