💥ఆశ్వయుజ అమావాస్య.. దీపావళి

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


💥ఆశ్వయుజ అమావాస్య.. దీపావళి


భారతీయ సంప్రదాయంలో దీపం దైవస్వరూపం. జ్ఞానానికి సంకేతం. ఆనందానికి ప్రతీక. అందుకే దీపాన్ని లక్ష్మీరూపంగా భావిస్తారు. ఆ తల్లి కటాక్షం కోసం దీపాన్ని వెలిగిస్తారు.


దీపాలు మనలో నెలకొని ఉన్న చీకట్లను చీలుస్తాయి. అజ్ఞాన అంధకారాన్ని పరిమార్చుతాయి. జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి.


జీవితంలో వెలుగు-నీడలు సహజం. చికాకులే చీకట్లు. సత్ప్రవర్తనతో మెలగడమే వెలుగు.


చీకటి నరకం.. వెలుగు స్వర్గం.. నరకుడు చీకటి.. ఆ చీకటిని చిదిమేసిన కాంతిపుంజం సత్యభామ! ఆ వెలుగులు విరజిమ్మిన రోజు లోకానికి దీపావళి.


💥🪔🪔#దీపావళి🪔🪔💥


నరకాసురుడిది గొప్ప జన్మ. హిర్యణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన ఆది వరాహమూర్తి ఆ తల్లికి అనుగ్రహించిన వరం అతడు.


వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే.. త్రేతాయుగంలో కాన్పు అయింది.


ఆసురీ లక్షణాలతో పుట్టాడు బిడ్డ. కొడుకు ఆలనాపాలనా జనక మహారాజుకు అప్పగించింది భూదేవి.


జనకుడు తన కొడుకుతో సమానంగా నరకుడినీ పెంచాడు. తానే బలవంతుడిననే గర్వం నరకుడిని కుదురుగా ఉండనివ్వలేదు. కుర్రాడి ఆగడాలు మితిమీరిపోవడంతో అతడిని మళ్లీ భూదేవికి అప్పగించాడు జనకుడు.


విష్ణుమూర్తిని వేడుకుంది భూదేవి.

ప్రాగ్‌జ్యోతిషపురానికి నరకుణ్ని రాజును చేశాడు విష్ణువు. 


ఆరు దుర్గాలతో శత్రు దుర్భేద్యమైన అద్భుత నగరాన్ని నిర్మించుకున్నాడు. అవి అరిషడ్వర్గాలకు ప్రతీకలు.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఆవరించి చీకట్లో బతుకుతున్నాడు నరకాసురుడు.

తను చీకట్లో ఉండటమే కాదు.. పద్నాలుగు భువనాలనూ గాఢాంధకారంలోకి నెట్టాడు.


సహజ బలానికి తపశ్శక్తి తోడైంది. కామాఖ్యా కాళి అనుగ్రహం వరమైంది. అదే అదనుగా లోకానికి శాపంగా పరిణమించాడు.


మితిమీరిన కామం, అంతులేని క్రోధం, అంతకుమించిన లోభత్వం, అన్నిటికన్నా అహంతో ఇష్టారీతిగా వ్యవహరించి చీకట్లో కూరుకుపోయాడు.


చెడుమార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది.


అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది. దేవతలు కృష్ణుడితో తమ బాధలు చెప్పుకొన్నారు. కృష్ణుడు కదిలాడు. 


యుద్ధం చూస్తానంటూ సత్యభామా వెంట నడిచింది. భీకర యుద్ధం మొదలైంది. తానూ యుద్ధం చేస్తానంటూ కృష్ణుడి చేతిలోని ధనుర్బాణాలను తీసుకుంది.


నరకుడి రాజ్యానికి రక్షగా ఉన్న ఆరు వలయాలనూ నేలమట్టం చేసింది. అప్పటిదాకా నరకాసురుణ్ని పీడిస్తున్న దోషాలన్నీ పరిహారం అయ్యాయి. చీకటి తెరలు తొలిగిపోయాయి. నరకుడు నేలకూలాడు. 


పారమార్థికంగా చూస్తే దివ్య తేజస్సు ప్రసరించడంతో అతడిని ఆవహించిన చీకటి మాయమైంది.


అసుర సంహారంతో సురలు సంతసించారు. ప్రతి లోగిలీ మురిసింది. ఇంటింటా దీపాలు. వీధి వీధినా వెలుగులు.

ఇలపై వేల దీపాలు. ఆకాశంలో నక్షత్ర దీపాలు.


చీకట్లు పూర్తిగా తొలిగాయి. నరకుడి సంహారం ఓ రాక్షసుడి కథ ముగింపుగా భావిస్తే.. దీపావళి పరిపూర్ణం అవ్వదు.


దీపం వెలుగు పడగానే చీకటి మచ్చుకైనా కనిపించదు. అదే దివ్వె ఆరిపోతే అంతా చీకటే!


ప్రతి మనిషిలోనూ మంచి-చెడు ఉంటాయి. మంచి తొలగిపోతే.. మనిషిగా మనలేం. చెడు వీడితేనే మానవ జన్మకు సార్థకత.


మంచి అనే దీపాన్ని వెలిగించి చెడు అనే చీకట్లను పారదోలుదాం!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు